కొవిడ్ వ్యాక్సిన్‌ వేసుకోండి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే గోల్డెన్ చాన్స్

by Shyam |
కొవిడ్ వ్యాక్సిన్‌ వేసుకోండి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే గోల్డెన్ చాన్స్
X

దిశ, ఫీచర్స్: COVID-19 మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు ప్రజలను వ్యాక్సినేషన్‌కు ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం ఆఫర్లు కూడా అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ వేయించుకున్న ఆస్ట్రేలియన్ మహిళ.. వ్యాక్సిన్ లాటరీలో 1 మిలియన్ యూఎస్ డాలర్లను గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరాలు అయిపోయింది.

25 ఏళ్ల జొవాన్ ఝూ.. ‘ది మిలియన్ డాలర్ వ్యాక్స్ అలయన్స్ లాటరీ’లో ప్రధాన బహుమతి సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని లాటరీ కంపెనీ ఆదివారం ప్రకటించగా.. జొవాన్ కొవిడ్-19 టీకా తీసుకున్నందుకుగాను భారీ నగదు(రూ. 7.4 కోట్లు) గెలుచుకుంది. టీకాలు వేసుకున్న అనేక మంది ఆస్ట్రేలియన్లు ఈ లక్కీ డ్రాలో బహుమతులు గెలుపొందగా.. జీవితాన్ని మార్చేంత ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నవారిలో జొవాన్ కూడా ఒకరు. కాగా వ్యాక్సినేషన్ రేటు పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన ఫిలాంత్రపిస్ట్స్, పలు కంపెనీలు ఇలా భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నాయి.

ఇక భారీ నగదును గెలుచుకోవడం పట్ల స్పందించిన జొవాన్.. ‘ఈ డబ్బుతో ముందుగా నా కుటుంబానికి బహుమతులు కొని, మిగతాది ఇన్వెస్ట్ చేస్తాను. అలా భవిష్యత్తులో మరింత డబ్బు సంపాదించి అవసరమైన వారికి సహాయం చేస్తాను’ అని తెలిపింది. ఈ ‘మిలియన్ డాలర్ వ్యాక్స్ ప్రాజెక్ట్’లో భాగంగా 1 మిలియన్ యూఎస్ డాలర్ల నగదు బహుమతితో పాటు 1,000 డాలర్ల విలువైన 100 గిఫ్ట్ కార్డ్స్ కూడా ఇవ్వడం విశేషం.

Advertisement

Next Story