- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సముద్రంలో సయ్యాటలు.. ఆకర్షిస్తున్న లక్షద్వీప్ పర్యాటక ప్రాంతం
మాల్దీవులు, అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులు వీటిలో ఎక్కడికి వెళితే బాగుంటుంది? జనం రద్దీ ఎక్కువగా ఉండని ప్రదేశమని లక్షద్వీప్‌కు వెళ్లాలని నిర్ణయం జరిగింది. అక్కడికి వెళ్లడానికి రెండే మార్గాలున్నాయి. ఒకటి జలమార్గం రెండు వాయు మార్గం. మేము YHAI NATIONAL PROGRAMMEలో బుక్ చేసుకున్నాము కాబట్టి విమానంలోనే వెళ్ళవలసి వచ్చింది. ఒక్క విమానంలో వెళ్లే సౌకర్యం కూడా లేదు. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లి, అక్కడ నుంచి మరో విమానంలో అగత్తి ద్వీపానికి వెళ్ళాలి. లక్షద్వీప్ ఎయిర్ పోర్టు అగత్తిలో మాత్రమే ఉన్నది. మేము అనుకున్నంత సులువు కాదు లక్షద్వీప్ వెళ్ళడం.. ఖచ్చితంగా అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి పత్రం పొందాలి. దానికి కూడా పెద్ద ప్రాసెస్ ఉన్నది. ఎట్టకేలకు అనుమతి పత్రం వచ్చింది. అనుకున్న రోజు ప్రయాణం చేయగలిగాను.
హైదరాబాద్ నుంచి కొచ్చి గంటన్నర ప్రయాణం. అక్కడి నుంచి అగత్తి గంటన్నర ప్రయాణం. ఉదయం 7.45కు బయలుదేరి మధ్యాహ్నం 12-15 ని. లకు అగత్తి ఎయిర్ పోర్టులో దిగాము. చాలా సార్లు విమానాలలో ప్రయాణించినా ఎప్పుడు సముద్రాన్ని చూసే అవకాశం రాలేదు. ఏ అర్థరాత్రో విమానం సముద్రాన్ని దాటడం జరిగేది. ఈసారి మాత్రం విమానంలో నుంచి సముద్రాన్ని చూడడమే కాదు విమానమే సముద్రంలో దిగిందా? అనిపించింది. ఎటుచూసినా సముద్రమే .. పర్లాంగ్ దూరం కూడా లేదు. ఒక్క చిన్న విమానం మాత్రమే దిగడానికి వీలుగా ఉన్న అతి చిన్న ఎయిర్ పోర్టు. చాలా అందంగా ఉన్నది. ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని బయటకు వచ్చేసరికి అరగంట సమయం పట్టింది.
ఉన్నత వర్గాల విలాస స్థావరం ఈ దీవి..
లక్షద్వీప్ భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం. ఈ దీవుల భూ విస్తీర్ణం 32 చదరపు కి.మీ. జనాభా 65వేలు. కవరత్తి దీవి క్యాపిటల్. ఇక్కడి నుంచే పాలన యంత్రాంగం నడుస్తుంది. కాస్త అభివృద్ధి చెందిన దీవి. ఇక్కడే షిప్ పోర్టు ఉన్నది. షిప్పులో వచ్చే వాళ్ళు ఇక్కడికే రావాల్సి ఉంటుంది. ఈ దీవి మొత్తం జనాభా పదివేలు. భూ విస్తీర్ణం పది చదరపు కి.మీ. లక్షద్వీప్ లో లక్ష అనే పదం సంఖ్యను తెలుపుతుంది. కానీ 36 దీవులున్నాయి. అన్నిటికంటే చిన్న దీవి బిత్రా. జనాభా 250. భూ విస్తీర్ణం ఒక చదరపు కి.మీ పది దీవులలో మాత్రమే మాత్రమే జనావాసాలున్నాయి. బంగారం దీవికి వెళ్లడానికి 1988 నుంచి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అక్కడ ఈ మధ్యనే మాల్దీవుల తరహాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఖరీదైన రిసార్ట్, టెలీ ప్యాడ్ లాంటివి ఏర్పాటు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఉన్నత వర్గాల విలాస స్థావరం. ఇక్కడ మాత్రమే మద్యపానానికి అనుమతి ఉన్నది. కవరత్తి, మినికాయ్, అగత్తి, అమిని అనే నాలుగు దీవులు మాత్రమే అభివృద్ధి చెందాయి. వీటిలో ఏ దీవికి వెళ్లాలన్నా ఆయా దీవుల అనుమతి పత్రం తప్పకుండా ఉండాలి. రోజుకు 200 మందిని మాత్రమే అనుమతిస్తారు. మినికాయ్ మాల్దీవులకు దగ్గరగా 135 కి.మి దూరంలో ఉండటం వల్ల అక్కడ మాల్దీవుల భాషా సంస్కృతులే ఎక్కువగా చలామణిలో ఉన్నాయి. మినికాయ్ జనాభా పదివేలు.
బౌద్ధమత వ్యాప్తి ఆధారాలు..
నేను విమానంలో వెళ్లడం వలన అగత్తి దీవికే వెళ్ళవలసి వచ్చింది. ఆక్కడి జనాభా ఎనిమిది వేలు. భూ విస్తీర్ణం తొమ్మిది చదరపు కి.మీ. అందులో ఎయిర్ పోర్టు ఏర్పాటు పోను జనావాసానికి మిగిలింది ఏడు చదరపుకి.మీ. ముస్లిం జనాభా 95%. 5% ఉద్యోగం, ఇతర అవసరాల నిమిత్తం వచ్చిన వారు. మినికాయ్‌లో అయితే మహదేవ్ అనే హిందూ ఆలయం ఉన్నది. కానీ అగత్తి లో అలాంటిది ఏమీ లేదు. మొదటి రోజు సాయంత్రం మేము మ్యూజియం సందర్శనకు వెళ్ళినప్పుడు లక్షద్వీప్ పటాన్ని చూపించి ఈ సమాచారం అంతా గైడ్ ఇచ్చిందే.. అగత్తి మ్యూజియంలో.. అశోక చక్రవర్తి కూతురు సంఘమిత్ర కాలంలో లక్షద్వీప్ లో బౌద్ధమతం వ్యాప్తి చెందిందనడానికి పురావస్తు ఆధారాలు, ధ్వంసమైన బౌద్ధ శిల్పాలున్నాయి. అక్కడి నుంచి మేము సూర్యాస్తమయం చూడడానికి వెళ్ళాము.
జనావాసం లేని ఓ ద్వీపంలో కొరల్స్..
రెండో రోజు ఉదయం అల్పాహారం ముగించి మేము గ్లాస్ బోటులో కాల్ పిత్తి ద్వీపం సందర్శనకు వెళ్ళాము. ఒక్క బోటులో ఎనిమిది మంది కూర్చోవచ్చు. గంట ప్రయాణం. అది జనావాసం లేని ద్వీపం. సముద్రం అడుగు భాగంలో ఉన్న కొరల్స్, బతికిన వాటికి చనిపోయిన వాటికి ఉన్న తేడాను వివరించాడు గైడు. ఎన్నో మెదళ్ళను ఒకే చోట కుప్ప పోసినట్లుగా మెదడు ఆకారంలో ఉన్న కోరల్స్ చాలా బాగున్నాయి. సముద్రం అంతా లేత నీలి రంగులో ఉన్నది. పైన అక్కడక్కడా నల్లగా కనిపించేది. అది కోరల్స్ ఉండే చోటు అట. అందమైన భిన్న వర్ణాల చేపలు, ఇతర జలచరాలు కనువిందు చేశాయి. పెద్ద తాబేలు కనిపించింది. దాని వయసు 150 ఏళ్ళు ఉంటుందని గైడ్ చెప్పాడు. అప్పుడే సముద్ర గర్భం నుంచి ముడుచుకొని పైకి వచ్చిన స్టార్ ఫిష్ ను చేతితో తాకి చూడడం మాటల్లో చెప్పలేని అనుభూతి. కాల్పత్తి ద్వీపం లోపలికి ప్రవేశించాక హరిత వర్ణంతో అల్లుకుపోయిన సముద్ర క్యాబేజీ చెట్ల మధ్యలోనుంచి నడుస్తూ వెళ్ళి మూడు నాలుగు సముద్ర తీరాలను చూశాము. ఏ తీరం అందం ఆ తీరానికి ప్రత్యేకం. కొన్ని రాళ్ళతో ఉంటే మరికొన్ని తళతళా మెరిసే తెల్లటి, మెత్తటి ఇసుకతో ఉన్నాయి. ఆ తీరాలలో ఆడి పాడి, ఆ ఆనందాన్ని మదిలో పదిల పరుచుకుని మూడు గంటలకు హోటలు గదికి చేరుకున్నాము. భోజనం ముగించి విశ్రాంతి తీసుకున్నాము.
సముద్ర క్రీడలతో సయ్యాటలు
మూడో రోజు సముద్ర క్రీడల కొరకు కేటాయించారు. స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్, కయాకింగ్, సీ వాక్ వంటి ఎన్నో క్రీడలు అగత్తిలో అందుబాటులో ఉన్నాయి. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఆయా ఆటలకు వెళ్ళిపోయారు. ఒక మళయాళ జంట నేనూ ముందుగా కయాకింగ్ చేయడానికి వెళ్ళాము. చిన్న బోటులో ఇద్దరు వ్యక్తులు మాత్రమే స్వయంగా ఫెడలింగ్ చేస్తూ వెళ్లడమే కయాకింగ్. ధైర్యమూ అనుభవం ఉంటే ఒక్కరైనా చేయవచ్చు. దండేలి లోని కాళి నదిలో కయాకింగ్ చేసిన చిన్న అనుభవం నాకుంది. కానీ సముద్రంలో చేయడం.. అల్లంత దూరంలో ఎగిసిపడుతున్న సముద్రంలోకి వెళ్ళడం . ... తలచుకుంటేనే భయంతో కూడిన ఉద్విగ్నత . ... ఏ తీరంలో సముద్రపు పోటు తక్కువగా ఉన్నదో గమనించి ఆ చిట్టి పడవలను బయటకు తీశారు. సేఫ్ జాకెట్ వేసుకొని సముద్రపు నీళ్ళలో ఉన్న ఆ చిన్ని పడవలోకి మెళకువగా ఎగిరి కూర్చోమని చెప్పి, నేను కూర్చున్నాక నా వెనుక గైడు కూర్చున్నాడు. సెల్ఫ్ ఫడలింగ్ తో సముద్రం లోకి ప్రయాణమైంది మా చిన్ని పడవ. నాతో వచ్చిన గైడు పేరు అమీర్. తల్లిదండ్రులు లేరు. పెళ్ళి అయింది. రెండు సంవత్సరాల పాప ఉన్నది. మొదట అరగంట సమయం ఇచ్చినా, నా ఉత్సాహాన్ని చూసి గంటదాకా తిరుగు ముఖం పట్టలేదు. అలల మీద ఆ చిన్ని పడవ వయ్యారంగా ఊగుతూ పోతుంటే..... ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్రపు అలలు నన్ను పూర్తిగా తడిపేస్తుంటే.... అమీర్ " మేడం! మనం చాలా దూరం వచ్చాము. వెనక్కి తిరిగి చూడండి. వెనుక ఎవరూ లేరు. తీరం ఎంత దూరం ఉందో చూడండి " అని హెచ్చరించే దాకా ఈ లోకంలో లేను. ఆ ఆనందాన్ని అనుభవించానే గానీ మాటల్లోకి అనువదించలేను.
మలయాళీ పాఠశాలలు..
మధ్యాహ్నం విశ్రాంతి తీసుకొని, సాయంత్రం ఐదు గంటలకు నేనూ నా స్నేహితురాలు ఊళ్లోకి వెళ్ళాము. ఏడు కిలోమీటర్ల విస్తీర్ణమే.... దారికి రెండువైపులా కొబ్బరి చెట్లూ ఆ తరువాత సముద్రం మనను వెన్నంటే వస్తుంది. ద్వీపంలో ఉన్న భావన ప్రత్యక్షంగా కలుగుతుంది. ఊరు మొత్తంలో 4,5 మసీదులున్నాయి. కెనరాబ్యాంకు శాఖ ఏటీఎం తోపాటు కనిపించింది. వీధులన్నీ నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నాయి. మూడు ప్రాథమిక పాఠశాలలు, ఒక ప్రాథమికోన్నత పాఠశాల, ఒక ఉన్నత పాఠశాల ఉన్నాయి. 1-5 తరగతులు ప్రాథమిక పాఠశాల. 6,7,8 తరగతులు ప్రాథమికోన్నత పాఠశాల. 9-12 తరగతులు ఉన్నత పాఠశాల కిందకు వస్తాయి. ఆ పై చదువులకు కొచ్చికి వెళ్ళవలసిందే... ఏడు ఎనిమిది వేలు కూడా లేని జనాభాకు ఐదు పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నారంటేనే వాళ్ళు విద్యకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో అవగతమవుతుంది. మలయాళం భాషలోనే బోధన జరుగుతుంది. ప్రాథమికోన్నత పాఠశాలకు మాత్రమే యూనిఫాం ఉన్నది. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు. పిల్లలందరూ సైకిళ్ళ పైన పాఠశాలనుంచి వస్తూ కనించారు. పిల్లలు నిర్భయంగా, ఆనందంగా, ఉత్సాహంగా కనిపించారు. మమ్మల్ని కూడా నవ్వుతూ పలకరించారు. చాలా మంది మహిళలు కూడా నవ్వుతూ పలకరించారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా కాలుష్యం లేని ప్రశాంత వాతావరణంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. ముస్లిం మహిళలే అయినా బురఖాలు వేసుకోలేదు. ఆరా తీయగా తమ ప్రాంతం దాటి బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే వేసుకుంటారట.స్థానిక భాష ఘస్రి. తమిళం, మలయాళం, అరబిక్ భాషల మిశ్రమమే ఘస్రిభాష. దీనికి లిపి లేదు. తిరిగి హోటలుకు చేరుకునే దారిలో మాకు కార్డెల్లా అనే షిప్పు రేవులో ఆగి కనిపించింది. అక్కడ స్థానికులు వారు చేతితో చేసిన, స్థానికంగా దొరికే వస్తువులను అమ్ముతున్నారు.
బంగారు ద్వీపంలో తాబేళ్లు..
నాలుగో రోజు మా ప్రయాణం బంగారం, తిన్నకరా ద్వీపాలకు కానీ బంగారం ద్వీపానికి ప్రవేశం ఈ మధ్యకాలంలోనే నిషేధించారట. ఈ రెండు ద్వీపాలు పక్కపక్కనే ఉన్నందువలన మేము బోటులోనుంచే బంగారం ద్వీపం అందాలను వీక్షించాము. పెద్ద పెద్ద తాబేళ్లు ఐదారు కనిపించాయి. సముద్రంలో అవి స్వేచ్ఛగా ఈదుకుంటూ వెళ్ళడం కనుచూపుమేరా కనిపించింది. డాల్ ఫిన్లు కూడా ఉన్నాయని చెప్పారు కానీ అవి మాకు కనిపించలేదు. తిన్నకరా ద్వీపం కూడా జనావాసం కాదు. అయితే బంగారం ద్వీపానికి మల్లే దానిని కూడా ఖరీదైన రిసార్టుగా మార్చడానికి పనులు ప్రారంభమయ్యాయి అనడానికి గుర్తుగా కొంత మంది నిర్మాణాలకు వినియోగించాలని పిల్లర్లు తయారు చేస్తూ కనిపించారు. బోటు దిగి పచ్చటి చెట్ల గుండా సముద్ర తీరానికి వెళ్ళాము. లేత నీలి రంగు సముద్రం రా రమ్మని పిలుస్తున్నట్లు ఉన్నది. అలలు పెద్దగా లేవు. చాలా సేపు జలకాలాడి ఒడ్డుకు చేరాము. చిన్నపిల్లలమైపోయి గవ్వలు, ఆల్చిప్పలు, శంకులు, రంగు రాళ్ళు ఎన్నో సేకరించాము. ఇలాంటి సందర్భాలలో మళ్ళీ బాల్యం లోకి వెళ్ళకుండా ఉండలేము. గైడు పిలిచేదాకా సమయమే తెలియలేదు. తిరిగి బోటు కదిలింది. బోటులోనే భోజనం ముగించాము.
సముద్రంలో కలిసిపోయే తిన్నెలు..
మా ప్రయాణంలో మరో ముఖ్యమైన ప్రదేశం సాండ్ బ్యాంక్స్ (ఇసుక తిన్నెలు). సాధారణంగా ఇసుక తిన్నెలు నదీ తీరంలో, సముద్ర తీరంలో ఉంటాయి. కానీ ఇది తీరం కాదు దీవి. చుట్టూర నీలి రంగు సముద్రం. మధ్యలో తళతళ మెరుస్తున్న సాండ్ బ్యాంక్స్. మరికొంత దూరం పాదాలు కూడా మునగనంత సన్నటి నీటి ప్రవాహం. బోలెడన్ని పక్షులు. మనం దరికి చేరగానే ఒక్కసారిగా ఆకాశం లోకి ఎగిరి పోయాయి. సన్నటి నీటి పొరలో, మెత్తటి ఇసుకలో నడుస్తుంటే అది కాళ్ళకున్న స్పర్శానందం అనుభవించ కవలసిందే... ప్రకృతి భిన్న వర్ణాల చీరను సింగారించుకొని మా కోసమే వచ్చిందా! అన్నట్లుగా ఇసుక, ఆ పైన లేలేత, లేత, ముదురు నీలం రంగులో సముద్రం, చివరగా ఆకుపచ్చని చెట్లు.... ఆ దృశ్యం ప్రసిద్ధ చిత్రకారుడు గీసిన అందమైన చిత్రపటం లాగా ఉన్నది. ఇవి మధ్యాహ్నం సమయంలో మాత్రమే ఉంటాయట. తరువాత సముద్రంలో కలిసి పోతాయట. అక్కడ తనివి తీరా గడిపి బోటెక్కాము.
సముద్రంలోని ప్రాణికోటిని చూపించే స్నోర్కెలింగ్..
