ఇటలీలో దారుణ ఘటన.. చేయి తెగిన భారతీయ కార్మికుడిని రోడ్డుపైనే వదిలేసిన యజమాని

by vinod kumar |
ఇటలీలో దారుణ ఘటన.. చేయి తెగిన భారతీయ కార్మికుడిని రోడ్డుపైనే వదిలేసిన యజమాని
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటలీలో అత్యంత అమానవీయ ఘటన వెలుగు చూసింది. పొలంలో పని చేస్తుండగా ఓ భారతీయ కార్మికుడి చేయి ప్రమాదవ శాత్తు మిషన్‌లో పడి తెగిపోయింది. అయితే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పొలం యజమాని రోడ్డుపైనే విడిచి పెట్టి వెళ్లాడు. అనంతరం అతని భార్య ఆస్పత్రికి తరలించగా..పరిస్థితి విషమించి మరణించాడు. వివరాల్లో కెళ్తే..దక్షిణ రోమ్‌లోని లాటినా అనే గ్రామీణ ప్రాంతంలో సత్నామ్ సింగ్(31) అనే భారతీయ కార్మికుడు పొలాల్లో పనిచేస్తూ జీవనం కొనసాగించే వాడు. అయితే ఇటీవల ఆయన ఓ పొలంలో గడ్డి కోస్తుండగా.. ప్రమాదవ శాత్తు ఓ యంత్రం తగిలి చేయి తెగిపోయింది. తీవ్ర గాయాలపాలై కొట్టుమిట్టాడుతున్న ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అతని యజమాని సత్నామ్ నివాసముండే ఇంటి ఎదుట రోడ్డుపై విడిచిపెట్టి వెళ్లాడు. ఈ క్రమంలోనే సత్నాం భార్య, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు వెంటనే సత్నాంను చికిత్స నిమిత్తం రోమ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. దీంతో పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు.

ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదం తర్వాత సత్నాం చెత్తకుప్పలా విసిరివేయబడ్డాడని ఇటలీ ట్రేడ్ యూనియన్ పేర్కొంది. ఇదొక భయానక సినిమాను తలపించిందని తెలిపింది. దీనిపై ఇటలీ కార్మిక మంత్రి మెరీనా కాల్డెరోన్ కూడా స్పందించారు. అక్కడి పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చాడు. ఇదొక అనాగరిక చర్య అని అభివర్ణించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కార్మికుల దోపిడికి ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో సత్నామ్ సింగ్ పై వ్యవహరించిన తీరును సెంటర్-లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది. ఇది మానవాళి ఓటమి అని పేర్కొంది. మరోవైపు ఇటలీలోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. సత్నాం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ‘లాటినాలో భారతీయ పౌరుడి దురదృష్టకర మరణం గురించి మాకు సమాచారం అందింది. స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నాం. బాధిత కుటుంబాన్ని సంప్రదించి అన్ని విధాలుగా సహాయం చేస్తాం’ అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed