Donald Trump : సక్సెస్ ‘పంచ్’.. ట్రంప్‌ను మళ్లీ అధ్యక్షుడిగా చేసిన ఐదు కారణాలు

by Hajipasha |   ( Updated:2024-11-06 17:48:00.0  )
Donald Trump  : సక్సెస్ ‘పంచ్’.. ట్రంప్‌ను మళ్లీ అధ్యక్షుడిగా చేసిన ఐదు కారణాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయానికి చాలా అంశాలు దోహదం చేశాయి. కమలా హ్యారిస్‌ను ఓడించి, మరోసారి వైట్ హౌస్‌‌‌లోకి ట్రంప్‌ వెళ్లేందుకు మార్గాన్ని సుగమం చేసిన ఐదు ముఖ్య కారణాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

మళ్లీ మంచిరోజుల ఆకాంక్ష

ట్రంప్ పాలనా కాలాన్ని, జో బైడెన్ పాలనా కాలంతో అమెరికా ప్రజలు పోల్చి చూసుకున్నారు. బైడెన్ హయాంతో పోలిస్తే ట్రంప్ హయాంలోనే తాము బాగా బతికామని దాదాపు 45 శాతం మంది అమెరికా ఓటర్లు ఎగ్జిట్ పోల్స్‌లో కుండబద్దలు కొట్టారు. నవంబరు 5న జరిగిన పోలింగ్‌లోనూ ఆ ఆలోచన ప్రకారమే ఓట్లు వేశారు. మళ్లీ మంచి రోజులు రావాలనే సంకల్పంతో ట్రంప్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

నల్లజాతి, లాటినో ఓటర్ల మద్దతు

గత అధ్యక్ష ఎన్నికలతో పోలిస్తే ఈసారి ట్రంప్‌కు అమెరికాలోని నల్లజాతి, లాటినో ఓటర్ల మద్దతు గణనీయంగా పెరిగింది. ఏడు స్వింగ్ రాష్ట్రాల్లోని నల్లజాతి, లాటినో ఓటర్లను డెమొక్రటిక్ పార్టీకి సానుభూతిపరులుగా చెబుతుంటారు. తన ఎన్నికల ప్రచారంతో ట్రంప్ ఈ పరిస్థితిని మార్చేశారు. ఆ వర్గాలలోని చాలామంది కీలక నాయకులను తన వైపునకు తిప్పుకోగలిగారు. దాని ఫలితంగా ట్రంప్‌నకు నల్లజాతి ఓటర్ల మద్దతు 8 శాతం నుంచి 13 శాతానికి పెరిగింది. లాటినో ఓటర్ల మద్దతు 32 శాతం నుంచి 45 శాతానికి పెరిగింది. దీని ఫలితంగానే స్వింగ్ రాష్ట్రాల్లోనూ రిపబ్లికన్ పార్టీ సత్తా చాటుకోగలిగింది.

ఆత్మ విశ్వాసం + ప్రజల సానుభూతి

2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ట్రంప్ స్వల్ప తేడాతోనే ఓడిపోయారు. కనీసం ఒకటి, రెండు స్వింగ్ రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీకి సీట్లు పెరిగి ఉంటే.. అప్పుడు కూడా ఆయనే గెలిచి ఉండేవారు. ఓడిపోయినా అమెరికా ప్రజల మధ్య యాక్టివ్‌గా ఉండటం ట్రంప్‌కు కలిసొచ్చింది. తప్పకుండా మళ్లీ అధ్యక్షుడిని అవుతానంటూ ఆయన పదేపదే వ్యక్తపర్చిన ఆత్మ విశ్వాసమే సాకారమైంది. ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాలతో రిపబ్లికన్ పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఎన్నికల ఫలితాల్లోనూ అదే కనిపించింది.

అక్రమ వలసలు, నిరుద్యోగంపై ట్రంప్ వైఖరి

అక్రమ వలసలే తమ దేశానికి పెద్ద ముప్పు అని చాలామంది అమెరికన్లు భావించారు. ఎన్నికల ప్రచారంలో ఈఅంశంపై కమల కంటే ట్రంప్ బలంగా మాట్లాడారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు తన వద్ద ఉన్న ప్రణాళికలను ట్రంప్ స్పష్టంగా వివరించి ప్రజలను ఆకట్టుకున్నారు. అమెరికన్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే అంశానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. అందుకే మెజారిటీ అమెరికన్లు ట్రంప్ వైపు మొగ్గు చూపారు.

గ్రామీణ ప్రాంతాల్లో హవా

అమెరికాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు ట్రంప్‌‌నకు(Donald Trump) అండగా నిలిచారు. రిపబ్లికన్ పార్టీ(US election) గ్రామీణ ఏరియాల్లో భారీగా మద్దతును కూడగట్టగలిగింది. వ్యవసాయం, పశుపోషణ వంటి రంగాలకు అండగా ఉంటానని ట్రంప్ హామీ ఇచ్చారు. గ్రామీణ ఓటర్లకు కమలా హ్యారిస్ అంతగా చేరువ కాలేకపోయారు.

Advertisement

Next Story

Most Viewed