Kamala Harris: రష్యా అధ్యక్షుడిపై కమలా హ్యారిస్ కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
Kamala Harris: రష్యా అధ్యక్షుడిపై కమలా హ్యారిస్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. కాగా..ప్రచారంలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రష్యా- ఉక్రెయిన్‌ల శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవబోనని ప్రకటించారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. శాంతి చర్చల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలుస్తారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా జవాబిచ్చారు. ‘ఉక్రెయిన్‌ లేకుండా ద్వైపాక్షిక చర్చలు జరగవు. ఉక్రెయిన్‌ భవిష్యత్తుపై ఆ దేశమే చెప్పాలి’ అని ఆమె పేర్కొన్నారు. ఇక, ఉక్రెయిన్‌పై రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలపై కమలా హ్యారిస్ విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉండి ఉంటే పుతిన్‌ ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని కైవ్‌లో అధికారాన్ని సాధించేవారన్నారు.

ట్రంప్ గురించి మస్క్ ఏమన్నారంటే?

ఇకపోతే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కి మద్దతుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఉన్నారు. అయితే, ట్రంప్ కి మద్దతు ఇస్తూ మస్క్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ అధ్యక్షుడయ్యే వరకు తాను వెన్నంటే ఉంటానని వెల్లడించారు. టకర్‌ కార్లసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ గెలవకపోతే అమెరికాకు ఇవే చివరి ఎన్నికలని మస్క్‌ అభిప్రాయపడ్డారు. డెమోక్రాట్లు గెలిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పని ఆరోపించారు. ఇటీవల అమెరికాలో కీలకంగా మారిన వలసదారుల అంశంపైనా ఆయన స్పందించారు. వలసదారులను కావాలనే ముఖ్య రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు విశ్వసిస్తున్నానని చెప్పుకొచ్చారు. వలసవచ్చిన వారికి పౌరసత్వం లభిస్తే వారు డెమోక్రాట్ల ఓటర్లుగా మారతారని అన్నారు. డెమోక్రాట్లు మరో నాలుగేళ్లు అమెరికాను పాలిస్తే.. చట్ట విరుద్ధమైన చర్యలు అమలు చేస్తారని అన్నారు.

Advertisement

Next Story