Hamas:హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ హతం.. ధ్రువీకరించిన ఇజ్రాయెల్

by vinod kumar |
Hamas:హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ హతం.. ధ్రువీకరించిన ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఉగ్రవాద సంస్థ హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్‌లు గురువారం ధ్రువీకరించారు. సెంట్రల్ గాజాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన సాధారణ దాడుల్లో భాగంగా సిన్వార్ హతమైనట్టు తెలిపారు. ‘అక్టోబర్ 7 నాటి దురాగతాలకు కారణమైన హంతకుడు సిన్వార్ ఈ రోజు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) సైనికుల చేతిలో హతమయ్యాడు’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతకుముందు ఇజ్రాయెల్ దాడుల్లో సిన్వార్ మరణించినట్టు కథనాలు వెలువడ్డాయి. ఐడీఎఫ్ అటాక్ చేయగా ముగ్గురు హమాస్ సభ్యులు హతమయ్యారని వారిలో ఒకరు యహ్యా సిన్వార్ అని పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ మిలిటెంట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. సిన్వార్‌ మృతిని నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు. అనంతరం సిన్వార్ మరణాన్ని అధికారికంగా నిర్ధారించారు. అయితే ఇజ్రాయెల్ ప్రకటనపై హమాస్ స్పందించలేదు.

కాగా, 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడుల్లో యహ్వా సిన్వార్ ప్రధాన సూత్రధారి. గాజా స్ట్రిప్‌లో హమాస్ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. సిన్వార్1962లో ఈజిప్టు పాలిత గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు యాహ్యా ఇబ్రహీం హసన్ సిన్వార్. సిన్వార్ ఓ కేసులో భాగంగా 22 ఏళ్ల పాటు జైలులో ఉన్నాడు. 2011లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్‌కు బదులుగా 1,000 మందికి పైగా ఖైదీల విడుదల టైంలో సిన్వార్ కూడా రిలీజ్ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన హమాస్‌లో సీనియర్ నేతగా ఎదిగారు. ఈ క్రమంలోనే హమాస్ మాజీ చీఫ్ ఇస్మాయిల్ హనియే జూలై 31న ఇరాన్‌లో హత్యకు గురైన అనంతరం ఆ సంస్థ అధినేతగా బాధ్యతలు చేపట్టాడు.

Advertisement

Next Story

Most Viewed