15 ఏళ్లు అక్క‌డి క‌ష్టాన్ని చూపించిన జ‌ర్న‌లిస్ట్.. తాజా కాల్పుల్లో మృతి!

by Sumithra |
15 ఏళ్లు అక్క‌డి క‌ష్టాన్ని చూపించిన జ‌ర్న‌లిస్ట్.. తాజా కాల్పుల్లో మృతి!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌పంచ శాంతి కోసం పోరాటాలు చేస్తున్నామ‌నే నెపంతో దేశాల‌నే మ‌ట్టుబెడుతున్న వైనం ఎన్నో ఏళ్లుగా న‌డుస్తోంది. ఇజ్రాయిల్, పాల‌స్తీనాల మ‌ధ్య ద‌శాబ్ధాలుగా నెల‌కొన్న ఉధ్రిక్త‌త‌ల మ‌ధ్య ప్ర‌తిరోజూ అమాయ‌కుల ప్రాణాల‌నే బ‌ల‌వుతున్నాయి. ఎవ‌రికి వారు శాంతి కాముక‌ల‌మంటూనే క‌ర్క‌శంగా కాల్పుల‌కు తెగ‌బ‌డుతున్నారు. తాజాగా, బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ సైనిక దళాలు, పాలస్తీనా ముష్కరుల మధ్య జరిగిన ఘర్షణల సమయంలో ఓ జ‌ర్న‌లిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ బ్యాంక్ నగరం జెనిన్‌లో రిపోర్ట్ చేస్తున్న అల్ జజీరా జర్నలిస్టు షిరీన్ కాల్పుల్లో మృతి చెందిన‌ట్లు ఆ వార్తా సంస్థ, పాలస్తీనా ఆరోగ్య మంత్రి ప్ర‌క‌టించారు.

అయితే, జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లేహ్‌పై కాల్పులు జరిపింది ఎవ‌రు..? ఏ పరిస్థితుల్లో ఇది చోటుచేసుకుంద‌నే అంశంలో స్పష్టత రాలేదు. ఇజ్రాయెల్ దళాల నుంచి వచ్చిన బుల్లెట్ తన తలకు తగిలిందని ప్రాథ‌మికంగా తెలిసింది. ఆమె "బహుశా పాలస్తీనా సాయుధ కాల్పుల వల్ల" గాయపడి ఉండొచ్చనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ట్విట్టర్‌లో తెలిపింది. శ్రీమతి అబూ అక్లేకు 51 సంవ‌త్సరాలు. ప్రముఖ పాత్రికేయురాలిగా ఆమె 15 ఏళ్ల‌కు పైగా పాల‌స్తీనా, ఇజ్రాయిల్ మ‌ధ్య ఉధ్రిక్త‌త‌ల‌పై రిపోర్ట్ చేశారు. అయితే, ఘ‌ట‌న స‌మ‌యంలో ఆమె న్యూస్ మీడియా సభ్యురాలిగా గుర్తించ‌గలిగే రక్షణ దుస్తులు ధరించి ఉన్నా, బుల్లెట్ త‌ల‌కు త‌గ‌ల‌డంతో మృతి చెందిన‌ట్లు నివేదిక‌లు వ‌చ్చాయి. అధికారిక పాలస్తీనా వార్తా సంస్థ ప్రకారం, మరొక జర్నలిస్ట్, అలీ అల్-సమోది కూడా రక్షణ చొక్కా ధరించి ఉండ‌గా అత‌నికి వెనుక భాగంలో బుల్లెట్ త‌గిలింది. ప్ర‌స్తుతం అత‌నికి చికిత్స జ‌రుగుతోంది.

ఇజ్రాయెల్‌లో పాలస్తీనియన్ల వరుస దాడుల నేపథ్యంలో, ఏప్రిల్ ప్రారంభం నుండి ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా నగరం జెనిన్‌లో వ‌రుస‌ సైనిక దాడులు నిర్వహిస్తోంది. అనుమానితులను అరెస్టు చేసేందుకు ఇజ్రాయిల్‌ బలగాలు జెనిన్‌లో ఉన్నాయని, ముందుగా కాల్పులు జరిపారని ఇజ్రాయెల్ మిలటరీ ట్విట్టర్‌లో తెలిపింది. జ‌ర్న‌లిస్ట్ షిరీన్‌ని చంప‌మ‌ని పాల‌స్తీనా అధ్య‌క్షుడే ఆదేశించాడ‌ని ఇజ్రాయిలీలు ఆరోపిస్తుంటే, ఇజ్రాయిల్ మిల‌ట‌రీనే ఆమెను హ‌తం చేసింద‌ని పాలస్తీనా మండిప‌డుతోంది. ప్ర‌స్తుతం దీనిపై ద‌ర్యాప్తు జ‌రుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed