'మోడీని చూసి మా వాళ్లు అసూయపడుతున్నారు'

by Vinod kumar |
మోడీని చూసి మా వాళ్లు అసూయపడుతున్నారు
X

సిడ్నీ: భారత ప్రధాని నరేంద్ర మోడీని చూసి తమ రాజకీయ నాయకులు అసూయ చెందుతున్నారని ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేత పీటర్ డటన్ అన్నారు. ఒక్కరు కూడా 20 వేల మందిని కూడగట్టి తమ ఇంటి పేర్లను చెప్పించుకోలేక అసూయ పడుతున్నాయని చెప్పారు. డటన్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. బుధవారం ఓ అసాధారణ సంఘటన జరిగిందని అన్నారు. మోడీ సిడ్నీకి వెళ్లినప్పుడు అక్కడ ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి భారతీయులు పెద్ద ఎత్తున తరలి రావడం స్థానిక నేతలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘కార్యక్రమానికి ఇరు వైపుల నుంచి రాజకీయ నాయకులు హాజరయ్యారు.

కానీ 20 వేల మంది వచ్చి మోడీ ఇంటి పేరుతో నినాదాలు చేయడం సాధారణ విషయం కాదు. అందుకే మా వాళ్లంతా మీ మీద అసూయతో ఉన్నారని మోడీకి చెప్పాను. ఆ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అది అసాధారణ సంఘటన. ప్రధాని మోడీకి అతిథ్యం ఇవ్వడంలో భారతీయ సమాజం కృషిని నేను గుర్తించాను’ అని డటన్ అన్నారు. ఇరు దేశాల బంధాన్ని గౌరవించేందుకు ఆస్ట్రేలియాకు విచ్చేసిన ప్రధాని మోడీ, ఆయన బృందానికి తమ ప్రధానితో కలిసి ధన్యవాదాలు తెలిపామని తెలిపారు. సిడ్నీ పర్యటన సందర్భంగా మోడీ ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం వల్లే భారత్-ఆస్ట్రేలియా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని భారత ప్రధాని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed