Iran : ఇరాన్‌లోని అణు విద్యుత్ ప్లాంటులో మంటలు.. ఇజ్రాయెల్ పనేనా ?

by Hajipasha |
Iran : ఇరాన్‌లోని అణు విద్యుత్ ప్లాంటులో మంటలు.. ఇజ్రాయెల్ పనేనా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్ ఏ క్షణమైనా ఇరాన్‌పై ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం ఇరాన్‌లోని కారజ్ నగర శివార్లలోని న్యూక్లియర్ విద్యుత్ ప్లాంటులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాలను దట్టమైన పొగలు కమ్మేశాయి. అయితే అకస్మాత్తుగా ఈ అణు విద్యుత్ ప్లాంటులో మంటలు ఎందుకు చెలరేగాయి అనేది తెలియరాలేదు. ఇరాన్‌లోని అణు విద్యుత్ కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తుందనే ఆందోళనలు ఇటీవల కాలంలో పెరిగాయి. అయితే అణు విద్యుత్ కేంద్రాలు, ఆయిల్ రిఫైనరీలపై దాడుల చేయొద్దని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది.

ఒకవేళ ఇరాన్‌పై వైమానిక దాడులు చేసినా.. కేవలం సైనిక కేంద్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్‌ను అగ్రరాజ్యం కోరింది. అమెరికా సూచనలను ఇజ్రాయెల్ పరిగణనలోకి తీసుకుంటుందా ? సొంత ప్లాన్‌ ప్రకారమే ఇరాన్‌పై దాడులు చేస్తుందా ? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. అంతకంటే ముందే ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. కాగా, లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందలాది మిస్సైళ్లతో దాడి చేసింది.

Advertisement

Next Story