భారత్‌తో సరిహద్దు సమస్యలపై చైనా కీలక వ్యాఖ్యలు

by Hajipasha |
భారత్‌తో సరిహద్దు సమస్యలపై చైనా కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత్ - చైనా సరిహద్దు సమస్యలకు సత్వర పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందని ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను చైనా సత్వరం స్వాగతించింది. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏ‌సీ) వెంట సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించుకునే విషయంలో ఇరు దేశాలు గొప్ప సానుకూల పురోగతిని సాధించాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. ‘‘సరిహద్దు సమస్యపై దౌత్య, సైనిక మార్గాల ద్వారా చైనా, భారత్‌లు ముమ్మరంగా చర్చలు జరుపుతున్నాయి. ఈ దిశగా సానుకూల పురోగతిని సాధించాయి’’ అని ఆమె తెలిపారు. “చైనా, భారత్ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటే.. ఇరుదేశాలకూ ప్రయోజనం చేకూరుతుందని మేం నమ్ముతున్నాం’’ అని చెప్పారు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చాలా ముఖ్యమంటూ ప్రధాని మోడీ ఇటీవల వ్యాఖ్యలు చేసిన తర్వాత.. డ్రాగన్ దేశం సానుకూల ప్రకటనలు విడుదల చేయడం ఇది రెండోసారి. కాగా, 2020 మేలో గల్వాన్‌ లోయలో చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దాదాపు 40 మంది చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని చెబుతుంటారు. నాటి నుంచి నేటి వరకు సరిహద్దు సమస్యలపై చైనా- భారత్ మధ్య సైనిక కమాండర్ల స్థాయిలో 21 దశల చర్చలు జరిగాయి.

Advertisement

Next Story

Most Viewed