చంద్రుని అవతలి వైపుకు చేరుకున్న చాంగే-6 వ్యోమనౌక

by Harish |
చంద్రుని అవతలి వైపుకు చేరుకున్న చాంగే-6 వ్యోమనౌక
X

దిశ, నేషనల్ బ్యూరో: చంద్రునికి అవతలి వైపు ఖనిజాలను అన్వేషించేందుకు మానవరహిత వ్యోమనౌకను పంపించగా అది ఆదివారం సురక్షితంగా ల్యాండ్ అయిందని చైనా అంతరిక్ష సంస్థ తెలిపింది. చాంగే-6 ల్యూనార్ లాండర్ చైనా అధికారిక సమయం ప్రకారం, ఆదివారం ఉదయం 6:23 గంటలకు చంద్రుడి వెనుక భాగంలో ఉన్న ఐట్‌‌కెన్ బేసిన్‌లో విజయవంతంగా దిగినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ( CNSA ) తన వెబ్‌సైట్‌లో ఒక ప్రకటనలో తెలిపింది. మే 3న దీనిని ప్రయోగించగా దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి చంద్రున్ని చేరుకుంది. దీంతో అంతరిక్ష ప్రయోగాల్లో చైనా కీలక అడుగు వేసినట్లు అయింది. ల్యాండర్, అసెండర్‌తో కూడిన ఈ వ్యోమనౌక ఆ ప్రాంతంలో ఉండే రాళ్ళు, మట్టి నమూనాలను సేకరిస్తుంది. ఉపరితలంపై డ్రిల్ చేసి దాని రెండు కిలోల మట్టిని భూమి పైకి తీసుకు వస్తుంది. అలాగే, అక్కడికక్కడే మట్టి నమూనాలను శాస్త్రీయ విశ్లేషణ చేసి డేటాను తిరిగి పంపిస్తుంది. ఈ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి కానుంది.

గతంలో 2019లో కూడా చైనా చాంగే-4 అనే వ్యోమనౌకను చంద్రుని అవతలి వైపుకు పంపించింది. చైనా 2030 నాటికి చంద్రుడిపైకి మనుషులతో కూడిన మిషన్‌ను పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే,చంద్రుని ఉపరితలంపై స్థావరాన్ని నిర్మించాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా చైనా ఈ ప్రయోగాలు చేస్తుంది. చంద్రుడిపై ఈ ప్రాంతం గురించి ఇప్పటి వరకు ఎవరూ పరిశోధించలేదని, ఇక్కడికి వెళ్లేందుకు ఎవరూ ప్రయత్నించలేదని, దీనిని సాధించామని చైనా పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed