కేన్ విలియమ్‌సన్ డబుల్ సెంచరీ.. కివీస్ భారీ స్కోర్

by Shyam |
కేన్ విలియమ్‌సన్ డబుల్ సెంచరీ.. కివీస్ భారీ స్కోర్
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుస సెంచరీలతో ఇప్పటికే టెస్టుల్లో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా మారిన విలియమ్‌సన్ మంగళవారం డబుల్ సెంచరీ బాదాడు. క్రైస్ట్ చర్చ్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 297కే ఆలైట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ జట్టు మూడో రోజు 659/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. కేన్ విలియమ్‌సన్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. 286/3 ఓవర్‌ నైట్ స్కోర్‌తో న్యూజీలాండ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. హెన్రీ నికోలస్ (157), కేన్ విలియమ్‌సన్ కలసి పాకిస్తాన్ బౌలర్లకు పరీక్ష పెట్టారు.

వీరిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 369 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. రెండో రోజు సెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్‌సన్ అదే దూకుడితో ఆడాడు. అతడికి డారిల్ మిచెల్ (102 నాటౌట్) తోడవటంతో న్యూజీలాండ్‌కు భారీ స్కోర్ అందించాడు. కేన్ విలియమ్‌సన్ 238 (364 బంతుల్లో 28 ఫోర్లు) పరుగులు చేశాడు. రెండో రోజు కేవలం 71 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో కేన్ విలియమ్‌సన్ రెండు రోజుల పాటు క్రీజులో పాతుకొని పోయి కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి హెన్రీ నికోలస్ (157), డారిల్ మిచెల్ (102) సహకరించడంతో మూడో రోజు 659/6 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మరోవైపు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు 8 పరుగులకే ఒక వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఆటలో ఇంకా రెండు రోజులు మిగిలిఉండటంతో పాకిస్తాన్ కనీసం ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలవకుండా అయినా ఆడుతుందేమో చూడాలి.

– పాకిస్తాన్‌పై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన న్యూజీలాండర్‌గా కేన్ విలియమ్‌సన్ రికార్డు. అంతకు ముందు అది మాథ్యూ సింక్లైర్ (204) పేరిట ఉన్నది.

– టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ సరసన నిలిచాడు

– ఈ నాలుగు టెస్టు డబుల్ సెంచరీలలో మూడు సెంచరీలు కేన్ విలియమ్‌సన్ కెప్టెన్‌గానే సాధించాడు.

– స్వదేశంలో పాకిస్తాన్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కేన్ నిలిచాడు.

– ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్‌సన్ 15 వేల పరుగుల మైలురాయిని దాటాడు. టెస్టుల్లో రాస్ టేలర్ (17862), స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ (15319) తర్వాత కేన్ విలియమ్‌సన్ (15011) అత్యధిక పరుగులు చేశాడు.

Advertisement

Next Story