కాంగోలో పడవ బోల్తా.. 78 మంది దుర్మరణం

by Mahesh Kanagandla |
కాంగోలో పడవ బోల్తా.. 78 మంది దుర్మరణం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆఫ్రికా ఖండంలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు కాంగోలోని కివూ సరస్సులో 278 మంది ప్రయాణికులతో వెళ్లుతున్న పడవ బోల్తా పడింది. 78 మంది మరణించగా.. పదుల సంఖ్యలో ప్రయాణికుల సరస్సులో గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నదని అధికారులు తెలిపారు.

దక్షిణ కివూ ప్రావిన్స్‌లోని మినోవా నుంచి ఉత్తర కివూ ప్రావిన్స్‌లోని గోమాకు గురువారం ఈ పడవ బయల్దేరింది. బలమైన అల తాకడంతో అప్పటికే కార్గో, పరిమితికి మించిన ప్రయాణికులతో వెళ్లుతున్న పడవ బోల్తా పడింది. కిటుకు తీరం నుంచి కొన్ని మీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఆ పడవలో 278 మంది ప్రయాణికులు ఉన్నట్టు స్థానిక అధికారులు తెలిపారని దక్షిణ కివూ ప్రావిన్స్ గవర్నర్ జీన్ జాక్వస్ పురూసి చెప్పారు. 78 మంది మరణించారని, మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వెల్లడించారు. ఘటన గురించి తెలియగానే రెడ్ క్రాస్, డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థల నుంచి బృందాలు స్పాట్‌కు చేరుకుని గాలింపులు జరిపాయి. ఈ ఘటనపై ఆ దేశాధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకెడి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేస్తామని, మృతుల కుటుంబానికి సానుభూతి తెలిపారు.

మధ్య ఆఫ్రికాలోని ఈ దేశంలో జనాభాకు సరిపడా మౌలిక వసతులు లేవు. ముఖ్యంగా కివూ సరస్సు విభజిస్తున్న దక్షిణ కివూ ప్రావిన్స్‌, ఉత్తర కివూ ప్రావిన్స్‌ల మధ్య ప్రజలు ప్రయాణించడానికి సరిపడా రోడ్డు మార్గాలు లేవు. ఉన్న మార్గాల్లో వెళ్లడానికి డబ్బులు చెల్లించే స్తోమత లేక చాలా మంది ఈ సరస్సు మీదుగా ప్రయాణిస్తుంటారు. నిబంధనలకు ఉల్లంఘిస్తూ పరిమితికి మించిన సంఖ్యలో ప్రయాణికులు పడవల్లో ప్రయాణిస్తుంటారు.

Advertisement

Next Story

Most Viewed