Israeli Strikes: గాజాలో పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ షురూ.. దాడులు ఆపని ఇజ్రాయెల్ !

by vinod kumar |
Israeli Strikes: గాజాలో పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ షురూ.. దాడులు ఆపని ఇజ్రాయెల్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో పిల్లలకు పోలియో వ్యాక్సినేషన్ ప్రచారాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులను పెంచింది. గాజాలోని ఎనిమిది చారిత్రాత్మక శరణార్థుల శిబిరాలతో సహా పలు ప్రాంతాల్లో వరుస దాడులు చేపట్టింది. నుసీరత్‌లో ప్రచారం ప్రారంభానికి 2,000 మందికి పైగా వైద్యులు సిద్ధమవుతుండగా ఇజ్రాయెల్ దాడుల్లో తొమ్మిది మంది సభ్యులతో సహా 19 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. అలాగే ఇతర ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో మరో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఈ ఘటనలకు ఇజ్రాయెల్ సైన్యం సైతం ధ్రువీకరించింది. సెంట్రల్, దక్షిణ గాజా స్ట్రిప్‌లో తమ కార్యకలాపాలను కొనసాగించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. హమాస్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్టు పేర్కొంది.

కాగా, గాజాలో పోలియో వైరస్ కనుగొన్న నేపథ్యంలో గాజా అంతటా 6,40,000 మంది పిల్లలకు టీకాలు వేయడానికి ఐక్యరాజ్యసమితి ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు గాజాలో 2,000 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు నియమించబడ్డారు. ఇప్పటివరకు, 1.26 మిలియన్ డోస్‌ల వ్యాక్సిన్‌లు గాజాకు చేరుకున్నాయి. సుమారు 90శాతం మంది పిల్లలకు నాలుగు వారాల పాటు రెండుసార్లు టీకాలు వేయాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ టీకాలను వేసేందుకు గాజాలోని నిర్దిష్ట ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలను ప్రతి రోజూ 8గంటల పాటు నిలిపివేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ క్రమంలోనే మరోసారి దాడులు జరగడంతో వైద్యుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement

Next Story