వీడిన మర్డర్ మిస్టరీ.. భార్యను ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చి దారుణ హత్య

by Sumithra |   ( Updated:2021-09-24 10:45:13.0  )
వీడిన మర్డర్ మిస్టరీ.. భార్యను ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చి దారుణ హత్య
X

దిశ, జవహర్‌నగర్ : భార్యను తన స్నేహితుని ఇంటికి తీసుకొచ్చి అతి దారుణంగా చంపేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. సీఐ భిక్షపతి రావు కథనం ప్రకారం.. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధి భద్రయ్య కాలనీలోని ఓ ఇంట్లో ఈ నెల 15న వివాహిత మృతి చెందిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

మృతురాలిని వెస్ట్ మారేడ్ పల్లి పరిధిలోని గొల్లకిట్టి బస్తీలో నివాసముండే షేక్ భాను బేగం(34)గా గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు షేక్ భాను బేగం భర్త అబ్దుల్ హబీబ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగినప్పటి నుంచి తన భార్యను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తూ ఉండేవాడు.

అది కాస్త ఇద్దరి మధ్య తీవ్ర గొడవలకు దారితీసింది. దీంతో ఆమెను చంపాలని పక్కా ప్రణాళికతో బాలాజీ నగర్‌లోని భద్రయ్య కాలనీలో నివాసముంటున్న తన స్నేహితుడు రవి అలియాస్ అబ్దుల్లా ఇంటికి తీసుకువచ్చి గొడవపడి ఆమెను హత్య చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story