ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్..

by Vinod kumar |
ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్..
X

గాజా : గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ కు ఇజ్రాయెల్ ఆర్మీ సర్వ సన్నద్ధమైన వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూ టర్న్ తీసుకున్నారు. ఇజ్రాయెల్‌ బలగాలు గాజాలోకి ప్రవేశించాక అక్కడే సుదీర్ఘకాలం పాటు ఉంటే.. అది పెద్ద పొరపాటుగా మారే అవకాశం ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. యుద్ధాల్లో పాటించాల్సిన నిబంధనలను ఇజ్రాయెల్‌ అమలు చేస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. గాజాలోని అమాయక పౌరులకు నీరు, ఆహారం, ఔషధాలు అందేలా చూడాలని ఇజ్రాయెల్ కు సూచించారు. గాజాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ మొదలవుతుందనే ఆందోళనల నేపథ్యంలో.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సోమవారం రష్యా ప్రెసిడెంట్ పుతిన్, టర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగన్ లతో ఫోన్ లో సంభాషించారు. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్‌ సరిహద్దులోని 5 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఫైరింగ్ చేశామని ఇరాన్ సపోర్ట్ కలిగిన లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ప్రకటించింది. గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి.

ఈ దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 3900 దాటగా, గాయపడిన వారి సంఖ్య 11వేలు దాటింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి జరిపిన దాడి ఘటనలపై ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (షిన్ బెట్) చీఫ్ రోనెన్ బార్ స్పందించారు. తన వైఫల్యం వల్లే ఆ రోజున నిఘా సమాచారం అందలేదని అంగీకరించారు. ఇక బ్రిటన్ లో యూదు వ్యతిరేకతకు చోటు లేదని ప్రధానమంత్రి రిషి సునక్ స్పష్టం చేశారు. యూదులను వ్యతిరేకించే కార్యకలాపాలను అరికట్టేందుకు తాము చేయగలిగేదంతా చేస్తామన్నారు. ఇటీవల బ్రిటన్ రాజధాని లండన్ లో జరిగిన పాలస్తీనా అనుకూల ర్యాలీలలో పలువురు నిరసనకారులు యూదు వ్యతిరేక నినాదాలు చేయడాన్ని రిషి తప్పుపట్టారు. తప్పుడు నినాదాలు చేసిన వారిని అరెస్టు చేశామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed