Hezbollah : ఇజ్రాయెల్‌కు షాక్.. హిజ్బుల్లా దాడిలో 20 మంది ఇజ్రాయెలీ సైనికులు మృతి

by Hajipasha |
Hezbollah : ఇజ్రాయెల్‌కు షాక్.. హిజ్బుల్లా దాడిలో 20 మంది ఇజ్రాయెలీ సైనికులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్‌ భూభాగంలోకి చొరబడి సైనిక ఆపరేషన్ నిర్వహిస్తున్న ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్‌లోని మారౌన్ అల్ రాస్, యారౌన్ పట్టణాలలోకి ఇజ్రాయెలీ సైనికులు చొరబడేందుకు యత్నిస్తుండగా హిజ్బుల్లా మిలిటెంట్లు గొరిల్లా వ్యూహంతో చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. పెద్దఎత్తున రాకెట్లను సంధించారు. ఈ ఘటనలో 20 మంది ఇజ్రాయెలీ సైనికులు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. చనిపోయిన, గాయపడిన సైనికులను హుటాహుటిన ఇజ్రాయెలీ ఆర్మీ సంఘటనా స్థలం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అయితే సైనికుల మరణాల వివరాలను ఇజ్రాయెలీ ఆర్మీ ఇంకా ధ్రువీకరించింది.

సిరియాలో ఇరాన్ విదేశాంగ మంత్రి

లెబనాన్-సిరియా సరిహద్దుల్లోని రోడ్లు ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడుల్లో పూర్తిగా ధ్వంసమయ్యాయి. సిరియా నుంచి లెబనాన్‌‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లకు ఆయుధాల సప్లైను ఆపేందుకే ఈ రోడ్లను ఇజ్రాయెల్ దెబ్బతీసింది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి శనివారం రోజు సిరియా రాజధాని డమస్కస్‌లో పర్యటించారు. ఆయన సిరియా విదేశాంగ మంత్రితో సమావేశమై ఇజ్రాయెల్ దాడుల అంశం, తదుపరి సైనిక వ్యూహంపై చర్చించారు.

నస్రల్లా వారసుడు హతం

ఇటీవలే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చనిపోయారు. ఈ మిలిటెంట్ సంస్థకు తదుపరి చీఫ్‌గా హాషిం సఫియుద్దీన్ అవుతారని అందరూ అనుకున్నారు. అయితే శనివారం ఉదయం లెబనాన్ రాజధాని నగరం బీరుట్‌‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో అతడు కూడా చనిపోయాడని తెలిసింది.

యెమన్‌పై విరుచుకుపడ్డ అమెరికా

ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, హైపర్ సోనిక్ మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న యెమన్ హౌతీలను అమెరికా టార్గెట్‌గా చేసుకుంది. శనివారం ఉదయం యెమన్‌ రాజధాని సనా సహా పలు నగరాలలోని హౌతీలకు చెందిన 15 స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల నుంచి ఈ దాడులు చేసింది. హౌతీలను కట్టడి చేసి, ఎర్ర సముద్రంలో నౌకల రాకపోకలకు మార్గాన్ని సుగమం చేసేందుకే ఈ దాడులు చేశామని అమెరికా వెల్లడించింది.

ఇజ్రాయెల్‌కు ఆయుధాలు అమ్మొద్దు : ఫ్రాన్స్

సరిగ్గా ఏడాది క్రితం అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు ఉగ్రదాడికి తెగబడ్డారు. మళ్లీ అదే రోజున (సోమవారం) ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేసే అవకాశం ఉందంటూ ఇజ్రాయెలీ మీడియాలో సంచలన కథనాలు ప్రచురితమయ్యాయి. తమపై గత మంగళవారం దాడిచేసిన ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు అవసరమైన సాయుధ సరంజామాను ఇజ్రాయెల్ రెడీ చేసుకుందని ఆ కథనాల్లో ప్రస్తావించారు. ఇరాన్‌లోని ఆయిల్ రిఫైనరీలు, అణ్వాయుధ పరిశోధనా కేంద్రాలు, క్షిపణి తయారీ కేంద్రాలు, ఆయుధ డిపోలు, విద్యుత్ తయారీ కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పరిణామాలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. ‘‘ఇజ్రాయెల్‌కు ఆయుధాల సప్లైను ఇకనైనా ఆపేయాలి. ఇప్పటికే గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 41వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఆయుధాలను విక్రయించే దేశాలు ఈ అంశాన్ని పరిశీలించాలి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలి. చర్చలతోనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది’’ అని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed