బ్యాంక్‌ను బురిడి కొట్టించిన కేటుగాడు

by Shyam |   ( Updated:2021-12-21 11:09:09.0  )
land
X

దిశ,బేగంపేట : సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్న చందంగా ఉంది ఇతడి తీరు. ఆస్తి తనది కాకపోయినా తప్పుడు ధ్రువపత్రాలతో బ్యాంక్‌లో లోన్ తీసుకుని అటు బ్యాంకర్‌ను, ఇటు భూ యజమానిని బురిడి కొట్టించాడు ఓ వ్యక్తి. ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు తనకు న్యాయం చేయాలని సికింద్రాబాద్ ఆర్టీఓకు మొరపెట్టుకున్నారు. మంగళవారం ఆర్డీఓను కలిసిన అనంతరం బాధితురాలు కాంతమ్మ స్థానిక విలేకరులకు వివరాలను వెల్లడించారు.

తిరుమలగిరి మండలం, జేబీఎస్ సమీపంలోని పికెట్ ప్రాంతానికి చెందిన కాంతమ్మకు సర్వే నంబర్ 481 / 247 లో 2.33 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని రవింద్ర నాయక్ అనే వ్యక్తి సర్వే నంబర్ 481/ 274 లో తన భూమిగా రికార్డులు సృష్టించాడు. ఆ పత్రాలతో యూకే బ్యాంక్ నుండి రుణం తీసుకున్నాడు. ఈ విషయం తెలియని కాంతమ్మ మనవడు వేణుగోపాల్ ఆ ల్యాండ్‌ను డెవలప్మెంట్‌కు ఇవ్వడానికి ప్రయత్నించగా బ్యాంక్ అధికారులు అడ్డుకున్నారు. ఆ భూమిపై లోన్ తీసుకున్నారని, వెంటనే రుణం చెల్లించాలని బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. లేనియడల బుధవారం ఆ భూమిని ఈ-వేలం వేస్తామని తెలిపారు.

అయితే ఇది చట్టవిరుద్ధమని, రెవెన్యూ అధికారులు సర్వే నంబర్లను, రికార్డులను తనిఖీ చేసి భూమిని తమకు అప్పగించాలని వేణుగోపాల్ ఆర్డీవోకు మొరపెట్టుకున్నారు. అలాగే ఈ వేలం పాటను కూడా నిలిపివేయించాలని అభ్యర్థించారు. తమ వినతిపై రెవెన్యూ అధికారులు సానుకూలంగా స్పందించారని, సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చినట్లు కాంతమ్మ, ఆమె మనవడు వేణుగోపాల్ తెలిపారు.

Advertisement

Next Story