చిన్నారి అరిహాను భారత్ కు పంపించండి.. జర్మనీకి 59 మంది ఎంపీలు లేఖ

by Javid Pasha |
చిన్నారి అరిహాను భారత్ కు పంపించండి.. జర్మనీకి 59 మంది ఎంపీలు లేఖ
X

న్యూఢిల్లీ: భారత్ లో ఎప్పుడూ విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తించే అధికార, విపక్ష పార్టీలు ఒక చిన్నారి విషయంలో ఏకతాటిపైకి వచ్చాయి. జర్మనీ కేర్ సెంటర్ లో ఉన్న రెండేళ్ల అరిహా షా కోసం రాజకీయ విభేదాలను పక్కనబెట్టి అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు గళం విప్పారు. బెర్లిన్ లోని ఫోస్టర్ కేర్ సెంటర్ లో 21 నెలలుగా ఉంటున్న పసికందు అరిహాను వెంటనే స్వదేశానికి పంపించాలని జర్మనీకి భారత్ లోని 19 రాజకీయ పార్టీలకు చెందిన 59 మంది ఎంపీలు ఉమ్మడి లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ సహా 19 పార్టీలకు చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఈ మేరకు భారత్ లోని జర్మనీ రాయబారి ఫిలిప్ అకెర్ మాన్ కు లేఖను అందించారు. తన సొంత దేశం, ప్రజలు, సంస్కృతి, పర్యావరణం మధ్య జీవించే హక్కు అరిహాకు ఉందని వాదించారు. ఆలస్యమైతే చిన్నారికి కోలుకోలేని హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

లేఖపై సంతకం చేసిన వారిలో లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, శశిథరూర్, బీజేపీకి చెందిన హేమమాలిని, మేనకా గాంధీ, డీఎంకేకు చెందిన కనిమొళి, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, టీఎంసీకి చెందిన మహువా మోయిత్రా, ఎస్పీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్, ఆర్జేడీకి చెందిన మనోజ్, సంజయ్ సింగ్, సీపీఎంకు చెందిన ఎలమరన్ కరీం, జాన్ బ్రిట్టాస్, అకాళీదళ్ నుంచి హర్ సిమ్రత్ కౌర్ బాదల్, బీఎస్పీ నుంచి కున్వర్ డానిష్ అలీ, శివసేన (షిండే వర్గం) నుంచి ప్రియాంక చతుర్వేది, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా ఉన్నారు. అరిహాను స్వదేశానికి వెళ్లేందుకు అనుమతించాలని, భారతీయ పౌరురాలిగా ఇది ఆమె హక్కు అని భారత ప్రభుత్వం కూడా జర్మనీని కోరింది.

జర్మనీ అధికారుల కస్టడీలో 7 నెలల పాప

గుజరాత్ కు చెందిన ధార, భవేష్ షా చిన్నారి అరిహాతో కలిసి జర్మనీలో నివసించారు. పాప తండ్రి బెర్లిన్ లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేశారు. అక్కడ అరిహా ప్రమాదవశాత్తు గాయపడటంతో ఆ చిన్నారిని తల్లిదండ్రులు వేధించారనే ఆరోపణలతో జర్మనీ అధికారులు ఏడు నెలల పాపను తమ కస్టడీలోకి తీసుకొని తల్లిదండ్రులను భారత్ పంపించేశారు. 21 నెలలుగా ఫోస్టర్ కేర్ లో ఉన్న తమ కుమార్తె కోసం తల్లిదండ్రులు పోరాడుతూనే ఉన్నారు. అయితే.. అరిహా తల్లిదండ్రులపై కేసును జర్మనీ పోలీసులు గతేడాది ఫిబ్రవరిలో మూసేసినప్పటికీ చిన్నారిని మాత్రం అప్పగించలేదు. అరిహా తల్లిదండ్రులకు సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని, తల్లిదండ్రుల వద్ద చిన్నారిని ఉంచడానికి అభ్యంతరం లేదని సైకాలజిస్ట్ చెప్పినా అరిహాను అప్పగించలేదని ఎంపీలు లేఖలో ఆదోళన వ్యక్తం చేశారు. జైన కుటుంబానికి చెందిన అరిహా తల్లిదండ్రులు శాకాహారం తీసుకుంటారని, కానీ.. ఆ చిన్నారికి మాంసాహారం తినిపించడం అన్యాయమని భారత్ కు చెందిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆవేదన వ్యక్తం చేశారు. లేఖపై సంతకం చేసిన వారిలో బీఆర్‌ఎస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (ఎం), నేషనల్ పీపుల్స్ పార్టీ, టీడీపీ ఎంపీలు కూడా ఉన్నారు.

Advertisement

Next Story