Jam Saheb : పోలాండ్‌లో ప్రధాని మోదీ నివాళులర్పించిన నవనగర్ జామ్ సాహెబ్ ఎవరు..? పోలిష్ ప్రజలకు అతను చేసిన సహాయం ఏంటి..?

by Maddikunta Saikiran |
Jam Saheb : పోలాండ్‌లో ప్రధాని మోదీ నివాళులర్పించిన నవనగర్ జామ్ సాహెబ్ ఎవరు..? పోలిష్ ప్రజలకు అతను చేసిన సహాయం ఏంటి..?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పోలాండ్‌ దేశం వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మోడీ పోలాండ్‌ రాజధాని వార్సాలోని నవనగర్ స్మారక చిహ్నంలో ఉన్న జామ్ సాహెబ్‌ మెమోరియాల్ ను సందర్శించి నివాళులర్పించారు. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పోలిష్ పిల్లలకు ఆశ్రయం కల్పించిన వ్యక్తే ఈ జామ్ సాహెబ్. ఇతని అసలు పేరు జామ్ సాహెబ్ దిగ్విజయ్‌సిన్హ్‌జీ రంజిత్‌సిన్హ్‌జీ జడేజా. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పోలిష్ పిల్లలకు ఆశ్రయం కల్పించి రక్షణ అందించిన రంజిత్‌సిన్హ్‌జీ జడేజాను పోలాండ్‌లో డోబ్రీ మహారాజాగా గుర్తుంచుకుంటారు.

అసలు జామ్ సాహెబ్‌ ఎవరు..?

జామ్ సాహెబ్‌ సెప్టెంబరు 18, 1895న గుజరాత్ రాష్ట్రం జామ్ నగర్ లోని సరోదర్‌లో జన్మించాడు. ఇతను నవనగర్ పాలకుడు రంజిత్‌సిన్హ్జీ విభాజీ జడేజా యొక్క తమ్ముడు. రంజిత్‌సిన్హ్జీ విభాజీ జామ్ సాహెబ్‌ను దత్తత తీసుకుని తన వారసుడిగా పెంచారు.జామ్ సాహెబ్‌ తన విద్యను రాజ్‌కుమార్ కాలేజీ, మాల్వెర్న్ కాలేజీ అలాగే యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో పూర్తి చేశారు.ఇతను రెండు దశాబ్దాల పాటు ఆర్మీ లో పని చేశారు. రాజ్‌కోట్‌లోని రాజ్‌కుమార్ కాలేజ్ గవర్నింగ్ కౌన్సిల్‌కు జామ్ సాహెబ్‌ సుదీర్ఘకాలం పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. 1935లో ఆయన చేసిన విశేష కృషికి గాను అతనికి గుజరాత్ రాష్ట్రం బిరుదు కూడా ఇచ్చింది.

పోలిష్ ప్రజలకు అతను చేసిన సహాయం ఏంటి..?

అయితే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో 1941లో సోవియట్ యూనియన్ నుండి ఖాళీ చేయబడిన 1,000 మంది పోలిష్ పిల్లల శరణార్థులకు అతను ఆశ్రయం కల్పించాడు. జామ్ సాహెబ్ ఈ పిల్లలను భారతదేశానికి తీసుకువచ్చి వారికి ఆహారం అందించి , విద్య అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను నేర్పించారు.అలాగే పోలిష్ పిల్లల కోసం జామ్ నగర్ లో పాఠశాలలు, ఆసుపత్రులు అలాగే వారు చదువుకోడానికి లైబ్రరీలు కూడా ఏర్పాటు చేశాడు.కాగా జామ్ సాహెబ్‌ 1966 ఫిబ్రవరి 3న బొంబాయిలో మరణించాడు. ఆయన మరణించిన 50 సంవత్సరాల తర్వాత అనగా మార్చి 2016లో పోలాండ్ పిల్లల శరణార్థులకు ఆయన చేసిన సహాయానికి గుర్తుగా పోలాండ్ ప్రభుత్వం రాజధాని వార్సా లోని ఓచోటాలో 'జామ్ సాహెబ్ ఆఫ్ నవనగర్ మెమోరియల్'ని ఏర్పాటు చేసింది. అలాగే పోలాండ్ దేశంలో మొత్తం ఎనిమిది ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలకు అతని పేరు పెట్టారు.

Next Story

Most Viewed