TV journalist deth: శవమై కనిపించిన టీవీ జర్నలిస్ట్.. ఆమెది హత్య? లేక ఆత్మహత్య?

by Prasad Jukanti |
TV journalist deth: శవమై కనిపించిన టీవీ  జర్నలిస్ట్.. ఆమెది హత్య? లేక ఆత్మహత్య?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ ప్రకంపణలతో అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్ లో మరో దారుణ ఘటన జరిగింది. బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళా టీవీ జర్నలిస్ట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బంగ్లాదేశ్ లోని బెంగాలీ శాటిలైట్ చానెల్ గాజీ టీవీలో న్యూస్ రూమ్ ఎడిటర్ గా పని చేస్తున్న సారా రహనుమా (32) ఢాకాలోని ఓ సరస్సులో శవమై కనిపించారు. దేశ రాజధానిలోని హతిర్‌జీల్ సరస్సులో ఆమె మృతదేహం తేలుతూ కనిపించిందని స్థానిక మీడియా పేర్కొంది. ఆమె మృతదేహాన్ని గమనించిన పాదచారులు శవాన్ని బయటకు తీసి ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పోలీస్ అవుట్‌ పోస్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తెల్లవారుజామన చోటు చేసుకుంది. ఈ ఘటనపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజేద్ ఘాటుగా స్పందించారు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛపై మరో క్రూరమైన దాడి అని పేర్కొన్నారు. ఆమె పని చేస్తున్న చానెల్ ఇటీవల అరెస్టయిన గోలం దస్తగిర్ గాజీకి చెందిన సెక్యులర్ మీడియా హౌస్ అని సజీబ్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.

అయితే తన మరణానికి ముందు సారా మంగళవారం రాత్రి ఫేస్ బుక్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 'నీలాంటి స్నేహితుడిని కలిగి ఉండటం చాలా ఆనందంగా ఉంది. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. త్వరలో నీ కలలన్నీ నెరవేరుస్తావని ఆశిస్తున్నాను. మేము కలిసి చాలా ప్లాన్ చేసుకున్నామని నాకు తెలుసు. కానీ క్షమించండి, నేను మన ప్రణాళికలను నెరవేర్చలేను. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మీ జీవితంలోని ప్రతి అంశంలో" ఆని పోస్ట్ లో రాసింది. అంతకంటే ముందు చేసిన పోస్టులో "చావుతో సమానమైన జీవితాన్ని గడపడం కంటే చనిపోవడం ఉత్తమం' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె మరణం హత్యనా లేక ఆత్మహత్యనా అనేది ఉత్కంఠగా మారింది. అయితే జర్నలిస్టు మృతికి గల కారణాలపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story