"ఆల్ ఐస్ ఆన్ రఫా".. ఒంటరవుతున్న ఇజ్రాయెల్

by Harish |
ఆల్ ఐస్ ఆన్ రఫా.. ఒంటరవుతున్న ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: రఫా నగరంపై వరుసగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కోపంగా ఉన్నాయి. దీంతో అది ఒంటరి అవుతున్నట్లు కనిపిస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్‌ను రఫాలో తన దాడులను ఆపాలని ఆదేశించినప్పటికి శరణార్థి శిబిరంపై దాడులు చేసి 45 మందిని పొట్టన పెట్టుకుంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సాధారణ పౌరుల నుంచి వివిధ దేశాల రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీలు ఇజ్రాయెల్‌పై తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

మారణహోమాన్ని ఆపాలని ఆ దేశాన్ని వారు కోరుతున్నారు. ఆన్‌లైన్ వేదికగా కొంతమంది తమ నిరసనను తెలియజేస్తున్నారు. వివిధ సోషల్ మీడియా సైట్లలో "ఆల్ ఐస్ ఆన్ రఫా" అనే పేరుతో ఉన్న ఇమేజ్‌లను షేర్ చేస్తూ, రఫాలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అభ్యర్థిస్తున్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ఆదేశించినప్పటికీ కూడా ఆ దేశం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా దాడులతో ప్రభావితమైన పాలస్తీనియన్లకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో #AllEyesOnRafah అనే హ్యాష్‌ట్యాగ్‌తో పలువురు ప్రముఖులు తమ మద్దతుగా సందేశాలను షేర్ చేస్తున్నారు.

గాజా ఉత్తర ప్రాంతంలో కరువు పొంచి ఉందని అక్కడ దాడులు చేయవద్దని ఐక్యరాజ్యసమితి ఇజ్రాయెల్‌ను కోరింది. అలాగే, అమెరికాతో పాటు ఇతర దేశాలు సైతం ఈ దాడులకు ముగింపు పలకాలని కోరినప్పటికి ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పోరాటం కారణంగా దాదాపు 1 0 లక్షల కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లు అక్కడి నుంచి తరలి పోయారు. పాలస్తీనియన్లు తాము ఎక్కడికి వెళ్లినా ఇజ్రాయెల్ దాడులకు గురవుతున్నామని ఇటీవల పేర్కొన్నారు. రఫాలో పోరాటం తీవ్ర సంక్షోభానికి దారి తీస్తుందని మానవతవాదులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story