బీజేపీపై టీఆర్ఎస్ ఎదురుదాడి అందుకేనా..? సీఎం యాక్షన్ ప్లాన్ ఇదే!

by Anukaran |   ( Updated:2021-11-15 22:30:11.0  )
బీజేపీపై టీఆర్ఎస్ ఎదురుదాడి అందుకేనా..? సీఎం యాక్షన్ ప్లాన్ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఎత్తులకు పై ఎత్తు వేసేందుకు టీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసే కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. కేంద్రం యాసంగిలో ధాన్యం కొనబోమని చెప్పడంతో ఇప్పటికే మండల, నియోజకవర్గ కేంద్రాల్లో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టగా గ్యాస్, డీజిల్, పెట్రల్ ధరల పెంపు, తెలంగాణపై అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తుంది. టీఆర్ఎస్ ప్రజా, రైతు పక్షమేనని తెలియజేసేందుకు కార్యాచరణ రూపొందించి కార్యక్రమాలను చేపట్టేందుకు పార్టీ అధిష్టానం సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే నేడు శాసన సభాపక్ష సమావేశాన్ని కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో నిర్వహిస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్ల అంశం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం విమర్శ ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. బీజేపీ రైతుల సమస్యలను తెలుసుకునేందుకు కొనుగోలు కేంద్రాల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టి్ంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దూకుడు పెంచింది. దీంతో టీఆర్ఎస్ ఎదురు దాడికి సన్నద్ధమైంది. కేంద్రమే యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని, యాసంగిలో వరి సాగుచేయొద్దని పేర్కొంటుందని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులతో కలిసి ఈ నెల 12న మండల, నియోజకవర్గ కేంద్రాల్లో మహాధర్నాకు శ్రీకారం చుట్టింది.

అంతేగాకుండా కేంద్రం అనుసరిస్తున్న వైఖరీని ఎండగట్టేందుకు బీజేపీ ఎంపీలు, నాయకులు ఎక్కడ తిరిగినా అడ్డుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చింది. దీంతో సోమవారం నల్లగొండ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా నల్లగొండ, మాడ్గులపల్లి మండలాల్లో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను పరిశీలనకు వెళ్లిన పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వావాదాలు చోటుచేసుకోగా, పోలీసులు లాఠీచార్జ్ సైతం చేశారు. దీంతో ధాన్యం అంశం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కాయి.

ఇదిలా ఉంటే గ్యాస్ పై వ్యాట్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ కేంద్రం ప్రజలపై భారం మోపుతుందని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మరో వైపు యాసంగి ధాన్యం కొనుగోలు చేసేంత వరకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు నిరసన కార్యక్రమాలను చేపడతామని పార్టీ అధిష్టానం చేపట్టింది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని ఆపార్టీ నేతలు పొంతనలేని వ్యాఖ్యలు చేస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆ తీరును ఎండగట్టేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు నేడు కేసీఆర్ అధ్యక్షతన మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయడంతో పాటు గ్రామస్థాయిలోని పార్టీ కార్యకర్తలు రైతులకు కేంద్ర వైఖరీ, వరి ధాన్యంపై అనుసరిస్తున్న విధానాలను వివరించాలని సూచించనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షమేనని ప్రజలకు, రైతాంగానికి వివరించనున్నారు. కేంద్ర విధానాలను తూర్పారబట్టడమే లక్ష్యంగా ముందుకు ఎలా వెళ్లాలని కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed