ఆ ఒక్కటి లేక అతివల అవస్థలు.. మరీ ఇంత దారుణమా..?

by Shyam |   ( Updated:2021-08-10 02:51:10.0  )
ఆ ఒక్కటి లేక అతివల అవస్థలు.. మరీ ఇంత దారుణమా..?
X

దిశ, షాద్ నగర్: అటు ఉద్యోగాల్లో..ఇటు వ్యాపారాల్లో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో ధీటుగా అడుగులు వేస్తున్న మహిళలు పలు సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నారు. మహిళలకు మగవారితో సమానంగా అన్నింట్లో సమాన అవకాశాలు అంటారు. కానీ, కనీస అవసరాలు పట్టించుకోరు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలకు పలు అవసరాల నిమిత్తం మండల కేంద్రాలకు వచ్చే ఆడపడుచులకు ప్రజా మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం సమస్యలకు కారణమవుతోంది. అన్నిరకాలుగా అభివృద్ధి చెందుతున్న మండల కేంద్రాల్లో అవసరానికి ఆ ఒక్కటి కనిపించకపోవడంతో ఎటూ పాలుపోక తిరుగుప్రయాణం కొనసాగిస్తున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఒక్క షాద్ నగర్ మున్సిపాలిటీ లో మినహా మిగతా అయిదు మండల కేంద్రాల్లో ఈ సమస్య కనిపిస్తోంది.

మండలాల్లో పరిస్థితి మరీ దారుణం..

షాద్ నగర్ నియోజకవర్గంలో ఫరూఖ్ నగర్, కొత్తూరు, నందిగామ, కొందుర్గు, కేశంపేట, జిల్లేడు
చౌదరిగూడెం మండలాలు ఉన్నాయి. గ్రామాల్లో పనిచేసే ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు, వ్యాపారులు, అవసరాల నిమిత్తం ఆడపాదడపా తమ మండలకేంద్రాలలో ఉన్న బ్యాంకులకు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు రాకపోకలు కొనసాగిస్తుంటారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలోని రెవిన్యూ కార్యాలయం లను సబ్ రిజస్ట్రార్ కార్యాలయాలుగా మార్చి రిజిస్ట్రేషన్ లు కొనసాగిస్తోంది. మరో పక్క ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించే వారాంతపు సంతలకు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి క్రయవిక్రయాలు నిర్వహిస్తుంటారు. దాంతో గంటల తరబడి అక్కడే ఉండాల్సి ఉంటుంది.

ఫరూఖ్ నగర్ మండల కేంద్రమైన షాద్ నగర్ మినహా మిగతా ప్రాంతాల్లో ఎక్కడా ప్రజా మరుగుదొడ్లను అధికారులు ఏర్పాటు చేయలేదు. రిజిస్ట్రేషన్ ల కోసం ఎంతోమంది ప్రతినిత్యం వస్తున్న టాయిలెట్స్, మరుగుదొడ్లు మాత్రం లేవు. దీంతో ప్రజలు ప్రభుత్వంకు ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని లేకపోవడం బాధాకరమని విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో సుమారు స్త్రీల జనాభా ఇలా ఉంది.

మండలం పురుషులు స్త్రీలు

కేశంపేట 21,715 20,877

కొత్తూరు 17,930 16,370

నందిగామ 16063 14,878

ఫరూక్ నగర్ 57,961 55,272

కొందుర్గు 14,579 14,277

చౌదరిగూడెం 15,965 15,707

మొత్తం 1,43,603 1,37,381

మంజూరైనా ఏర్పాటు చేయలేదు..

గతంలో ఉపాధిహామీ పథకం కింద మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఎక్కడా సర్పంచులు, అధికారులు నిర్మాణాలకు ముందుకు రాలేదు. ఇదిలా ఉంటే షాద్ నగర్ మున్సిపాలిటీలో కేశంపేట రోడ్డు, ప్రభుత్వ అతిథి గృహం, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజామరుగుదొడ్లు ఏర్పాటు చేసిన వాటి నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. మరోపక్క సరిపోను నీరులేక, నిర్వహణ సరిగాలేక అధ్వానంగా మారాయి. కొన్నింటి తలుపులు కూడా పోయాయి. మండల కేంద్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని మండల కేంద్రంలలో ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed