World Oceans Day 2021: కాలుష్యం లేని కడలి కోసం పోరాటం..

by vinod kumar |   ( Updated:2021-06-08 03:04:26.0  )
World Oceans Day 2021: కాలుష్యం లేని కడలి కోసం పోరాటం..
X

దిశ, వెబ్‌డెస్క్: భూగోళాన్ని శాసించేవి రెండే రెండు శక్తులు.. ఒకటి సౌర శక్తి, రెండోది జలశక్తి. ఈ విశాల భూ గ్రహంపై భూమి కేవలం 29 శాతం మాత్రమే ఉండగా.. మిగిలినదంతా సముద్రాలే. భూగోళ వాతావరణం, ఋతుపవనాలు, వర్షం రాకపోకలను, ఉష్ణోగ్రతలను నియంత్రించటంలో సముద్రాలు, మహా సముద్రాలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే ఒకప్పుడు ఉన్న సముద్రాలకు, ఇప్పుడు మనం చూస్తున్న సముద్రాలకు చాలా తేడా ఉంది. ఒకప్పుడు సముద్రంలో నీరు తప్ప వేరే ఏమి కనిపించేవి కావు.. కానీ ఇప్పుడు సముద్రంలో కాలుష్యం, వ్యర్ధ పదార్ధాలు తప్ప ఏమి కనిపించడం లేదు. సాగరం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయన్న సాధారణ విషయాన్నీ మానవాళి మరిచిందనే చెప్పాలి.

దాదాపు ఎనిమిది శాతం సముద్ర కాలుష్యం భూమి నుంచే వచ్చిందని అంచనా. ఇక ఈ కాలుష్యాన్ని అరికట్టడానికే 1992లో పర్యావరణ అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరైన కెనడియన్‌ ప్రతినిధి రియాడి జర్మనీలో మొదటిగా మహాసముద్రాలు నాశనం కాకుండా ఆలోచించేందుకు ఒక రోజును పెట్టాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను 2002 లో ప్రపంచ వ్యాప్తంగా మహాసముద్రాల దినోత్సవం పేరుతో ఆమోదించారు. తదుపరి ఐక్యరాజ్యసమితి అధికారికంగా 2008లో వరల్డ్‌ ఓషన్స్‌డే ప్రకటించింది. అప్పటినుండి ప్రతి ఏటా జూన్ 8 న వరల్డ్‌ ఓషన్స్‌డే జరుపుకుంటున్నారు.

సముద్రంపై కాలుష్య ప్రభావం

మన భూభాగం చుట్టూ ఐదు ముఖ్యమైన మహా సముద్రాలు ఉన్న విషయం తెలిసిందే. ఫసిఫిక్‌, అట్లాంటిక్‌, హిందూ, ఆర్కిటిక్‌, దక్షిణ మహా సముద్రాలు. ఇవికాక, 12కు పైగా సముద్రాలున్నాయి. సముద్రాల నుంచి పారే నదులు.. నదుల నుండి కాలువలు.. కాలువల నుండి పిల్ల కాలువలు. వీటిమీద ఆధారపడి ఎన్నో జీవరాశులు జీవిస్తున్నాయి. వాటినే మనం రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకొంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నాం. కానీ, ఎన్నో ఆరోగ్యకరమైన ఉట్పత్తులను ఇస్తున్న ఆ సముద్రాన్నే కాలుష్యానికి కేరాఫ్ అడ్రెస్ గా మార్చేస్తున్నాం. పారిశ్రామిక, వ్యవసాయ , నివాసాల వ్యర్థాలు ఇష్టారీతిగా వదిలివేయడం వలన సముద్రకాలుష్యం ఏర్పడుతుంది. రోజూ వేల టన్నుల చెత్త సముద్రాల్లో కలుస్తోంది. అందులో ఎక్కువ భాగం ప్లాస్టికే ఉండడం గమనార్హం. భూమిలో కరగని ఈ కాలుష్య కారకం సముద్రాల్లోని చేపలు ఇతర జీవుల్ని చంపేస్తోంది. ఈ కాలుష్యం వలన ఎన్నో అరుదైన జాతి సముద్ర జీవులు, మొక్కలు అంతరించిపోతున్నాయి.

ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి

కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉండే సముద్రపు నీరు.. కాలుష్యానికి గురవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. బీచ్ లకు వెళ్లినా, నది తీరాలకు వెళ్లినా ముందు అందరికి కనిపించేవి బీచ్ అందాలు కాదు.. సాగరతీరంలో ఉండే ప్లాస్టిక్ వ్యర్ధాలు. వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయించాలనే మాటను మరిచారు అధికారులు. ప్రతి ఏటా జూన్ 8న ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం జరుపుకోవడం తప్ప…దాన్ని కాపాడుకునేందుకు తీసుకునే చర్యలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి. నీరు.. మానవాళికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రాల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతున్న మానవులు వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరు ఈ కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించాలి. బీచ్ లో చెత్త వేయడం, సముద్రాల్లో వ్యర్థ పదార్ధాలను వేయడం మానుకోవాలి. ఇలా చేయగలిగితే భవిష్యత్తులో కాలుష్యం లేని కడలిని చూడగలుగుతాం.

సముద్రాలు బాగుండాలి.. జీవులూ బాగుండాలి

భవిష్యత్తులో కాలుష్యం లేని కడలిని చూడాలంటే వాటికోసం ఇప్పటినుండే పోరాడాలని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. ఇక ఈ ప్రపంచ మహాసముద్రాల దినోత్సవ రోజును పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి జూన్‌ 8న కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోంది. ఈ కాన్ఫరెన్స్‌ లో 45 దేశాల ప్రతినిధులు పాల్గొని సముద్ర కాలుష్యంపై అవగహన కార్యక్రమాన్ని చేపడతారు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఓ సరికొత్త థీమ్ ని ఏర్పాటు చేసి ప్రజలలో సముద్ర కాలుష్యంపై అవగహనా ర్యాలీ నిర్వహిస్తారు. ఇక ఈ ఏడాది ‘సముద్రాలు బాగుండాలి… జీవులూ బాగుండాలి’ అనే థీమ్ ని ఎంచుకున్న ఐక్యరాజ్యసమితి సముద్రాలు బాగు కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed