మహమ్మారి మహా విజృంభణ.. ఒక్కరోజే 3 లక్షలు దాటిన కరోనా కేసులు

by Shamantha N |
మహమ్మారి మహా విజృంభణ.. ఒక్కరోజే 3 లక్షలు దాటిన కరోనా కేసులు
X

న్యూఢిల్లీ : ఏ క్షణంలో కాలుమోపిందో గానీ భారత్‌లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్నది. దేశంలో కొవిడ్ మొదలైనప్పట్నుంచి ఈ పదిహేను నెలల కాలంలో దేశ ప్రజలు వాంచించని రికార్డులను నమోదుచేస్తూ జనాలను, ప్రభుత్వాలను కోలుకోలేని దెబ్బతీస్తున్నది. ఢిల్లీ నుంచి గల్లీకి వ్యాపించి జనాలు ‘ఊపిరి’ తీసుకోకుండా వారి ఆయువు తీస్తున్న ఈ జిత్తులమారి మహమ్మారి.. గురువారం దేశం కోరుకోని రికార్డులను నమోదుచేసింది. రోజూవారీ కేసులలో ప్రపంచంలో ఏ దేశమూ రికార్డు చేయని విధంగా ఏకంగా 3 లక్షలకు మించి కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,14,835 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికా మాత్రమే 24 గంటల్లో 3 లక్షలకు మించి (3,00,310) కేసులు రికార్డు చేసింది. ఇక దేశంలో మరణాలు వరుసగా రెండో రోజూ 2 వేలు దాటాయి. గురువారం ఉదయం నాటికి దేశంలో కరోనా బారిన పడి 2,104 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో దేశంలో కొవిడ్ బారిన పడ్డవారి సంఖ్య 1,59,30,965 కి చేరగా.. 1,84,657 మంది మరణించారు. యక్టివ్ కేసులు 22 లక్షలకు (22,91,428) చేరడంతో ఆ రేటు 14.38 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.16 శాతంగా ఉండగా.. ఇదే సమయంలో దేశంలో కరోనా రికవరీ రేటు 84.46 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

యూఎస్ తర్వాత మనమే…

ప్రపంచంలో రోజూవారీ కరోనా కేసులలో 3 లక్షలకు పైగా నమోదైన దేశాలు యూఎస్, భారత్ మాత్రమే. ఈ ఏడాది జనవరి 2న యూఎస్ లో కరోనా కేసులు 3 లక్షలు (3,00,310) దాటాయి. గురువారం భారత్ లో 3.14 లక్షల కేసులు నమోదుకావడం గమనార్హం. రోజూవారీ కేసులలో యూఎస్, భారత్ తర్వాత ఇప్పటివరకు బ్రెజిల్ (1,00,158) మాత్రమే లక్షకు పైగా కేసులను నమోదు చేసింది. యూకే (68,192), టర్కీ (63,082) లు ఆ తర్వాత జాబితాలో ఉన్నాయి.

భారత్‌లో ఫస్ట్ వేవ్ పీక్స్‌లో ఉన్నా భారత్ లో రోజూవారీ కొవిడ్ కేసులు లక్ష కూడా చేరలేదు. సెప్టెంబర్ 16న దేశంలో నమోదైన 97,860 కేసులే ఈనెల 5 వరకు ఒక రికార్డు. అప్పటి నుంచి దేశంలో కేసులు లక్ష.. లక్షన్నర.. రెండు లక్షలు దాటి మూడు లక్షలకు చేరాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మే 15 వరకు దేశంలో రోజుకు 5 లక్షల కేసులు నమోదైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక వైరస్ స్వైర విహారం చేస్తున్న మహారాష్ట్ర (67,468), ఉత్తరప్రదేశ్ (33,106), ఢిల్లీ (24,638), కర్నాటక (23,338), కేరళ (22,414) లలో కేసుల పెరుగుదల అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నది.

Advertisement

Next Story