ఇజ్రాయెల్‌ హైఫా పోర్ట్‌లో ఓడలపై దాడులు చేసిన హౌతీ గ్రూప్

by Harish |
ఇజ్రాయెల్‌ హైఫా పోర్ట్‌లో ఓడలపై దాడులు చేసిన హౌతీ గ్రూప్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా తగ్గడం లేదు. ఇజ్రాయెల్ తన ప్రత్యర్థిపై దాడులు చేస్తూనే ఉంది. దీనికి ప్రతిస్పందనగా అవతలి వైపు నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఇరాక్ మద్దతు గల యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూప్ ఇజ్రాయెల్‌లోని హైఫా నౌకాశ్రయంలోని ఓడలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. ఈ విషయాన్ని హౌతి గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. పోర్ట్‌లోని నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాకీ బృందంతో కలిసి సంయుక్తంగా దాడులు చేశామని హౌతీ గ్రూప్ తెలిపింది. హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరియా ఒక టీవీ ప్రసారంలో మాట్లాడుతూ, రఫా ప్రాంతంలో ఇజ్రాయెల్ చేసిన మారణకాండకు ప్రతీకారంగా డ్రోన్‌లతో హైఫా పోర్ట్‌లో ఓడలపై దాడులు చేశామని అన్నారు. సైనిక సామగ్రిని తీసుకువెళ్తున్న రెండు నౌకలను లక్ష్యంగా చేసుకున్నామని, మరో ఓడపై కూడా దాడి చేసినట్లు టీవీ ప్రసారంలో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దీనిని ఖండించింది. ఆ దేశ సైనిక వర్గాలు జిన్హువా వార్తా సంస్థతో మాట్లాడుతూ పోర్ట్‌లో ఎటువంటి దాడులు జరగలేదని, ప్రస్తుతం ఓడరేవు సాధారణంగా పని చేస్తుందని తెలిపారు. ఇరాక్‌లోని ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్‌తో కలిసి ఇజ్రాయెల్‌పై గ్రూప్ దాడులను మరింత తీవ్రతరం చేస్తామని యెమెన్ హౌతీస్ నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్-హౌతీ గురువారం చెప్పారు. ఉత్తర యెమెన్‌లోని అనేక నగరాలను నియంత్రిస్తున్న హౌతీ తిరుగుబాటు బృందం గత నవంబర్‌లో పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే ఇజ్రాయెల‌కు చెందిన ఓడలను లక్ష్యంగా చేసుకుని యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed