Naim Kassem: ఇజ్రాయెల్‌తో పోరాడుతూనే ఉంటాం.. హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ కస్సెమ్

by vinod kumar |
Naim Kassem: ఇజ్రాయెల్‌తో పోరాడుతూనే ఉంటాం.. హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ కస్సెమ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌తో నిరంతరం పోరాడుతూనే ఉంటామని, లెబనాన్‌పై దాడి చేస్తే తిప్పి కొట్టేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ కస్సెమ్ అన్నారు. సుధీర్ఘ యుద్ధానికి హిజ్బుల్లా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. నస్రల్లా మరణం మా ప్రణాళికలను మార్చలేదని స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఓ టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడారు. భూదాడిని ప్రారంభించాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంటే లెబనాన్‌ను రక్షించడానికి హిజ్బు్ల్లా మిలిటెంట్లు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న దాడుల్లో హిజ్బుల్లా అగ్ర కమాండర్లు హతమైనప్పటికీ, హిజ్బుల్లా ప్రస్తుతం కొత్త మిలిటెంట్లపై ఆధారపడుతోందని తెలిపారు. తమ సైనిక సామర్థ్యాలను ఇజ్రాయెల్ ఏ మాత్రం ప్రభావితం చేయలేదన్నారు. కాగా, హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణానంతరం ఆ సంస్థకు తాత్కాలిక అధ్యక్షుడిగా కస్సెమ్ వ్యవహరిస్తున్నాడు.

కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. హిజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడుతోంది. గత పది రోజుల్లో జరిగిన వివిధ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాతో సహా ఆ సంస్థకు చెందిన ఆరుగురు అగ్రనేతలు మరణించారు. అలాగే తమ దేశంలో 1000 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు లెబనీస్ ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో మహిళలు, పిల్లలే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అనేక మంది స్థానభ్రంశం చెందినట్టు పలు కథనాలు పేర్కొంటున్నాయి. కాగా, అక్టోబరు 7న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed