Bangladesh : ఆర్మీ మధ్యంతర ప్రభుత్వాన్ని అంగీకరించం : బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాలు

by Hajipasha |
Bangladesh  : ఆర్మీ మధ్యంతర ప్రభుత్వాన్ని అంగీకరించం : బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ విడిచి వెళ్లిపోయిన నేపథ్యంలో అక్కడి విద్యార్థి సంఘాలు శాంతించాయి. ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించిన విద్యార్థి సంఘాల వేదిక ‘స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్ మూవ్‌మెంట్’ కోఆర్డినేటర్లు సోమవారం సాయంత్రం ఢాకాలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆ వేదికకు చెందిన ఓ కోఆర్డినేటర్ నహీద్ ఇస్లామ్ మాట్లాడుతూ.. ‘‘షేక్ హసీనా రాజీనామా అనేది మా ఉద్యమంలో మొదటి అడుగు మాత్రమే. ఆర్మీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే మధ్యంతర ప్రభుత్వాన్ని మేం అంగీకరించం. మేం అన్ని వర్గాల వారితో చర్చలు జరుపుతాం. ఆ తర్వాత ‘జాతీయ మధ్యంతర ప్రభుత్వం’ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చేస్తాం’’ అని వెల్లడించారు. ‘‘దేశంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ఎలా ఉండాలనే దానిపై మేం వచ్చే 24 గంటల్లోగా మేం ప్రపోజల్స్‌ను ప్రకటిస్తాం. విద్యార్థులు, దేశ పౌరులు, మేధావులను మా చర్చల్లో భాగస్వాములుగా చేస్తాం’’ అని నహీద్ ఇస్లామ్ పేర్కొన్నారు.

షేక్ హసీనా అణచివేత వైఖరి వల్లే ఈ తిరుగుబాటు : బంగ్లాదేశ్ విద్యార్థులు

షేక్ హసీనా ప్రభుత్వం విద్యార్థులను చాలా ఇబ్బంది పెట్టిందని, అందుకే ఇంతపెద్ద తిరుగుబాటు జరిగిందని బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని చెప్పుకొచ్చింది. కనీసం త్వరలో ఏర్పడే కొత్త ప్రభుత్వమైన విద్యార్థుల సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని కోరింది. భారత్‌లో ఉంటున్న ఓ బంగ్లాదేశీయుడు ఈ పరిణామాలపై స్పందిస్తూ.. ‘‘నా ఫ్యామిలీ బంగ్లాదేశ్‌లో ఉంది. నేను ఇండియాలో ఉంటున్నాను. నా కూతురికి ఫోన్ చేస్తే ఇప్పుడే తిరిగి రావొద్దని చెబుతోంది. అక్కడ పరిస్థితులు బాగాలేవని చెప్పింది. బంగ్లాదేశ్‌లో శాంతి భద్రతల పునరుద్ధరణ జరగాలని మేం కోరుకుంటున్నాం’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story