- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరిహద్దులు దాటి వచ్చినవారికి భరోసా
దిశ ప్రతినిధి, ఖమ్మం: సొంత రాష్ట్రంలో ఏ పనీ దొరక్క ఇబ్బందులు పడుతున్న వారికి ఆ మండలం చేతినిండా పని కల్పిస్తోంది. సరిహద్దులు దాటి వచ్చినా అక్కున చేర్చుకుని భరోసా ఇస్తుంది. పిల్లా జెల్లాతో మూటా ముళ్లె సద్దుకుని వస్తే.. నేనున్నానంటూ అందరికీ ఆశ్రయం కల్పిస్తోంది. కాలే కడుపులతో వస్తే కడుపునిండా అన్నం పెడుతుంది. అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం. ఈ మండలంలోని పలు గ్రామాలకు ప్రతి యేటా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి వలస ఆదివాసీ కూలీలు మిర్చితోటల్లో పనిచేసేందుకు వస్తుంటారు. వందల్లో కాదు.. ప్రతి సంవత్సరం ఇక్కడి మిర్చి కోయడానికి సుమారు 8వేల నుంచి 10 వేల మంది తమ కుటుంబాలతో వస్తుంటారు. వారందరికీ పని కల్పించి చేతినిండా డబ్బులు ఇచ్చి మరీ సొంత రాష్ట్రాలకు పంపిస్తారు ఇక్కడి మిర్చి సాగుదారులు.
మూడు రాష్ట్రాల నుంచి కూలీల రాక..
భద్రాద్రి జిల్లాలోనే జూలూరుపాడు మండలంలో ప్రతి సంవత్సరం రైతులు అధికంగా మిర్చి సాగు చేస్తారు. అయితే ఇక్కడ కూలీల కొరత ఉండడంతో కొన్ని సంవత్సరాల క్రితం పక్క రాష్ట్రాలనుంచి మిర్చి కోసేందుకు మనుషులను తీసుకొచ్చేవారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మిర్చి తోటల్లో పనిచేసేందుకు ఈ మండలానికి మూడు రాష్ట్రాల నుంచి ఆదివాసీ కూలీలు వస్తూనే ఉన్నారు. మండలంలో ప్రతి ఏడూ సుమారు నాలుగువేల నుంచి ఐదు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తుంటారు. ఇక్కడ కూలీల కొరత ఎక్కువగా ఉండడంతో సాగుదారులందరూ పక్క రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి మనుషులను తీసుకొస్తుంటారు. వీరంతా గుండ్లరేపు, పాపకొల్లు, బేతంపాడు, అన్నారుపాడు, వినోబానగర్, గాంధీనగర్, గంగారం తండా, వెంగన్న గ్రామాల్లోని సమీప పొలాల్లోనే గుడాలు వేసుకుని మిర్చి కోతలు అయ్యేంత వరకు ఇక్కడే ఉంటారు.
పొలాల్లోనే వసతి..
వేల సంఖ్యలో పిల్లాపాపలతో వచ్చిన వలస కూలీలు సమీప పొలాల్లోనే తమ గుడారాలను ఏర్పాటు చేసుకుని వంటా, నిద్ర, రోజువారీ పనులన్నీ అక్కడ చేసుకుంటారు. వీరికి మిర్చి సాగుదారులు కూడా అన్ని వసతలు కల్పిస్తుంటారు. వారికి వంట సామగ్రి, నీరు, విద్యుత్, వంట చెరుకు.. ఇలా ఉండేందుకు కావాల్సిన అన్ని వసతులూ కల్పిస్తారు. గుడారాలు సైతం వేసి ఇస్తుండడం వల్లే ప్రతి సంవత్సరం వస్తుంటామని కూలీలు చెబుతున్నారు. అన్ని సౌకర్యాలు కల్పించడంతో ఇక్కడి మనుషుల ప్రేమాభిమానాలూ బాగుంటాయని.. అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటామని వారు సంతోషంగా చెబుతున్నారు.
చేతినిండా పని, డబ్బు..
తమ రాష్ట్రంలో చేసేందుకు వ్యవసాయ పనులు, ఇతర కూలీ పనులు లేక ఇక్కడకు వచ్చిన కూలీలకు ఇక్కడి మిర్చి తోటల్లో చేతినిండా పని దొరకుతుంది. కోతలు ముగిసేంత వరకు ఇక్కడే ఉండి డబ్బులు బాగానే సంపాదిస్తారు. ఒక్క కూలీకి కేజీ మిర్చి ఏరినందుకు సుమారు రూ. 7 నుంచి రూ. 9 వరకు ఇస్తుంటారు. ఇలా ఒక్కో కూలీ వారి సామర్థ్యాన్ని బట్టి 20 నుంచి 30 కేజీల వరకు ఏరుతుంటారు. ఒక్కో కూలీ రోజులో తక్కువలో తక్కువ రూ. 15 వందల వరకు సంపాదిస్తారు. ఇలా కోతలు ముగిసేంత వరకు పనిచేసి చేతినిండా డబ్బలతో తమ రాష్ట్రాలకు వెళ్తుంటారు.
మిర్చి సాగుదారుల హర్షం..
లోకల్ గా కూలీల కొరత ఉండడంతో పక్క రాష్ట్రాల నుంచి మిర్చి తోటల్లో పనిచేసేందుకు ఇక్కడికి కూలీలు వలస వస్తుంటారని.. వారు రావడం వల్ల తమ మండలానికి పండగ కళ వచ్చినట్లే ఉంటుందని చెబుతున్నారు మిర్చి సాగుదారులు. కష్టపడి పనిచేసే వీరు రావడం వల్ల తమకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని, కోతలు కూడా చాలా సులభంగా పూర్తవుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలను సాదడం కోసం సరిహద్దులు దాటి వచ్చి మరీ తమ మిర్చి తోటల్లో పనిచేస్తుంటారని, వారికి తగిన ప్రతిఫలాన్ని కూడా అందిస్తామని పేర్కొంటున్నారు. ఇక పొలాల్లో వారు ఉండేందుకు అన్ని వసతలు కల్పిస్తామని కూడా చెబుతున్నారు. అందుకే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వస్తుంటారని చెబుతున్నారు.
వీరు ఉన్నంత వరకు వ్యాపారాలు ఫుల్..
వలస కూలీలు వచ్చినప్పటి నుంచి మండల వ్యాప్తంగా వ్యాపారాలు కూడా బాగా జోరందుకుంటాయి. వీరికి కావాల్సిన సరకులు తీసుకునేందుకు సమీప దుకాణాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా కిరాణాషాపులు కిటకిటలాడుతాయని చెపుతున్నారు అక్కడి వ్యాపారస్తులు. ఇక ఆదివారం వచ్చిందంటే షాపుల ఎదుట వేల సంఖ్యలో వలస కూలీలు గుమిగూడుతుండడంతో మండలం వ్యాప్తంగా జాతరను తలపిస్తోంది. ఇలా ప్రతి ఏడూ వీరు వచ్చిన దగ్గరనుంచి వెళ్లేదాకా వ్యాపారాలు జోరుగా సాగుంతుంటాయని చెబుతున్నారు అక్కడి షాపుల యజమానులు.
కరోనా టైంలో నెల రోజులు ఇక్కడే..
గతేడాది కరోనా సమయంలో కూడా వలస కూలీలు ఇక్కడ ఏ పనీ లేకుండా దాదాపు నెలరోజుల పాటు ఉన్నారు. వీరందరికీ కావాల్సిన సదుపాయాలతో పాటు, తగినంత ఆహారాన్ని కూడా మిర్చి సాగుదారులతో పాటు, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వం తరఫున అందించారు. అంతేకాదు వీరికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా తమ సొంత రాష్ట్రాలకు తిరిగి పంపించారు. ఇలా తమకు ప్రతి సంవత్సరం పని కల్పించడమే కాదు. కష్ట సమయంలో ఆదుకున్న మండల ప్రజలకు, రైతులకు ఎప్పుడు రుణపడి ఉంటామని వలస కూలీలు చెబుతున్నారు. అంతేకాదు.. తమ కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ మిర్చి తోటల్లో పనిచేస్తున్నామని, సీజన్ అయిపోగానే చేతినిండా సొంత గ్రామాలకు వెళ్తామని ఆనందంగా చెబుతున్నారు.