విచారణ లేకుండా మ్యూటేషనా.. నాట్ సేఫ్..!

by  |
విచారణ లేకుండా మ్యూటేషనా.. నాట్ సేఫ్..!
X

దిశ, న్యూస్‌బ్యూరో : తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టంలో ఎవరైనా భూములను కొనుగోలు చేయగానే గంటలోపే మ్యూటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అంటే ఎవరు కొనుగోలు చేసినా.. ఏ భూమి, ఎవరి ఆధీనంలోనిది అన్న విషయాలేవీ క్షేత్ర స్థాయిలో విచారణ ఉండదు. సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్లి డాక్యుమెంటేషన్ పూర్తి కాగానే వెంటనే రెవెన్యూ లాగిన్‌లోకి వెళ్తుంది. వెంటనే సదరు భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట మారిపోతుంది. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు. భూ రికార్డుల ప్రక్షాళనలో వేలాది మంది కౌలుదారులు రికార్డుల్లో కొనసాగారు. అనుభవదారు లేదా కాస్తు కాలమ్‌లో వారి పేర్లు ఏండ్ల తరబడి వచ్చాయి. ప్రధానంగా గ్రామాల్లోని సంపన్న వర్గాలు, వందల ఎకరాలు కలిగిన పెద్దోళ్ల భూముల్లో చాలా మంది వ్యవసాయం చేసుకునే వారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనతో వారి పేర్లన్నీ తొలగించారు.

అందరూ అనుభవదారులను తొలగించారన్న అపోహలో ఉన్నారు. పట్టాదారులెవరైతే ఉన్నారో వారి పేర్లనే అనుభవదారుడి కాలమ్‌లో చేర్చారు. అయితే కొత్త పహాణీల్లో అనుభవదారుడి కాలమ్ తొలగించారన్నది నిజం కాదు. అందులో పట్టాదారులు, అనుభవదారులు వేర్వేరుగా ఉంటే మార్చారని స్పష్టమవుతోంది. అంటే దశాబ్దాలుగా కాస్తులో ఉన్నప్పటికీ ఎలాంటి సమాచారం లేకుండానే పెద్దోళ్ల భూములన్నీ వారి పేరిట మారిపోయాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వేల పేర్లను తొలగించినట్లు సమాచారం. కేవలం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ భారీ మార్పునకు అధికారులు కారణమయ్యారు. భూస్వాముల చేతుల్లో ఉన్న భూములను సాగు చేసుకుంటూ ఆధారపడిన వేలాది కుటుంబాలకు భూ రికార్డుల ప్రక్షాళన శాపంగా మారింది. ఇప్పుడు ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా చేసే మ్యూటేషన్ ప్రక్రియతో కాస్తులో ఉన్నోళ్ల ప్రస్తావన, ఫిర్యాదుల తావులేకుండా పోతుంది.

తప్పులకు కేంద్రం కంప్యూటర్..

భూ రికార్డుల్లో తప్పులకు కేంద్రం కంప్యూటర్. అంటే కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరే జరిగేది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ రికార్డులు, పొరపాట్లకు వీఆర్వోలు, తహసీల్దార్లు బలయ్యారు. కానీ ఎక్కడా కంప్యూటర్ ఆపరేటర్ పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఓ రెవెన్యూ నిపుణుడు అభిప్రాయపడ్డారు. టెక్నికల్ నాలెడ్జ్ వినియోగంలో ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పులకు వేలాది మంది రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడీ ఆటోమెటిక్ మ్యూటేషన్ ప్రక్రియ ద్వారా తలెత్తే సమస్యలకు ఎవరిని కార్నర్ చేస్తారో వేచి చూడాలి.

అలాగే ప్రభుత్వం దృష్టిలో భూ రికార్డులను కంప్యూటరీకరించినట్లు భావిస్తోంది. అందుకే ఈ కొత్త పద్ధతికి శ్రీకారం చుడుతుంది. అయితే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అమలుకు కూడా అవకాశాలు లేకపోలేదని సమాచారం. అదే గనుక జరిగితే క్షేత్రానికి, కంప్యూటర్‌కు సంబంధం లేకుండా పోతుంది. పెద్దల భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు క్లియరెన్స్ లభిస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయి.


Next Story

Most Viewed