- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Iran: హిజాబ్‌పై పాట.. గాయకుడికి కొరడా దెబ్బలు విధించిన కోర్టు

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ (Iran)లో మరోసారి మహిళలు హిజాబ్ ధరించే అంశం కలకలం సృష్టిస్తోంది. హిజాబ్‌కు వ్యతిరేకిస్తూ గాయకుడు మెహదీ యర్రాహి (Singer Mehdi Yarrahi) 2023లో 'రూసారిటో (పర్షియన్ భాషలో మీ హెడ్‌స్కార్ఫ్)' (Rosarito) అనే పాటను విడుదల చేశాడు. ఇస్లామిక్ చట్టానికి వ్యతిరేకంగా పాట పాడినందుకు ఆ సమయంలో యర్రాహిని పోలీసులు అరెస్టు చేశారు. దోషిగా తేలిన అతడు గతేడాది విడుదలయ్యారు. తాజాగా ఈ కేసుపై రివల్యూషనరీ కోర్టు తీర్పునిచ్చింది. అతడికి 74 కొరడా దెబ్బలు విధించాలని ఆదేశించింది.
కాగా, 2022లో ఇరాన్ అంతటా హిజాబ్‌కు వ్యతిరేక నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో నిరసనకారులకు మద్దతుగా యర్రాహి ఈ పాటను విడుదల చేశారు. తన శిక్షపై యర్రాహి స్పందిస్తూ స్వేచ్ఛ కోసం మూల్యం చెల్లించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
1979 ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. అయితే చాలామంది మహిళలు దీన్ని వ్యతిరేకించారు. ఈ అంశాలు అమలయ్యేలా దేశంలోని నైతిక పోలీస్ విభాగం పర్యవేక్షిస్తుంది. 2022లో మాసా అమీ (Mahsa Amini) అనే యువతి హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై పోలీసులు అరెస్టు చేయగా.. వారి కస్టడీలో ఆమె మరణించింది. దీంతో 2022లో ఇరాన్‌ను హిజాబ్ నిరసనలు కుదిపేశాయి. ఆ మృతి వార్తతో వేలమంది మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసనను తెలియజేశారు. వారికి అంతర్జాతీయ సమాజం మద్దతు తెలుపుతూ ఆందోళనకారులపై టెహ్రాన్ ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండించింది.