మద్యం పాలసీ ఎఫెక్ట్ : పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన పర్మిట్ రూంలు

by Sridhar Babu |
open-permit-rooms 1
X

దిశ, కరీంనగర్ సిటీ : అదనపు రెవెన్యూ కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త మద్యం పాలసీ వైన్ షాపుల నిర్వాహకులకు కామధేనువులా మారింది. మద్యం దుకాణాల ఎదుటే మందు బాబులు మజా చేస్తుండగా, దీనిని నివారిస్తూ మరింత ఆదాయం పొందేందుకు అనుమతించిన పర్మిట్ రూంలు బార్లను తలపిస్తున్నాయి. వీటి ఏర్పాటు కోసం రూపొందించిన నిబంధనలు తుంగలో తొక్కి నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కేవలం నిల్చొని మద్యం తాగి వెళ్లిపోవాల్సిన చోట, కుర్చీలు, బల్లలు వేసి, అవసరమైన తినుబండారాలు కూడా అక్కడికక్కడే తయారుచేస్తూ, అనధికారిక బార్లుగా మారుస్తున్నారు.

లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు యథేచ్ఛగా మందుబాబుల హడావుడి చేస్తున్నారు. జిల్లాలో 40కి పైగా పర్మిట్ రూంలకు అధికారులు అనుమతులివ్వగా, అంతకు మించి ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల ఒక్కో మద్యం షాప్ పక్కన రెండు పర్మిట్ రూములు కూడా కొనసాగుతుండగా పట్టించుకునే వారే కరువయ్యారని పరిసర ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. నిబంధనల మేరకు వీటి కొలతలు 20 చదరపు మీటర్ల నుండి 100 చదరపు మీటర్ల లోపు ఉండి, రూమ్ నాలుగు దిక్కులు గోడలతో పైన స్లాబ్‌తో కూడిన కప్పు ఉండే విధంగా ఉండాలి. ఎక్సైజ్ రూల్స్ 25, 26 గవర్నింగ్ వైన్ షాప్స్ లైసెన్సు నిబంధనలు కూడా ఇదే తెలియజేస్తున్నాయి.

అయితే, వైన్స్ షాపుల నిర్వాహకులు మాత్రం వీటిని బేఖాతరు చేస్తూ అనేక చోట్ల ఆరుబయట, తడకల కింద ఏర్పాటు చేసి అందులో బల్లలు, కుర్చీలు వేసి కొనసాగిస్తున్నారు. పర్మిట్ రూంలకు రెండు ఆపైన సీసీ కెమెరాల ఏర్పాటు చేసి, వాటిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు అనుసంధానం చేయాలి. కానీ, ఏ ఒక్క వైన్ షాప్ నిర్వాహకుడు కూడా దీనిని పాటించటం లేదు. రహదారుల పక్కనే ఉండే పర్మిట్ రూంల ఎదుట మందు బాబులు తమ వాహనాలు పార్కింగ్ చేస్తుండగా, బాటసారుల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ పర్మిట్ రూంలు కూడా నివాస గృహాల మధ్య ఉండటంతో మందు బాబుల అరుపులు, గొడవలు, వెకిలి చేష్టలు, ఉమ్మి వేయడం, సిగరెట్లు తాగడం, వాంతులు చేసుకోవడం, మూత్ర విసర్జన చేయడం, చెడు దుర్వాసన, ఆపరిశుభ్రతతో పర్మిట్ రూంల నిర్వాహకులు నడిపిస్తుంటే వీటి చుట్టూ ఉన్న ఇళ్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, యువతులు, గృహిణులు మానసిక వేదనకు గురవుతున్నారు. ఇళ్ల యజమానులు ఎక్సైజ్, పోలీస్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకున్న నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని, లేనియెడల ఆందోళనలు చేపడుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story