Tribal people: రెండు రాష్ట్రాల్లో ఓటు.. లబ్ధి పొందుతున్న గిరిజనులు..

by Indraja |
Tribal people: రెండు రాష్ట్రాల్లో ఓటు.. లబ్ధి పొందుతున్న గిరిజనులు..
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని 21 గిరిజన గ్రామాల కొఠియా గిరిజనులు రెండు రాష్ట్రాల్లో ఓటు వేశారు. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముందు ఒడిశాలోనూ.. ఆ తరువాత ఆంధ్రాలోనూ ఓటు వేశారు. దీంతో తాము ఏ రాష్ట్రానికి చెందిన వారనే అంశంపై రిఫరెండం నిర్వహించాలనే వారి నిరీక్షణ పెద్ద నిరాశగా మారింది.

1956 నుంచీ కొనసాగుతున్న వివాదం

కోటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్ అని పిలువబడే ఈ కొండ ప్రాంతాల్లో ఐదు వేల మంది గిరిజనులు తాము ఏ రాష్ర్టానికి చెందుతామో తెలియకుండా, రెండు రాష్ట్రాల నుంచి ప్రయోజనాలు పొందుతూ జీవిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇటు ఆంధ్రా, అటు ఒడిశా ఓటరు కార్డులతో ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా రెండు చోట్ల ఓట్లు వేశారు. ఒడిశాలో వేలిపై సిరా గుర్తు లేకుండా ఓటు వేయగలిగారు. తరువాత ఎంచక్కా ఆంధ్రాలోని విజయనగరం జిల్లా సాలూరులో సిరా గుర్తుతో మరో ఓటు వేశారు.

సిరా గుర్తు వేస్తే ఓటేయం

తమ చేతి వేళ్లపై సిరా గుర్తు వేస్తే ఒడిశాలో ఓటు వేయబోమని గిరిజనులు బెదిరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చాలా మంది గిరిజనులు మొదట ఒడిశాలోని తొలాలి-గంజ్‌స్పదర్‌లో ఓటు వేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని సాలూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని నేరిడివలస సమీపంలోని తిగుగాంజైలో ఓటు వేశారు.

రెండు రాష్ట్రాల సాయం అవసరం

తమ గ్రామాల్లో పేదరికం, పరిమిత వనరుల కారణంగా తమకు రెండు రాష్ట్రాల నుంచి ప్రయోజనాలు అవసరమని కోటియా గిరిజనులు పేర్కొంటున్నారు. రెండు ప్రభుత్వాల పోటీ సంక్షేమ పథకాల కారణంగా గిరిజనులు రెండు రాష్ట్రాల నుంచి రేషన్ కార్డులు, ఆధార్, ఓటరు కార్డులను పొందారు. నెలవారీ పెన్షన్ ఒడిశాలో వేయి రూపాయలు కాగా, ఆంధ్రాలో మూడు వేల రూపాయలు. ఆంధ్రాలోని ఆరోగ్య శ్రీ పథకం వారిని బాగా ఆకర్షిస్తోంది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా అధికారులకు, ఆంధ్రాలోని మన్యం జిల్లా అధికారులకు మధ్య ఉన్న వ్యూహాత్మక ఒప్పందం కారణంగా తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండు చోట్ల ప్రశాంతంగా ఓటు వేసే అవకాశం దక్కిందని మాజీ సర్పంచ్ బిషూ జమీల్ అంటున్నారు. అయితే, రెండు రాష్ర్టాల్లో ఓటు వేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమని మాజీ కాంగ్రెస్ ఎంపీ జయరాం పాంగీ అభ్యంతరం చెబుతూ, ముందు ఈ సరిహద్దు సమస్యను పరిష్కరించాలని కోరారు.

వర్షాధార వ్యవసాయమే ఆధారం

వర్షాధార వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కొందరు పోడు సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలు ఉన్నప్పటికీ ఎటువంటి సర్వేలు నిర్వహించలేదు. చివరకు ఆంధ్రా ఒడిశా మధ్య సరిహద్దు వివాదం 1956 నుంచి కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో రాష్ర్టాలకు సంబంధించి సరైన హద్దులు లేవు. ఈ గ్రామాలకు సంబంధించిన వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లినప్పటికీ రాష్ర్ట ప్రభుత్వాల చొరవ లేకపోవడంతో ఇప్పటికీ పరిష్కారం కాలేదు.

Advertisement

Next Story

Most Viewed