అమెరికా మిలటరీని టెన్షన్ పెట్టిస్తోన్న ప్రైవేట్ విమానం

by GSrikanth |   ( Updated:2023-06-05 09:55:29.0  )
అమెరికా మిలటరీని టెన్షన్ పెట్టిస్తోన్న ప్రైవేట్ విమానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ చిన్న విమానం అగ్రరాజ్యం అమెరికా మిలటరీ అధికారులను టెన్షన్ పెట్టించింది. ఆ దేశ రాజధాని గగనతలంలోకి అనుమానాస్పదంగా ప్రైవేట్ జెట్ ప్రవేశించడంతో వెంటనే యూఎస్ మిలటరీ రంగంలోకి దిగింది. యూఎస్ కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. టెన్నిసీ నగరంలోని ఎలిజబెత్ టౌన్ నుంచి న్యూయార్క్ లోని మెక్ ఆర్థర్ ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సిన ఓ బిజినెస్ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఉన్నట్టుండి దిశను మార్చుకుంది. అత్యంత సున్నితమైన అమెరికా రాజధాని వాషింగ్టన్, వైట్ హౌస్ మీదుగా చక్కర్లు కొట్టడం ప్రారంభించింది.

దీంతో అలర్ట్ అయిన మిలటరీ అధికారులు ఆ జెట్ విమానాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినా అటువైపు నుంచి సమాధానం రాకపోవడంతో ఆ విమానాన్ని ఎఫ్-16 ఫైటర్ జెట్ వెంబడించింది. అయితే సాధారణంగా జనసముదాయాలు ఉన్న చోట్ల నిర్ణీత వేగంతో మాత్రమే ప్రయాణించే ఫైటర్ జెట్లు ఈసారి సూపర్ సానిక్ వేగంతో దూసుకుపోవడంతో భారీ శబ్దాలు వెలువడ్డాయి. దీంతో గగనతలంలో ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బిజినెస్ జెట్ పైలెట్ దృష్టి మళ్లించేందుకే యుద్ధ విమానం నుంచి మంటలను సైతం విడుదల చేశారు. ఇది చూసిన ప్రజలు భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు.

అయితే వాషింగ్టన్ గగనతలంలో కాసేపు ప్రయాణించిన ప్రైవేట్ విమానం ఆ తర్వాత వర్జీనియాలోని ఓ అటవీ ప్రాంతంలో కుప్పకూలినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఫ్లోరిడాలోని ఎన్ కోర్ మోటార్స్ అనే కంపెనీ పేరుతో ఈ ప్రైవేట్ విమానం రిజిస్టర్ అయి ఉంది. ఈ కంపెనీ యజమాని జార్ రాంపెల్ ఈ ఘటనపై స్పందిస్తూ తన కుమార్తె, 2 ఏళ్ల మనవరాలు, సహాయకురాలు, పైలట్ ఈ విమానంలో ఉన్నారని తనను చూసేందుకు వచ్చి తిరుగు ప్రయాణం అయినట్లు తెలిపారు. కాగా ప్రమాద స్థలంలో ఎవరూ ప్రాణాలతో కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు ప్రెసిడెంట్ బైడెన్ జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద గోల్ఫ్ అడుతున్నాడని, దీని ద్వారా ఆయన షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed