నెతన్యాహుతో అజిత్ దోవల్ భేటీ: కీలక విషయాలపై చర్చ

by samatah |
నెతన్యాహుతో అజిత్ దోవల్ భేటీ: కీలక విషయాలపై చర్చ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించారు. బంధీల విడుదల సహా గాజాకు మానవతా సాయం అందించడానికి తీసుకోవాల్సిన చర్చలపై డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నెతన్యాహు కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. గాజాలో జరుగుతున్న ఇటీవలి పరిణామాలపై దోవల్‌కు నెతన్యాహు వివరించినట్టు తెలిపింది. విదేశాంగ విధాన సలహాదారు, ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు పేర్కొంది. గతేడాది అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన మొట్టమొదటి ఉన్నత స్థాయి సమావేశం ఇదే కావడం గమనార్హం.

గతేడాది ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే తదనంతరం ప్రతీకార చర్యలో భాగంగా గాజాలో పౌరుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యకు పరిష్కారం కనుగొనాలని పలుమార్లు సూచించింది. కాల్పుల విరమణకు పిలుపినిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి కూడా భారత్ మద్దతు తెలిపింది. దీనికి అనుకూలంగా ఓటు వేసింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌తో ఉన్నత స్థాయి సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు నెతన్యాహు మాట్లాడుతూ దక్షిణ గాజా నగరమైన రఫాలో సైనిక కార్యకలాపాలను నిలిపివేసే ప్రసక్తే లేదని తెలిపారు. అక్టోబర్ 7 లాంటి దాడి మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఇజ్రాయెల్ కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు.

మరోసారి లెబనాన్ పై దాడి

తూర్పు లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమాణిక దాడులకు పాల్పడింది. బాల్బేక్ సిటీలో జరిగిన ఈ దాడుల్లో ఒక లెబనాన్ పౌరుడు మృతి చెందగా..ఆరుగురు తీవ్రంగా గాయపడ్డట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. హిజ్భొల్లా స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ అటాక్స్‌ను బాల్బేక్ గవర్నర్ బచిర్ కోద్ర్ ధ్రువీకరించారు.యుద్ధం ప్రారంభం తర్వాత తూర్పు లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇది రెండో సారి. బెకా లోయలోని బాల్బేక్ నగరం హిజ్భొల్లాకు ముఖ్యమైన స్థావరంగా భావిస్తారు.

Advertisement

Next Story

Most Viewed