ఇతడికి నైట్రోజన్‌తో మరణదండన వేయబోతున్నారు.. ఎందుకు ?

by Hajipasha |   ( Updated:2024-01-22 12:36:29.0  )
ఇతడికి నైట్రోజన్‌తో మరణదండన వేయబోతున్నారు.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఒక ఖైదీకి అరుదైన మరణ శిక్షను విధించబోతున్నారు. 1988 నాటి ఓ హత్య కేసులో దోషిగా తేలిన 58 ఏళ్ల కెన్నెత్ యూజీన్ స్మిత్ అనే వ్యక్తికి నైట్రోజన్ హైపోక్సియా అనే పద్ధతి ద్వారా గురువారం(జనవరి 25) మరణశిక్షను అమలు చేయబోతున్నారు. ఇతడికి ఈ శిక్ష అమలైతే.. నైట్రోజన్ హైపోక్సియా పద్ధతిలో మరణదండనను ఎదుర్కొన్న తొలి దోషిగా యూజీన్ స్మిత్ నిలుస్తాడు. వాస్తవానికి ఇతడికి ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణదండన అమలు చేయాలని 2022 సంవత్సరంలో అమెరికాలోని అలబామా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. శిక్షను అమలు చేసేందుకు జైలుకు చెందిన ప్రత్యేక టీమ్ ఆనాడు రెడీ అయింది. కెన్నెత్ యూజీన్ స్మిత్‌ను మంచంపై పడుకోబెట్టి చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ మంచాన్ని మరణశిక్ష విధించే ఛాంబర్‌లోకి తీసుకెళ్లారు. చేయిలోని రెండు సిరలలోకి ప్రాణాంతక ఇంజెక్షన్‌కు చెందిన రెండు డోసులను వేయాల్సి ఉంటుంది. అయితే ఒక డోసునే జైలు సిబ్బంది వేయగలిగారు. అతడు బాగా విలవిలలాడటంతో .. శారీరక కదలికలు జరపడంతో.. ఇంకో డోసును వెంటనే వేయలేకపోయారు. ప్రాణాంతక ఇంజెక్షన్ ఒక డోసు వేయడానికే దాదాపు నాలుగు గంటల టైం పట్టింది. దీంతో ఆ ఇంజెక్షన్లలోని విష ప్రభావం యూజీన్ స్మిత్‌‌పై పనిచేయలేదు. ఫలితంగా అతడికి ప్రాణాపాయం తప్పింది. అనంతరం గత్యంతరం లేక జైలు సిబ్బంది అతడిని వైద్యం కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాంతక ఇంజెక్షన్‌‌తో మరణ దండన విధించే పద్ధతిని అమెరికాలోని అలబామా రాష్ట్రంలో 1982 సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు నైట్రోజన్ హైపోక్సియా అనే సరికొత్త మరణ దండన పద్ధతిని తొలిసారిగా గురువారం రోజు యూజీన్ స్మిత్‌‌పై అమలు చేయబోతున్నారు. దీన్ని అమానవీయ శిక్షగా అభివర్ణిస్తూ ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటన విడుదల చేసింది.

నైట్రోజన్ హైపోక్సియా అంటే ఏమిటి?

నైట్రోజన్ వాయువు ప్రాణాంతకం. ఇది రంగు, వాసనలు లేని వాయువు. మానవులు పీల్చే గాలిలో 78 శాతం నైట్రోజన్ ఉంటుంది. సరైన స్థాయిలో ఆక్సిజన్‌తో నైట్రోజన్‌ను పీల్చినప్పుడు ప్రమాదమేం జరగదు. అయితే మరణశిక్ష అమలులో భాగంగా 100 శాతం స్వచ్ఛమైన నైట్రోజన్‌ని పీల్చేలా ఖైదీ యూజీన్ స్మిత్‌‌‌ను జైలు సిబ్బంది బలవంతం చేస్తారు. దీనివల్ల శరీరంలో నైట్రోజన్ నిండిపోతుంది. శారీరక వ్యవస్థ పనిచేయడం ఆగిపోతుంది. శరీరంలో ఆక్సిజన్ లెవల్ ఖాళీ అవుతుంది. చివరకు మరణం సంభవిస్తుంది. ఇప్పటికే అమెరికాలోని ఓక్లహోమా, మిస్సిస్సిప్పి రాష్ట్రాల్లో ఈ రకం మరణదండనను అమలు చేస్తున్నారు. ఈ జాబితాలో చేరిన మూడో అమెరికా రాష్ట్రంగా అలబామా నిలువబోతోంది.

ఖైదీ చేసిన నేరం ఇదీ..

ఎలిజబెత్ సెనెట్‌ అనే మహిళ భర్త ఒక మత ప్రబోధకుడు. 1988లో బాగా అప్పుల్లో కూరుకుపోయిన ఎలిజబెత్ సెనెట్‌ భర్త.. వాటిని తీర్చేందుకు దారుణమైన కుట్ర పన్నుతాడు. ఆ స్కెచ్ అమలులో భాగంగా తన భార్య పేరిట ఒక ఇన్సూరెన్స్ పాలసీని చేయిస్తాడు. అనంతరం తన భార్యను చంపేందుకు ఇద్దరు కిరాయి హంతకులను ఆశ్రయిస్తాడు. వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున డబ్బులను ముట్టజెప్తాడు. అనంతరం ఇద్దరు కిరాయి హంతకులు వెళ్లి ఎలిజబెత్ సెనెట్‌‌ను దారుణంగా హత్య చేస్తారు. ఈ హత్య చేసిన ఇద్దరు కిరాయి హంతకుల్లో ఒకడే ఇప్పుడు మరణశిక్షను ఎదుర్కోబోతున్న యూజీన్ స్మిత్‌‌‌.

Advertisement

Next Story

Most Viewed