నెల రోజులుగా నీళ్లు లేవు.. ఖాళీ బిందెలతో ఆందోళన

by Sridhar Babu |
drinking water
X

దిశ, వెబ్‌డెస్క్ : మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. నేటికీ గొంతెండుతోందని ప్రజలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగుతున్నారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు వచ్చినా కూడా మహిళల నిరసనలు తప్పడం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్లలో తాగునీటి కోసం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా చుక్కా నీరు రాకున్నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామంలోని మిషన్ భగీరథ ట్యాంకు ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. చిల్పకుంట్ల గ్రామం నుంచే తుంగతుర్తి నియోజకవర్గంలోని 170 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుందని, కానీ వాటర్ ట్యాంక్ ఉన్న తమ గ్రామంలోనే బిందెడు నీళ్లు రావడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజులుగా నీటి సమస్యపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదని ఆరోపించారు. తమ గ్రామానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో నిత్యం నీళ్లు సరఫరా అవుతున్నాయని, కానీ తమకు లేవని వాపోయారు. వెంటనే తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed