Israel: ఓ వైపు లెబనాన్..మరోవైపు గాజా.. వైమాణిక దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

by vinod kumar |
Israel: ఓ వైపు లెబనాన్..మరోవైపు గాజా.. వైమాణిక దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ఎక్కువయ్యాయి. లెబనాన్ రాజధాని బీరూట్, గాజాపై ఇజ్రాయెల్ వైమాణిక దాడులతో విరుచుకుపడింది. శుక్రవారం తెల్లవారుజామున సెంట్రల్ బీరూట్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌పై క్షిపణులతో అటాక్ చేసింది. ఈ ఘటనలో 9 మంది మరణించినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనంతరం ఈ ప్రాంతం నుంచి ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించినట్టు పేర్కొంది. బీరూట్ ఎయిర్ పోర్టు సమీపంలోనూ పేలుళ్లు జరిగాయి. హిజ్బుల్లా సీనియర్ లీడర్ హషీమ్ సఫిద్దీన్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇజ్రాయెల్ స్పందించలేదు. కాగా, గత నాలుగు రోజుల్లో 250 మంది హిజ్బుల్లా యోధులను తమ బలగాలు హతమార్చాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. అలాగే తొమ్మిది మంది ఇజ్రాయెల్ సైనికులు సైతం వివిధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది.

29 మంది పాలస్తీనియన్లు మృతి

గాజాపైనా ఇజ్రాయెల్ దాడులను పెంచింది. దక్షిణ గాజాలో వైమాణిక దాడులు చేయగా 29 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దాడుల అనంతరం దక్షిణ ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగాయి. సుమారు రెండు నెలల తర్వాత ఈ ప్రాంతంలో సైరన్లు మోగినట్టు తెలిపింది. ఉత్తర గాజాలోని ఒక ఇంటిపైనా వైమానిక దాడి చేయగా ఏడుగురు మరణించారు. అలాగే దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌ నగరంలోని ఓ ఇంటిపై జరిగిన బాంబు దాడిలో ఇద్దరు మహిళలు, ఒక శిశువుతో సహా నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ బ్యాంక్‌లోని తుల్కర్మ్‌పై జరిపిన దాడిలో హమాస్ నెట్‌వర్క్ చీఫ్ మరణించినట్టు పలు కథనాలు వెల్లడించాయి.

ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తాం: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

ఇజ్రాయెల్‌ను నాశనం చేయాల్సిన అవసరం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తెలిపారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో శుక్రవారం ఆయన ప్రసంగించారు. ఇజ్రాయెల్ ఎంతో కాలం కొనసాగలేదని చెప్పారు. హమాస్, హిజ్బుల్లాలను ఇజ్రాయెల్ ఎప్పటికీ ఓడించలేదని స్పష్టం చేశారు. హిజ్బుల్లా మాజీ చీఫ్ నస్రల్లాపై ఖమేనీ ప్రశంసలు కురిపించారు. ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ నస్రల్లా చూపిన మార్గం ఎప్పటికీ స్పూర్తినిస్తుందని తెలిపారు. మరింత బలంగా తయారవుతూ శత్రువులకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలపడాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడి సరైందేనని తెలిపారు. పాలస్తీనియన్లకు సహాయం చేయడం చట్టబద్దమని, దీనిపై నిరసన తెలిపే హక్కు ఎవరికీ లేదన్నారు. కాగా, నస్రల్లా మరణం తర్వాత.. ఖమేనీని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత తొలిసారిగా ప్రజల్లోకి వచ్చాడు.

నస్రల్లా అంత్యక్రియలు పూర్తి !

హిజ్బుల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ఏడు రోజుల తరువాత అంత్యక్రియలు జరిగినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడి భయంతో నస్రల్లాను రహస్య ప్రదేశంలో ఖననం చేసినట్టు పలు కథనాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగంగా అంత్యక్రియలు జరపలేమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. నస్రల్లా వారసుడిగా ఇప్పటి వరకు హిజ్బుల్లా ఎవరినీ ప్రకటించలేదు. అయితే నస్రల్లా బంధువు అయిన హషీమ్ సఫీద్దీన్ నస్రల్లా వారసుడిగా భావిస్తున్నారు. దీనిపై హిజ్బుల్లా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ధీటుగా సమాధానం ఇస్తాం: అరాఘీ

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేస్తే కఠినంగా స్పందిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ అన్నారు. బీరుట్‌లో లెబనీస్ పార్లమెంట్ స్పీకర్ నబీహ్ బెర్రీతో సమావేశమైన అనంతం ఆయన మాట్లాడారు. ఇరాన్, సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై దాడుల తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడం ఆత్మరక్షణ అని అన్నారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణకు దారితీసే ఏవైనా చర్యలకు ఇరాన్ మద్దతిస్తుందని తెలిపారు. గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పుడే ఇది సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed