లెబనాన్‌కు $1 బిలియన్ సహాయాన్ని ప్రకటించిన ఈయూ

by Disha Web Desk 17 |
లెబనాన్‌కు $1 బిలియన్ సహాయాన్ని ప్రకటించిన ఈయూ
X

దిశ, నేషనల్ బ్యూరో: మిడిల్‌ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం ప్రపంచదేశాలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా దీని కారణంగా లెబనాన్‌ తీవ్ర ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంది. దీంతో ఆ దేశంలో పర్యటిస్తున్న యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ గురువారం లెబనాన్‌కు $1 బిలియన్(రూ.8 వేల కోట్ల) సహాయాన్ని ప్రకటించారు. ఈ ఆర్థిక సహాయం ఈ సంవత్సరం నుంచి 2027 వరకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా లెబనాన్ సామాజిక-ఆర్థిక స్థిరత్వానికి దోహదపడాలనుకుంటున్నామని ఈయూ చీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.

దేశంలో యుద్ధం కారణంగా నష్టపోయిన ప్రజల ఆర్థిక ప్రగతిని పెంపొందించడానికి అక్కడ విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక సేవలను బలోపేతం చేయడానికి, లెబనాన్‌లో వ్యాపారాలు తిరిగి పుంజుకోడానికి, పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించడానికి సానుకూల ఆర్థిక స్థితిగతులు ఊపందుకోవడంలో ఈ సహాయం ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. అలాగే, శరణార్థులను పునరావాసం కల్పించడానికి కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో అక్రమ వలసలను నిరోధించడానికి, స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడానికి లెబనాన్ నుంచి సహకారాన్ని ఆశిస్తున్నట్లు ఉర్సులా తెలిపారు. లెబనాన్ సుదీర్ఘ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దాదాపు ఏడు నెలల నుంచి సరిహద్దు ఘర్షణలతో తీవ్రంగా ప్రభావితమవుతుంది.

Next Story

Most Viewed