300 మందిని బలిగొన్న వరదలు.. దెబ్బతిన్న వేలాది ఇళ్లు

by Harish |   ( Updated:2024-05-11 12:30:06.0  )
300 మందిని బలిగొన్న వరదలు.. దెబ్బతిన్న వేలాది ఇళ్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారీ వర్షాలు ఆప్ఘనిస్థాన్‌‌ను అతలాకుతలం చేస్తున్నాయి. గత నెలలో కుంభవృష్టి కారణంగా 70 మంది మృతి చెందగా.. ఆ విషాదం మరవక ముందే తాజాగా ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్‌లో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా ఒకే ప్రావిన్స్‌లో 300 మందికి పైగా మరణించారని ఐక్యరాజ్యసమితి శనివారం తెలిపింది. అలాగే, వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక్క బగ్లానీ జాడిద్ జిల్లాలోనే 1,500 వరకు ఇళ్లు దెబ్బతిన్నాయి. శుక్రవారం రాత్రి నాటికి 62 మంది మరణించినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికారులు పేర్కొనగా ఈ సంఖ్య 300కు పైనే ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


వరదల కారణంగా ఇళ్లు నేలమట్టం కావడం, భవనాలు కూలిపోవడంతో వందలాది మందికి గాయాలు అయ్యాయి. దీంతో ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా బఘ్లాన్ ప్రావిన్స్‌లోని ఐదు జిల్లాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈశాన్య బదక్షన్ ప్రావిన్స్, సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్, పశ్చిమ హెరాత్‌లో కూడా భారీ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర సిబ్బందిని అందుబాటులో ఉంచారు. సహాయక బృందాలు వేగంగా స్పందిస్తూ, క్షత్రగాత్రులకు రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్నాయని బాగ్లాన్‌లోని ప్రకృతి విపత్తు నిర్వహణ ప్రాంతీయ డైరెక్టర్ ఎదయతుల్లా హమ్దార్ద్ తెలిపారు. రాజధాని కాబూల్‌ను కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తాయని ప్రకృతి విపత్తు నిర్వహణ రాష్ట్ర మంత్రిత్వ శాఖ తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ చెప్పారు. కాగా, గత నెలలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ వరదల్లో దాదాపు 2,000 ఇళ్లు, 3 మసీదులు, 4 పాఠశాలలు దెబ్బతిన్నాయి.

Advertisement

Next Story

Most Viewed