- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక్కత్.. కరోనా ఇక్కట్లు
దిశ, నల్లగొండ: ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ చేనేతపైనా ప్రభావం చూపుతోంది. వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగం చేనేత. ఇప్పటికే కోళ్ల పరిశ్రమకు కరోనా దెబ్బతో రాష్ట్రంలో సుమారు రూ.2వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. పౌల్ట్రీ రంగం కుదేలైంది. రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కోళ్ల పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 25 లక్షల మంది విలవిల్లాడుతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ బాటలోనే చేనేత రంగం కుదేలయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో నేతన్నల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చేనేత అంటే పట్టు, ఇక్కత్ కాటన్ చీరలకు ప్రసిద్ధి. సిల్క్ చీరలు నేయడానికి కావాల్సిన ముడి సరుకుల ధరలు కరోనా కారణంగా ఆమాంతం పెరిగాయి. ఇక్కత్, పట్టు చీరలు నేయడానికి కావాల్సిన నూలు, రంగులు చైనా నుంచి దిగుమతి అయ్యేవి. కేంద్ర ప్రభుత్వం దిగుమతులు నిలిపేయడంతో ఒక్కసారిగా నూలు, రంగుల ధరలు రెట్టింపు అయ్యాయి. సిల్క్ నూలు, వార్పు యారన్ ధర కిలోకు రూ.1,500 అయింది. గతంలో ధరలు ఇంత పెరిగిన దాఖలాలు లేవు. ఈ ధరలకు ముడి సరుకులు కొని చీరలు నేస్తే తమకు గిట్టుబాటు కాదని నేతన్నలు వెనుకాడుతున్నారు. దీంతో వారు పట్టణాలకు వలసబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.
చేనేతపై 33 లక్షల మంది..
రాష్ట్రంలో 3.58 లక్షల మంది చేనేత కార్మికులున్నారు. పరోక్షంగా అనుబంధ రంగాలవారు 3 లక్షల మంది వెరసి 6.58 లక్షల కుటుంబాల్లో సుమారు 33 లక్షలమంది చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని ఒక అంచనా. వీరందరి భవితవ్యాన్నీ కరోనా ఛిన్నాభిన్నం చేస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సహకార, సహకారేత రంగంలోని వేలాదిమంది చేనేత కార్మికులు మగ్గాలపై జీవనం సాగిస్తున్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో సుమారు 5 వేలు, నల్లగొండ జిల్లాలో 1,918, సూర్యాపేట జిల్లాలో 60 మగ్గాలున్నాయి. వీటిపై 16,150 మంది కార్మికులకు ఉపాధి లభిస్తున్నది. మగ్గంతోపాటు ఇతర అనుబంధంగా పనిచేస్తున్నవారు 20 వేలమంది వరకు ఉన్నారు. వీరిలో భూదాన్‌పోచంపల్లి, పుట్టపాక, కొయ్యలగూడెం, సిరిపురం, గుండాల, ఆలేరు సిల్క్‌నగర్‌లో సగం మందికిపైగా ఉంటారు. ఇప్పుడు వీరి ఉపాధికి ఎసరు వస్తున్నది.
కిలో నూలుకు రూ.1,500
చీరల తయారీ ప్రక్రియలో మగ్గాలకు యారన్ అవసరం ఉంటుంది. రెండు నెలల కిందట కిలో సిల్కు నూలు ధర రూ.3,100 ఉండగా కరోనా ఎఫెక్ట్‌తో 10 రోజుల్లో రూ.4,250కి చేరింది. వార్పు యారన్ ధర గతంలో రూ.3,200 ఉండగా ప్రస్తుతం 4,800కి చేరింది. దీంతో చేనేత వ్యాపారులు, మగ్గం కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత పదేండ్ల కాలంలో ఒక్కసారిగా సిల్కు, వార్పు యారన్ ధర ఆమాంతం రూ.1,500 పెరగడం ఇదే ప్రథమమని చేనేత వ్యాపారులు చెబుతున్నారు. చేనేత కార్మికులకు లాభాలుండాలంటే నూలే ఆధారం. నూలు ధరల నియంత్రణ లేకపోవడంతో కార్మికులు ఇంటిల్లిపాది నెలంతా పనిచేసినా రూ.10 వేలు గిట్టుబాటు కాదు. కాబట్టి ప్రభుత్వాలు నూలు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.
దరి చేరని 40 శాతం సబ్సిడీ
మార్కెట్‌లో ప్రస్తుతం వార్పు కిలో ధర రూ.4,800, వెఫ్ట్ కిలో రూ.4,500, జరీ (4 బుట్టలు) రూ.420, రంగులు కిలో రూ.1,000 పైనే ఉన్నది. ఒక వార్పు (7 చీరలు) నేయడానికి కిలోన్నర వార్పు, 3.75 కిలోల వెఫ్ట్ మొత్తం కలిపి 5.25 కిలోల నూలు అవసరం పడుతుంది. ఈ లెక్కన వార్పునకు రూ.25,250 ఖర్చు అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయనున్న సబ్సిడీ వల్ల ఒక్కో వార్పుపై రూ.10 వేల వరకు చేనేత కార్మికునికి ఆర్థిక చేయూత లభిస్తోంది. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) ద్వారా కార్డుతోపాటు వీవర్ గుర్తింపుకార్డు కలిగిన మగ్గం నేసే ప్రతి చేనేత కార్మికుడికీ ఎన్‌హెచ్‌డీసీ ద్వారా 10 శాతం సబ్సిడీపై నూలు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత మిత్ర పథకం ద్వారా నూలు, ముడి సరకులపై ప్రతి చేనేత కార్మికుడికీ 40 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. అయితే, ఈ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కావడానికి ముందే దళారులు కాజేస్తున్నారనే విమర్శలూ వస్తున్నాయి.
ఆకాశాన్నంటిన యారన్..
చేనేతకు మూలధారమైన యారన్ ధర ఆకాశాన్నంటింది. కరోనా ఎఫెక్ట్‌తో మన దేశానికి చైనా నుంచి సిల్కు, యారన్ దిగుమతులు లేకుండాపోయాయి. దీంతో పరిశ్రమ కుదేలవుతోంది. చేనేత వస్త్ర ఉత్పత్తిదారులు సైతం వస్త్రాలు నేయించేందుకు భయపడుతున్నారు. విపరీతంగా పెరిగిన నూలు, రంగులు ధరలతో కార్మికులతో మగ్గాలు పెట్టి నేయించినప్పటికీ మార్కెట్‌లో చీరల ధరలు పెంచితే కొనుగోళ్లు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. దీంతో గిట్టుబాటుకాక వస్త్ర వ్యాపారులు మగ్గాలను మూసివేస్తున్నారు. ఇక్కత్, పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచిన రాజధాని శివారులో ఉన్న పోచంపల్లిలో 20 రోజుల్లో 20కిపైగా మగ్గాలు మూతపడటం ఆందోళన కల్గిస్తున్నది. ఇదే లెక్కన రాష్ట్రవ్యాప్తంగా చేనేత కేంద్రాలు గద్వాల, సిరిసిల్ల, పుట్టపాక తదితర ప్రాంతాల్లో చేనేత మగ్గాలు మూలకు పడుతున్నాయి. ఫలితంగా చేనేత మగ్గంపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి కరువై మళ్లీ వలసబాట పట్టే పరిస్థితి నెలకొంది. ఇప్పుడిప్పుడే కోలుకొని మార్కెట్‌లో నిలదొక్కుకుంటున్న చేనేత రంగం చైనా ముడి సిల్కు ధరల పెరుగుదల కారణంగా మళ్లీ సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నది.
Tags : handloom sector, crisis, corona(covid-19)