వైఎస్సార్ జయంతిలో ఉత్కంఠ.. జగన్, షర్మిల కలిసేనా?

by Anukaran |
వైఎస్సార్ జయంతిలో ఉత్కంఠ.. జగన్, షర్మిల కలిసేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా తన తండ్రి పేరిట పార్టీ పెట్టేందుకు వైఎస్ షర్మిల సిద్ధమయ్యారు. ఇందుకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. తన పార్టీని జూలై 8వ తేదీన తన తండ్రి జయంతి సందర్భంగా ప్రకటించాలని నిర్ణయించారు. అయితే అదే రోజు ఆమె ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి హైదరాబాద్‌కు వచ్చి అధికారికంగా పార్టీ పేరు, జెండా, ఎజెండాను ప్రకటించనున్నారు. గతంలో తన తండ్రి జయంతికి ప్రతి ఏటా కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్, షర్మిల మధ్య విభేదాలు, వైఎస్సార్ సీపీలో ఆమె చేసిన కృషికి తగిన గుర్తింపు దక్కకపోవడంతోనే తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేస్తోందని రాజకీయ వర్గాల్లో టాక్. ఈసారి వైఎస్సార్ జయంతిలో అన్నా, చెల్లి ఇద్దరూ కలిసి వచ్చి తమ మధ్య విభేదాలు లేవని నిరూపిస్తారా? లేదా వేర్వేరు సమయాల్లో వచ్చి విభేదాలు నిజమనేదానికి మరింత బలాన్ని చేకూరుస్తారా? ఏది ఏమైనా ఈసారి వైఎస్సార్ జయంతిలో ఏం జరగబోతోందోనని ఇటు రాజకీయ వర్గాలు, వైఎస్ అభిమానులు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

విభేదమా? భిన్నాభిప్రాయమా?

ఎపీ సీఎం వైఎస్ జగన్, తన చెల్లి షర్మిల మధ్య ఉన్నవి విభేదాలా? అభిప్రాయ బేధాలా అన్న అంశంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ గతంలోనే లేఖ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆ లేఖలో ‘ఇది వైఎస్ కుటుంబం. అన్నా-చెల్లెల మధ్య విభేదాలు అనేది అబద్ధం. వారిని విడదీయటం ఎవరితోనూ సాధ్యం కాదు. షర్మిల, జగన్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ ఒక వర్గం మీడియా ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేస్తోంది.’ అని విజయమ్మ ఖండించారు. షర్మిల పొలిటికల్ ఎంట్రీ సమయంలోనూ తాను పార్టీ పెడుతున్న విషయం అన్నకు తెలుసని చెప్పారు. అయితే ఏపీలో జగన్ గెలుపులో కీలక పాత్ర వహించిన షర్మిలకు ఎందుకు ప్రాధాన్యత దక్కలేదని అడగ్గా.. అదేదో జగన్ నే అడిగలంటూ షర్మిల సమాధానమిచ్చారు. దీంతో జగన్, షర్మిల మధ్య విభేదాలంటూ గుప్పుమన్నాయి. తెలంగాణలో పార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్న సమయంలో జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల సైతం స్పందించారు. అన్నా చెల్లెల్లిద్దరి మధ్య విభేదాలు లేవని, ఉన్నది కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయంలో జగన్ షర్మిలను వద్దన్నారని స్పష్టం చేశారు. దీని ద్వారా జగన్ కు తన సోదరి తెలంగాణలో పార్టీ ఏర్పాటు ఇష్టం లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఇవన్నీ పొలిటికల్ డ్రామాలని అనుకునేవారే ఎక్కువ. ‘అన్న ఏపీలో తన పని తాను చేసుకుంటాడు.. నా పని నేను తెలంగాణలో చేసుకుంటా’నంటూ షర్మిల చేసిన కామెంట్లు ఇందుకు మరింత బలాన్ని చేకూర్చాయి. కావాలనే జగన్.. షర్మిలను ఇక్కడికి పంపించారని, తెలంగాణలో కూడా చక్రం తిప్పేందుకు వ్యూహం పన్నుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులైతే కేసీఆర్ ఆడిస్తున్న నాటకమని అంటుంటే.. ఇంకొందరేమో బీజేపీకి బీ టీమ్‌గా వచ్చిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

వేర్వేరు సమయాల్లోనే నివాళులు?

చాలా రోజుల గ్యాప్ తర్వాత వైఎస్సార్ జయంతి రోజు కుటుంబమంతా ఒకే వేదికపై కలుస్తుందని అభిమానులు భావించారు. అయితే వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించేందుకు వైఎస్ షర్మిల, జగన్ ఇద్దరూ వేర్వేరు సమయాల్లోనే వచ్చే అవకాశముందని లోటస్ పాండ్ వర్గీయుల్లో చర్చ నడుస్తోంది. వాస్తవానికి ప్రతి ఏటా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చేవారు. ఈసారి తన అన్నతో షర్మిలకున్న విభేదాలు, తెలంగాణలో పార్టీ ఏర్పాటు నేపథ్యంలో ఇద్దరూ వేర్వేరు సమయాల్లో అక్కడకు చేరుకుని నివాళులర్పించే అవకాశముంది. అయితే గతేడాది డిసెంబర్ నుంచే తెలంగాణలో తన రాజకీయ ఎంట్రీ గురించి షర్మిల సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకే పోయిన సంవత్సరం క్రిస్మస్ వేడుకలకు కూడా కుటుంబ సభ్యులతో హాజరుకాలేదని సమాచారం. నిజానికి ప్రతి ఏటా క్రిస్మస్‌కు పులివెందులలో, వైఎస్సార్ జయంతి రోజున ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడం ఆ కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. క్రిస్మస్ వేడుకలకు జగన్ పులివెందులకు వెళ్లినా.. విభేదాల నేపథ్యంలో గతేడాది క్రిస్మస్‌కు కూడా షర్మిల హాజరుకాకపోవడంతో ఆ ట్రెండ్‌కు బ్రేక్ పడినట్లయింది. జూలై 8వ తేదీన జయంతికి కూడా బ్రేక్ పడే అవకాశాలే కనిపిస్తున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

విభేదాలకు భారతి కారణమా?

