మిస్టరీగా మహిళా కానిస్టేబుల్ మృతి.. ఆ వేధింపులే కారణమా..?

by srinivas |
Sukanya
X

దిశ, వెబ్‌డెస్క్: ఆమె చేసిది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం. భర్త ఉద్యోగే. ఆర్థికంగా ఏ లోటు లేదు. ఆలుమగల మధ్య గొడవలూ లేవు. పైగా రెండు నెలల బాలింత. అయినా మిట్ట మధ్యాహ్నం బహిరంగ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి పక్కన్నే చెట్టుకు ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. ఏ కారణం లేకుండా రెండు నెలల పసికందును వదిలి ఆమె బలవన్మరణానికి పాల్పడటం మిస్టరీగా మారింది. చిత్తూరు జిల్లాలో జరిగిన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య కేసులో రెండు రోజులైన పురోగతి లేదు.

చిత్తూరు జిల్లా చౌటూరుకు చెందిన సుకన్యకు పెనుమూరు మండలం కార్తికేయపురం గ్రామానికి చెందిన ప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. సుకన్య తిరుమల టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. ఆమె భర్త ప్రసాద్ తిరుపతి స్విమ్స్‌లో పని చేస్తున్నాడు. వీరికి మూడేళ్ల క్రితం కూతురు జన్మించింది. తాజాగా రెండు నెలల క్రితం మరో కూతురుకు జన్మనిచ్చింది సుకన్య. మెటర్నటీ సెలవుల్లో ఉన్న కానిస్టేబుల్ సుకన్య.. డెలవరీ అనంతరం నుంచి అత్తారింటిలోనే ఉంటుంది. అయితే ఉన్నట్టుండి ఆదివారం మధ్యాహ్నం ఆమె ఇంటి పక్కన్నే ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.

వాళ్లే వేధించారా..?

కానిస్టేబుల్ సుకన్య రెండు కాన్పుల్లోనూ ఆడ పిల్లలకే జన్మనివ్వడంతో అత్తారింట్లో గొడవలు జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. డెలవరీ అనంతరం సుకన్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించగా.. మగ సంతానం కావాలని భర్త, అత్తారింటి వాళ్లు అడ్డుకున్నట్లు సమాచారం. ఇదే విషయంపై గత రెండు నెలలుగా ఇంట్లో రభస నడుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వారి వేధింపుల కారణంగానే సుకన్య మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె బంధువులు సైతం ఆరోపిస్తున్నారు. పోలీసులకు కూడా మూడో సంతానం కోసమే వేధించినట్లు ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనా చట్టాన్ని కాపాడే వృత్తిలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇలా అర్ధాంతరంగా ప్రానాలు తీసుకోవడం జిల్లాలో విషాదాన్ని నింపింది.

Advertisement

Next Story

Most Viewed