Ukraine: ఉక్రెయిన్‌‌‌లో ఆసుపత్రి, విద్యా సంస్థపై రష్యా క్షిపణి దాడి.. 41 మంది మృతి

by Harish |
Ukraine: ఉక్రెయిన్‌‌‌లో ఆసుపత్రి, విద్యా సంస్థపై రష్యా క్షిపణి దాడి.. 41 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో:గత కొన్నేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తాజాగా రష్యా దళాలు బాలిస్టిక్ క్షిపణులను ఉక్రెయిన్‌లోని పోల్టావాపై ప్రయోగించగా, అవి అక్కడి ఆసుపత్రి, విద్యా సంస్థను తాకడంతో దాదాపు 41 మంది మృతి చెందగా, 180 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొన్న దాని ప్రకారం, రెండు రష్యన్ బాలిస్టిక్ క్షిపణులలో ఒకటి ఆసుపత్రిని, మరోటి విద్యా సంస్థ భవనాలలో ఒకదానిని పాక్షికంగా ధ్వంసం చేసినట్లు తెలిపింది. దాడి గురించిన సమాచారం తెలిసే లోపు సమయం తక్కువగా ఉండటం వలన అక్కడ ఉన్నటువంటి వారిని సకాలంలో తరలించ లేకపోయామని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై అధ్యక్షుడు జెలెన్ స్కీ సోషల్ మీడియా వెబ్‌సైట్ Xలో స్పందించారు. పోల్టావాలో రష్యా దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం అందింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, రెండు బాలిస్టిక్ క్షిపణులు ఆ ప్రాంతాన్ని తాకాయి. వారు ఒక విద్యా సంస్థ, సమీపంలోని ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకున్నారు, వాటిలో ఒకదాన్ని పాక్షికంగా నాశనం చేశారు. దురదృష్టవశాత్తు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు, 41 మంది మరణించారు. 180 మందికి పైగా గాయపడ్డారు. వారి బంధువులు, ప్రియమైన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు. ఇది ఒక "ఉగ్రదాడి".. ఈ దాడికి రష్యా తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed