మ‌న పాల‌పుంత మ‌ధ్య‌లో పెద్ద‌ బ్లాక్‌హోల్ ట్రేస్ అయ్యింది! నాసా తాజా వీడియో

by Sumithra |   ( Updated:2023-10-14 15:02:19.0  )
మ‌న పాల‌పుంత మ‌ధ్య‌లో పెద్ద‌ బ్లాక్‌హోల్ ట్రేస్ అయ్యింది! నాసా తాజా వీడియో
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌స్తుతం కాస్తో కూస్తో డ‌బ్బున్న‌ ప్ర‌పంచ దేశాలన్నీ ముందు మిల‌ట‌రీ కోసం, ఆ త‌ర్వాత‌ అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల కోస‌మే కోటాను కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాయి. అయితే, ఈ క్ర‌మంలో తాజాగా ప్రపంచ రేడియో ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఒక గొప్ప అద్భుతాన్ని క్యాప్చ‌ర్ చేయ‌గ‌లిగారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది రేడియో టెలిస్కోప్‌ల సమాహారమైన ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ వెనుక ఉన్న అంతర్జాతీయ కన్సార్టియం దీన్ని రూపొందించింది. మ‌న పాలపుంత మధ్యలో ఉన్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ మొట్ట‌మొద‌టి చిత్రాన్ని గురువారం ఆవిష్కరించారు. గ‌తంలో ఈ పాలపుంత మధ్యలో కనిపించని, కాంపాక్ట్‌గా, చాలా భారీగా చుట్టూ తిరుగుతున్న నక్షత్రాలను శాస్త్రవేత్తలు చూశారు.

మ‌న గెలాక్సీలతో సహా దాదాపు అన్ని గెలాక్సీలు ఇలాంటి పెద్ద బ్లాక్ హోల్స్‌ కలిగి ఉంటాయి. ఇక్కడ కాంతి, పదార్థం.. ఏవీ తప్పించుకోలేవు. నిజానికి, బ్లాక్ హోల్ చిత్రాలను పొందడం చాలా కష్టం. ఇంతకుముందు కూడా ఖగోళ శాస్త్రవేత్తలు ఇలాంటి చిత్రాల‌ను తీయడానికి ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా, భూమికి దాదాపు 27,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న దీన్ని ధనుస్సు-ఎ (Sagittarius-A (Sgr A) గా పిలుస్తున్నారు. ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ (EHT) సహకారంతో ప్రపంచ పరిశోధనా బృందం దీన్ని రూపొందించారు. ఇది బ్లాక్ హోల్ ఫిజిక్స్ కొత్త శకానికి నాందిగా EHT ట్విట్టర్‌లో పేర్కొంది. నిజానికి, ఇది మన సూర్యుడి కంటే 4 మిలియన్ రెట్లు పెద్ద‌దిగా ఉండ‌టం విశేషం.

ఇక ఈ బ్లాక్ హోల్ కనిపించనప్పటికీ, అది పూర్తిగా చీకటిగా ఉండ‌టం వ‌ల్ల‌, దాని చుట్టూ ప్రకాశించే వాయువు ద్వారా ఒక‌ స్పష్టమైన రూపం తీసుకురాగ‌లిగారు. చీకటి మధ్య ప్రాంతం ("నీడ" అని పిలుస్తారు) చుట్టూ ప్రకాశవంతమైన రింగ్ లాంటి నిర్మాణం ఉండ‌టంతో ఇది సాధ్య‌మ‌య్యింది. ఇక‌, "ఐన్‌స్టీన్ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ అంచనాల ప్ర‌కారం ఉంగరం పరిమాణంలోనే ఇది ఉండ‌టం చూసి మేము ఆశ్చర్యపోయాము" అని తైపీలోని అకాడెమియా సినికా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ నుండి EHT ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాఫ్రీ బోవర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప‌రిశోధ‌నా ఫలితాలను ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్ ప్రత్యేక సంచికలో ప్రచురించారు.

Advertisement

Next Story

Most Viewed