- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Disha Special Story: అగ్రరాజ్యాల చెరలో అంతర్జాతీయ న్యాయం!?
ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ తోపాటు హమాస్ మిలటరీ కమాండర్ మహమ్మద్ డేఫ్‌కు సైతం వారెంట్లు ఇష్యూ చేసింది. యుద్ధ, మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు ఈ ముగ్గురు బాధ్యత వహించేలా సహేతుకమైన కారణాలు ఉన్నాయని ఐసీసీ న్యాయమూర్తులు చెప్పారు. కాగా, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్, హమాస్ రెండూ తిరస్కరించాయి. అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేయాలని ఇజ్రాయెల్ ఐసీసీలో పిటిషన్ సైతం దాఖలు చేసింది. అయితే న్యాయస్థానం అధికార పరిధిపై ఇజ్రాయెల్ అప్పీళ్లను ప్రీ ట్రయల్ చాంబర్ తిరస్కరించింది. కాగా, ఐసీసీ నిర్ణయాన్ని తాము తిరస్కరిస్తున్నట్లు అమెరికా తేల్చి చెప్పింది. వారెంట్‌ను అమలు చేయబోమని స్పష్టం చేసింది. అయితే ఈ వారెంట్ కారణంగా నెతన్యాహూ ఐసీసీలో సభ్యులుగా ఉన్న 124 దేశాల్లో పర్యటించేందుకు వీలు లేకుండాపోయింది. అంతర్జాతీయంగా రెండు న్యాయస్థానాలు ఉండగా... ఇందులో ఐసీసీ ఒకటి. ఇది యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే చర్యలపై విచారణ జరుపుతుంది. ఇంకొకటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే).. దేశాల మధ్య ఉన్న వివాదాలను ఇది విచారిస్తుంది. అయితే వాటి తీర్పులను దేశాలు పాటించడం చాలా అరుదు కావడం గమనార్హం. అంతర్జాతీయ కోర్టుల తీర్పులపై అగ్రదేశాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఎప్పుడైనా తీర్పు అగ్రరాజ్యాల అనుకూల దేశాలకు వ్యతిరేకంగా వాటిని తిరస్కరించే వీటో పవర్ వాటి చేతుల్లో ఉంటుంది. అంతర్జాతీయ న్యాయస్థానాల తీర్పులపై ప్రత్యేక కథనం. - మహమ్మద్ ఆరిఫ్
ఇజ్రాయెల్‌పై ఐసీసీ, ఐసీజేల ఆదేశాలు..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. 2023 అక్టోబర్‌లో హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభం కాగా, గాజాలో దాదాపు 44వేల మంది మరణించారని గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మానవత్వానికి వ్యతిరేకంగా యుద్ధనేరాలు, హత్యలు చేశారని ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీంఖాన్ ఆరోపించారు. దీనిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 1984 జీనోసైడ్ కన్వెన్షన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ జాతి హననానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)లో దక్షిణాఫ్రికా కేసు నమోదు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన అంతర్జాతీయ న్యాయస్థానం తక్షణ చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు కొన్ని అంశాలపై ఆదేశాలు జారీ చేసింది. పాలస్తీనియన్లకు హాని కలిగించే చర్యలను వెంటనే నిలిపివేయాలని సూచించింది. అయితే జాతిహననం ఆరోపణల్ని ఇజ్రాయెల్ ఖండించింది. పాలస్తీనియన్లకు జరుగుతున్న హానికి పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ కారణమని వ్యాఖ్యానించింది. అయితే ఐసీజే తీర్పుల అమలుకు సరైన యంత్రాంగం లేదు. దీంతో దేశాలు ఐసీజే ఆదేశాలను విస్మరించవచ్చు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సైతం..
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతుండగా.. యుద్ధ నేరాలపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఉక్రెయిన్ సైతం ఐసీసీని ఆశ్రయించింది. యుద్ధాన్ని వెంటనే ఆపివేసేలా ఆదేశించాలని కోరింది. ఈ నేపథ్యంలో యుద్ధ నేరాలపై దర్యాప్తు ప్రారంభించాలని ఐసీసీ నిర్ణయించింది. అంతకుముందు అయితే 2022 ఫిబ్రవరి నుంచి 16వేల మంది ఉక్రెయిన్ పిల్లలను రష్యాకు తీసుకెళ్లి అనాథశ్రమాల్లో ఉంచారని ఉక్రెయిన్ ఆరోపించింది. దీంతో ఫోరెన్సిక్ ఎవిడెన్స్, ప్రకటన ఆధారంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రష్యా ఒక సమయంలో అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం భవనంపై క్షిపణి దాడులు సైతం చేస్తామని హెచ్చరించింది. దీనిపై స్పందించిన చైనా పుతిన్ అరెస్ట్ వారెంట్లపై నిష్పాక్ష వైఖరిని ప్రదర్శించాలని ఐసీసీని కోరింది. మరోవైపు రష్యా దాడులపై ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)ను కూడా ఉక్రెయిన్ ఆశ్రయించింది. అయితే ఈ విచారణలో పాల్గొనేందుకు రష్యా నిరాకరించింది. తమ ప్రతినిధులెవరినీ పంపమని పేర్కొన్నది.
భారత కేసులూ ఐసీసీ, ఐసీజే వద్దకు..
- నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడగా.. స్టే ఇవ్వాలంటూ ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తలుపుతట్టారు. ఈ కేసు విచారణ తప్పులతడకగా సాగిందని, తమను బలిపశువులను చేశారని తమ పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలిపింది. అయితే దీనిపై ఐసీజే జోక్యం చేసుకోనట్లు సమాచారం.
- ఆంధ్రప్రదేశ్ లోని రాజధాని అమరావతి వివాదం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) కు చేరింది. రాజధాని తరలింపు, రైతులకు జరుగుతున్న అన్యాయం, నిర్బంధం, ఆంక్షలపై ప్రవాసాంధ్రులు ఐసీసీలో పిటిషన్ దాఖలు చేశారు. హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ ఆధారాలు సమర్పించారు. అయితే ఈ ఫిర్యాదును ఐసీసీ పరిగణనలోకి తీసుకున్నది.
చర్చనీయాంశంగా కులభూషణ్ కేసు
గూఢచర్యం పేరుతో పాకిస్తాన్ కోర్టు కూలభూషణ్ జాదవ్ అనే వ్యక్తికి ఉరి శిక్ష వేయగా.. ఈ కేసు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కులభూషణ్ జాదవ్ కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని ఐసీజే తీర్పు సైతం చెప్పింది. 2016 మార్చిలో గూఢచర్యం కేసులో కులభూషణ్ ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. 2017లో పాక్ సైనిక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. దీనికి వ్యతిరేకంగా భారత్ ఐసీజేను ఆశ్రయించింది. అక్కడ భారత్ చేసిన వాదనలను 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది ఏకీభవించారు. అనంతరం తీర్పును పునస్సమీక్షించాలని పాకిస్తాన్ కు ఐసీజే సూచించింది.
ఇంకా వివిధ కేసులు
- మయన్మార్ లో మైనార్టీల ఊచకోత, వారికి వ్యతిరేకంగా జరిగిన నేరాలపై అప్పటి సీనియర్ జనరల్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ప్రాసిక్యూటర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టును కోరారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లోనూ మయన్మార్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు అందింది.
- రోహింగ్యా ముస్లింలపై మారణహోమాన్ని ఆపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) మయన్మార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2017లో మయన్మార్ సైనిక చర్య చేపట్టిన సమయంలో వేల మంది రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోగా, 7 లక్షలకు పైగా బంగ్లాదేశ్ కు వలస వెళ్లారు. అయితే ఆ సమయంలో ఆ దేశ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ ఐసీజే విచారణకు హాజరై ఈ ఆరోపణలను ఖండించారు. తమ దేశంపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.
- సూడాన్ మాజీ అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ పై సైతం ఐసీసీ గతంలో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
- డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మిలీషియా నాయకుడు థామస్ లుబాంగాకు వ్యతిరేకంగా 2012లో ఐసీసీ మొదటి తీర్పు ఇచ్చింది. అతను అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధంలో పిల్లలను ఉపయోగించుకున్నందుకు 14 సంవత్సరాల శిక్ష విధించింది.
- ఐవరీ కోస్ట్ మాజీ అధ్యక్షుడు లారెంట్ గ్బాగ్బో పై వచ్చిన లైంగిక దాడులు, వేధింపులు, ఇతర అమానవీయ చర్యలపై ఆరోపణలు ఐసీసీ విచారణ జరిపింది.
- ఉంగాడా తిరుగుబాటు ఉద్యమ నేత, లార్డ్స్ రెసిస్టెన్స్ ఆర్మీ నాయకుడు జోసెఫ్ కోనీపై కూడా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేశారని విచారణ జరిగింది.
వీటో ఇస్తే తీర్పులకు బ్రేక్
రెండు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన ఇంటర్నేషన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) ఇచ్చే తీర్పులపై అప్పీళ్లకు వెళ్లే అవకాశముండదు. అయితే, ఆ ఆదేశాలు అమలు చేయడం చేయకపోవడం అన్నది ఆయా దేశాలకు సంబంధించిన విషయం. ఇందులో అంతర్జాతీయ న్యాయస్థానం ఒత్తిడి ఉండదు. అయితే, ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు ఆ తీర్పును అమలుచేయని దేశంతో సంబంధాలు తెంచుకునే విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. మరోవైపు భద్రతామండలిలో వీటో అధికారం ఉన్న ఐదు దేశాలు ఐసీజే తీర్పును వ్యతిరేకిస్తే.. ఆ తీర్పు అటకెక్కినట్టే. దానిని అమలుచేయాల్సిన అవసరంలేదు. దీంతో అగ్రదేశాల అధికారాన్ని అడ్డుపెట్టుకుని అంతర్జాతీయ న్యాయస్థానాల తీర్పులను ప్రభావితం చేస్తున్నాయి. ఇక అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)కి 139 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు మద్దతు తెలిపాయి. అయితే, ఆ కోర్టు ఇచ్చే తీర్పులకు కేవలం యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రమే మద్దతు తెలుపుతున్నాయి. భద్రతామండలిలో ముఖ్యభూమిక పోషిస్తున్న అమెరికా, చైనా, రష్యా దేశాలు మాత్రం ఈ కోర్టుకు దూరంగా ఉన్నాయి. దీంతో ఈ రెండు కోర్టులు ఇచ్చిన తీర్పులను అమలుచేసే బాధ్యత ఏ దేశమూ, ఏ వ్యవస్థ తీసుకోవడం లేదు. కానీ, తమకు నచ్చని దేశాన్ని ఇరుకున పెట్టేందుకు మాత్రమే అగ్రదేశాలు ఈ రెండు కోర్టుల తీర్పులను వాడుకుంటున్నాయన్న అపవాదు బలంగా ఉన్నది.
ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)
ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రధాన న్యాయ విభాగం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్ లోని హేగ్‌లో ఉంటుంది. ఐసీజేలో 15 మంది న్యాయమూర్తుల ప్యానెల్ ఉంటుంది. జడ్జీల పదవీకాలం 9 సంవత్సరాలు. వీరిని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, భద్రతా మండలి కలిసి ఎన్నుకుంటాయి. అయితే వీరు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయమూర్తులు. తమ దేశ ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించరు. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన 192కు పైగా దేశాలకు మాత్రమే తమకు ఇతర దేశాలతో ఉన్న సమస్యల పరిష్కారానికి ఐసీజే గడప తొక్కవచ్చు. ఇరు దేశాలు అంగీకరిస్తేనే ఐసీజే కేసు విచారణకు అంగీకరిస్తుంది. వివిధ దేశాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడమే దీని ఉద్దేశ్యం. అయితే ఏదైనా దేశం కేసు దాఖలు చేసే ముందు తమ దేశానికి చెందిన జడ్జి ఆ బెంచ్ లో లేకపోతే తమ దేశం వారిని అడహక్ జడ్జిగా (ఆ కేసు వరకు మాత్రమే) నియమించవచ్చు. అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతదేశం నుంచి న్యాయమూర్తులుగా సర్ బెనగల్ నర్సింగరావు (1952-53), నాగేంద్రసింగ్ (1973-88), రఘునందన్ స్వరూప్ పాథక్ (1989-1991), దల్వీర్ భండారి (2012-18) పని చేశారు. దల్వీర్ భండారి మరోసారి ఎన్నికై 2018 నుంచి 2027 వరకు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఉపాధ్యక్షుడిగా నాగేంద్రసింగ్ 1976 -1979, అధ్యక్షుడిగా 1985-88 వరకు పనిచేశారు.
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా హేగ్ లోనే ఉన్నది. 2002లో స్థాపించబడిన ఈ కోర్టు నరమేధాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే తీవ్ర నేరాలు, యుద్ధ నేరాలు వంటి నేరాలకు సంబంధించిన కేసులను ఈ కోర్టు విచారిస్తుంది. రెండో ప్రపంచయుద్ధం అనంతరం అంతర్జాతీయ మిలిటరీ ట్రిబ్యునల్‌లోని మాజీ ఉన్నతాధికారులపై విచారణ జరుపుతున్న సమయంలో ఈ ఐసీసీ ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. 1998 జూలైలో రోమ్‌లో ఐసీసీ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై 139 దేశాలు సంతకం చేశాయి. 2002 జూన్ నాటికి రోమ్ ఒప్పందాన్ని 66 దేశాలు ఆమోదించడంతో ఐసీసీ 2002 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2009, జనవరి 26న తొలిసారిగా నేర విచారణ ప్రారంభమైంది. దీనిలో 18 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీకాలం 3-9 ఏండ్ల వరకు ఉంటుంది. వీరిని అసెంబ్లీ ఆఫ్ స్టేట్ పార్టీస్ ఎన్నుకుంటుంది. అయితే నిందితులను అరెస్ట్ చేయడానికి ఐసీసీకి సొంత పోలీసు వ్యవస్థ లేదు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో 123 సభ్య దేశాలుండగా... ఈ కోర్టు నిర్వహణ కోసం 2023 కి రూ.170 మిలియన్ యూరోల బడ్జెట్‌ను కేటాయించారు. ప్రస్తుతం ఐసీసీలో 17 నేర విచారణలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 31కు పైగా కేసులు విచారణకు వచ్చినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా ఐసీసీ జడ్జీలు ఇప్పటి వరకు 38కి పైగా అరెస్టు వారెంట్లు జారీ చేశారు.