స్నోర్కెలింగ్‌కు వీలుగా ఉన్న ప్రదేశంలో బోటును ఆపారు. ఇరవై ఐదు మంది బృందంలో నలుగురు మహిళలు, ఆరుగురు పురుషులు స్నోర్కెలింగ్ చేశాము. కొంత మంది ప్రయత్నించి విఫలమయ్యారు. నలుగురు మహిళలలో ఒకరు ఇద్దరి సహాయంతో చేయగలిగారు. మిగతా ముగ్గురం ఒక్కరి సహాయంతోనే చేశాము. నీళ్ళ పై తేలుతూ తల కిందకు వంచి, సముద్ర గర్భంలోని ప్రాణికోటిని వీక్షించడమే స్నోర్కెలింగ్. అద్భుతమైన అనుభవం. మొదటి రోజు గ్లాసు బోటులో నుంచి చూసిన దృశ్యాలను స్కోర్కలింగ్ లో అతి సమీపంగా వెళ్ళి, చూడడం గొప్ప అనుభూతి. సముద్రం అడుగులో ఉన్న కోరల్స్ మనకు తగులుతూయేమో అన్న భయంతో కూడిన ఉత్సాహం. రంగు రంగుల చేపల సమూహాల్లో నేనూ ఒక మత్స్య కన్యను అయిన అనుభూతి. ఆ కోరల్స్‌ను స్వయంగా చేతితో తాకినప్పుడు ఉద్వేగంతో కూడిన ఉత్సాహం. సజీవమైనవి మృదువుగాను, మృతి చెందినవి గట్టిగాను ఉండడం గమనించాను. పది కాలాల పాటు పదిలంగా ఉండే అనుభూతులను మూటగట్టుకుని ఒడ్డుకు చేరాను. వెళ్ళేటప్పుడు సీ గ్రీన్ రంగులో ఉన్న సముద్రం తిరుగు ప్రయాణంలో నల్లగా మారిపోయి ఆకాశంలో ఉన్న నల్లటి మబ్బులతో కలిసిపోయి, సముద్రం, ఆకాశం రెండూ ఏకమయ్యాయా! అన్నట్లు ఉన్నది.
జాలీ ఉయ్యాలలో ప్రకృతి సంగీత కచేరీ..
మేము బస చేసిన వైట్ పారడైజ్ హోటల్ తెల్లటి మెత్తటి ఇసుకలో సముద్ర తీరానికి ఫర్లాంగు దూరంలో ఉన్నది. పౌర్ణమి రోజులు. నిశ్శబ్దమైన వెన్నెల రాత్రి, కొబ్బరి చెట్ల ఆకుల సవ్వడులు, కనుచూపు దూరంలో సముద్రపు అలల గలగలలు, ప్రకృతి స్వయంగా సంగీత కచేరీ చేస్తోందా! అన్నట్లుగా ఉన్నది. రెండు కొబ్బరి చెట్లకు కలిపి కట్టిన జాలి ఉయ్యాలలో గాలికి అలా అలా ఊగుతూ .... ఆ ప్రశాంత వాతావరణంలో మైమరచి ఆ ప్రకృతి సంగీతాన్ని అలకిస్తున్నప్పుడు వచ్చిన ఆనందంతో మరికొంతకాలం ఆరోగ్యంగా బతికేయడం ఖాయం అనిపించింది. రోజు సముద్రానికి అతి దగ్గరలో ఉంటూ సముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పులను గమనించిన మాకు ఒకరోజు 3,4 గంటల సమయంలో ఒక వింత కనిపించింది. తీరానికి అతి సమీపంలో ఒక దీవి లాంటిది బయట పడింది. అంతకు ముందు మేము దాన్ని చూడలేదు. అతి దగ్గరలో ఉన్నందువల్ల దాని మీదకు వెళ్లాలనే ఉత్సాహం ఉరకలు వేసింది. కానీ సముద్రపు లోతును అంచనా వేయలేం కదా..... చిన్న పడవ ఏదైనా దొరుకుతుందేమోనని చూశాము. ఆశ నిరాశ అయింది. ఆ అద్భుతమైన ఆవిష్కరణను కెమెరాలో బంధించి తృప్తిపడ్డాను. తెల్లవారి ఉదయము సముద్రపు ఒడ్డుకు వెళ్ళాను. ఆ దీవి అక్కడ లేదు. బహుశా నీళ్ళలో మునిగి పోయి ఉంటుంది. ఇలా సందరం నాతో ఎన్నో సయ్యాటలాడింది.
పురుషులే పాల్గొన్న సాంస్కృతిక ప్రదర్శన..
చివరి రోజు రాత్రి డిన్నర్ తర్వాత లక్షద్వీప్ స్థానిక సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. నేతాజీ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ సంస్థ వారు ప్రదర్శించారు. ఉన్స్కాన్ అండ్ గ్రూప్ 14 మంది పాల్గొన్నారు. పెరిజెకలి, కోల్కలి, కుడల్కలి అనే నృత్య భేదాలు ప్రదర్శించారు. ' కలి ' అంటే నృత్యం అని అర్ధం. మొదటిది కత్తి డాలు లాంటి వాటితో ప్రదర్శించారు. రెండోది కోలలతో. మన రోకళ్ళ లాంటి కర్రలతో ప్రదర్శించారు. ఈ బృంద నృత్యాలలో 16 మంది ఉంటారట. మహిళలు లేరు. పురుషులు మాత్రమే చేశారు. ఇదే విషయం బృంద నాయకుడిని అడిగినప్పుడు.. మహిళలు కుండలతో ' భాండియా ' అనే నృత్యాన్ని వాళ్ళ సంప్రదాయ వేడుకల సమయంలో మాత్రమే ప్రదర్శిస్తారని చెప్పాడు. వాళ్ళ ప్రోత్సాహంతో మా బృందంలోని ఇద్దరు మన రోకళ్ళ లాంటి కర్రలు మధ్యలో కొన్ని స్టెప్పులు వేయడానికి ప్రయత్నించారు. అయితే వాళ్ళ వేగాన్ని అందుకోవడం కష్టమే.. ప్రతి నృత్యం నెమ్మదిగా మొదలై వేగంగా ముగిసింది. నృత్యానికి తగిన పాటలు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో వాళ్ళే పాడారు. కార్యక్రమం హుషారుగా గంటన్నర పాటు సాగింది.
దొంగతనాలు ఎరుగని శ్రమైక దీవి..
మేము మొదటిరోజు హోటల్‌కి వచ్చి లగేజీ ప్రస్థావన చేసినప్పుడు.. మా స్థానిక ఆర్గనైజర్ మిడ్లజ్ అన్న మాటలు " మేడం, ఇది లక్షద్వీప్, ఎలాంటి ఇబ్బంది కలగదు, నిశ్చింతగా ఉండండి "అన్నాడు. తర్వాత కయాకింగ్ కు సన్నద్ధతకువుతున్న సందర్భంలో క్యాష్ తో కూడిన హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తున్నప్పుడు అక్కడి గైడు కూడా అదేమాట చెప్పాడు. "ఇది లక్షద్వీప్ మేడం.. మీరు లక్షలు పెట్టినా ఎక్కడికీ పోవు" అని. ఈ మాటలు ఎందుకు రాశానంటే.. అక్కడ దొంగతనాలు లేవు. మనుషులు నీతి నిజాయితీలతో స్వచ్ఛంగా ఉన్నారు. శ్రమైక సౌందర్యం తెలిసి కష్టపడుతున్నారు. మద్యపానం, పొగతాగడం వంటివి లేవు. చేపల వేట, కొబ్బరికాయల దిగుబడి ఈ రెండూ అక్కడ ప్రధాన వృత్తులు. నిత్యావసర వస్తువులన్నీ కోచ్బీ నుంచి కార్గో షిప్పులో వస్తాయి. అక్కడికి కొచ్చి 200 కి.మి దూరం.
చివరగా ఒక్క మాట .. పర్యాటక అభివృద్ధి పేరుతో అక్కడి ప్రశాంతతను ధ్వంసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది స్థానికులకు ఇష్టం లేదని స్పష్టంగా చెప్పారు. చూడాలి.. ఆ ప్రకృతి మాతనే వాళ్ళకు తన ఒడిలో స్థానాన్ని సుస్థిరం చేస్తుందని ఆశిస్తాను.
- గిరిజా పైడిమర్రి
ప్రముఖ ట్రావెలర్
99494 43414