శాస్త్రీయ సంగీత ప్రవేశం లేకుండానే..!

by Anukaran |   ( Updated:2022-09-16 13:58:46.0  )
శాస్త్రీయ సంగీత ప్రవేశం లేకుండానే..!
X

దిశ, వెబ్‎డెస్క్: ఇరవై ఏళ్ళ వయసులో సినీ పరిశ్రమలోకి నేపథ్య గాయకుడిగా ప్రవేశించిన ఎస్పీ బాలుకు శాస్త్రీయ సంగీతంలో ఎలాంటి ప్రావీణ్యం లేదు. అయినా అప్పటికి ఘంటసాల స్వరాన్ని విస్తృతంగా ఆస్వాదించిన తెలుగు సినీ ప్రేక్షకులకు ఎస్పీబీ గొంతులో కొత్తదనం, లేతదనం కనిపించింది. శాస్త్రీయ సంగీతంలోని మాధుర్యాన్ని ప్రేక్షకులు ఆదరించారు. తన స్వంత ప్రతిభతో, అప్పటికి సినీ పరిశ్రమలో ఉన్న కొత్త అవకాశాలతో ఎస్పీబీ గుర్తింపు పొందిన నేపథ్య గాయకుడిగా స్థిరపడ్డారు. వచ్చిన అవకాశాన్ని నిలుపుకోడానికి పడిన తపన, ప్రతీరోజూ నేర్చుకున్న కొత్త విషయాలను, సంగీత దర్శకులలో దాగిన ప్రతిభను గమనిస్తూ తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారు.

సంగీత దర్శకుల బాణిని పసిగట్టి వారి ప్రశంసలు అందుకోగలిగారు. ఘంటసాల బాగా పాతుకుపోయిన కాలంలోనే కోదండపాణి ద్వారా అడుగుపెట్టిన ఎస్పీ బాలు స్వయంశక్తితో వేళ్ళూనుకున్నారని, ఘంటసాల తదనంతర కాలంలో ఆయన స్థానాన్ని కూడా అలంకరించారని సినీ రంగ ప్రముఖులు చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. ఘంటసాల మృతి తరవాత కెరీర్‌లో చాలా ఒడిదుడుకులు వచ్చినా అతను పాడిన పాటలే ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. 1970వ దశకం ద్వితీయార్ధం నుంచి దాదాపు మూడు దశాబ్దాలకుపైగా ఒక వెలుగు వెలిగిన బాలు అనేక పాటల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. శాస్త్రీయం, జానపదం, లలిత సంగీతం, రాక్, బ్రేక్ లాంటి ధోరణులతో పాటు మిమిక్రీ గొంతుతోనూ పాటలు పాడారు.

ఇప్పటికీ మన ఇళ్ళల్లో పేరంటాల సమయంలోనూ, సంక్రాంతి ముగ్గుల సమయంలోనూ వినిపించే 'రావమ్మా… మహాలక్ష్మి రావమ్మా.. ' పాట ఎస్పీబీని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళింది. ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన పాటల్లో 'కన్నెవయసు'లోని 'ఏ దివిలో విరిసిన పారిజాతమో… ', 'సుఖదుఃఖాలు'లోని 'మేడంటే మేడా కాదూ… ' లాంటివి చాలా ఉన్నాయి. పౌరాణిక ప్రత్యేకతలు గలిగిన 'ఏకవీర', 'చెల్లెలి కాపురం' చిత్రాల్లోని పాటలు కూడా వాటికవే ప్రత్యేకం. 'సిరిమల్లె నీవె..', 'మావి చిగురు తినగానే.. ', 'మధుమాస వేళలో…', 'శివరంజని నవరాగిణి..' లాంటి అనేక పాటలు ప్రజలకు కొత్త రుచులు చూపించాయి. సంగీత దర్శకులు మారినప్పుడల్లా పాటల్లోనూ మార్పు కనిపించేది. ఇళయరాజా కాలంలో 'సాగరసంగమం'లోని 'వే వేల గొపెమ్మలా..', 'వేదం అణువణువున …', 'తకిట తధిమి తకిట తధిమి.. ' లాంటి పాటలతో బాలు మరింత ప్రాచుర్యం పొందారు.

ఘంటసాల, ఎస్పీ బాలు కలిసి దాదాపు ఐదారేళ్ళపాటు ఏక కాలంలో పరిశ్రమలోనే ఉన్నారు. కానీ వీరిద్దరూ కలిసి పాడిన పాటలు మాత్రం చాలా తక్కువ. 'ఏకవీర'లోని 'ప్రతీ రాత్రి వసంత రాత్రి…', 'మంచిమిత్రులు'లోని 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ', లాంటివి కొన్ని. కొత్త తరం నటులు సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత వారితో బాలుకు, బాలు పాటల వల్ల వారికి గుర్తింపు లభించింది. ఘంటసాల, ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్ తరహాలోనే ఎస్పీ బాలు, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ వర్కవుట్ అయింది.

Advertisement

Next Story