వైఎస్ షర్మిల, జగన్ కు మధ్య విభేదాలకు కారణం జగన్ సతీమణి భారతి కారణమా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానాలు చెబుతున్నాయి. ఒక వేళ అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే సీఎం సీటు ఎవరికివ్వాలనే విషయంలో అక్కడి నేతలు షర్మిల పేరును ప్రస్తావించినట్లు గతంలో వినిపించాయి. దీంతో జగన్ కు ప్రత్యామ్నాయంగా షర్మిల ఎక్కడ ఎదుగుతుందోననే భయం, ఆ పీఠం తనకే దక్కదనే భావనతో భారతి కావాలనే షర్మిలను దూరంపెట్టింది. ఏపీలో మరో పవర్ సెంటర్ లా షర్మిల మారే అవకాశముందని పసిగట్టిన ఆమె షర్మిలకు సెకండ్ గ్రేడ్ నేతలకు ఇచ్చే ప్రియారిటీ కూడా ఇవ్వలేదని వార్తలొచ్చాయి. జగన్ జైల్లో ఉన్న సమయంలో పాదయాత్రలతో ప్రజలకు చేరువై ఎంతో శ్రమించిన షర్మిలకు కనీసం పొలిటికల్ స్కోప్ లేకుండా చేయడంతో పాటు, తన అన్నను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అంతలా కష్టపడిన తనకు సీఎం అయ్యాక పక్కన పెట్టేయడం షర్మిలకు నచ్చకపోవడంతోనే తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే భారతి ప్రాతినిధ్యం వహిస్తున్న సాక్షి మీడియాపై ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ఉద్యోగ దీక్ష సమయంలో షర్మిల ‘మీరెలాగూ మాకు కవరేజ్ ఇవ్వరు.. పక్కకు తప్పుకోండి’ అని చురకలంటించడానికి కారణమిదేనన్నట్లుగా తెలుస్తోంది.

విజయమ్మ వ్యూహంతోనే కొత్త పార్టీ?

షర్మిలకు తన అన్నతో విభేదాలు వస్తే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టాల్సిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అక్కడ ప్రత్యామ్నాయంగా ఎదిగి ఆయననే ఢీ కొట్టాల్సిందని వారు పేర్కొన్నారు. అయితే తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు వైఎస్ విజయమ్మ వ్యూహం రచించిచనట్లుగా తెలుస్తోంది. కొడుకు భవిష్యత్‌ను అగమ్యగోచరంలో పడేయకుండా ఉండాలంటే తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు షర్మిలను బుజ్జగించినట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపైనా భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఏపీలో జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒక ప్రాంతంలో విజయమ్మ, మరో రాజధానిలో షర్మిల, మరో చోట జగన్ పూర్తిస్థాయిగా పనిచేసి మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచనలు చేస్తున్నవారూ లేకపోలేదు.

అన్నకు వ్యతిరేకంగా పోరాటం!

గతంలో జగనన్న వదిలిన బాణాన్ని అని గర్వంగా చెప్పుకునే షర్మిల.. తెలంగాణలో పార్టీ ఏర్పాటు అనంతరం ఇప్పటి వరకు ఏ సభలో, ఏ సమావేశంలో కానీ తన తండ్రి పేరు తప్పా.. కనీసం ఒక్కసారి కూడా తన అన్న పేరును ప్రస్తావించలేదు. జగన్ జైలులో ఉన్న సమయంలో ఆయన రాజకీయా భవిష్యత్ కోసం పాదయాత్రలు చేసి ప్రజలకు చేరువైన షర్మిల తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తే ఎవరితోననైనా పోరాటం చేయడానికి సిద్ధమని ఒక సందర్భంలో ఆమె ప్రస్తావించింది. ఇటీవల కూడా కృష్ణా జలలా విషయంలోనూ షర్మిల తెలంగాణకు సంబంధించిన ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని, అవసరమైతే తన అన్న జగన్ ప్రభుత్వంతో కూడా పోరాడుతానని ప్రకటించి తన స్టాండ్ తెలంగాణ ప్రజల వైపే అని కుండబద్దలు కొట్టింది. కృష్ణా జలాలపై అన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణకు అనుకూలంగా ఆమె ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో షర్మిలకు వ్యతిరేకంగా ఏపీ పరిరక్షణ సమితి సభ్యులు లోటస్ పాండ్‌ను ముట్టడికి కూడా యత్నించారు.

అన్నా, చెల్లెలి కోసం అభిమానులు వెయిటింగ్

గతంలో 2019 ఎన్నికల సమయంలో పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జగన్ ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద నుంచే ప్రకటించారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినా.. జగన్ క్యాంపు నుంచి ఇప్పటి వరకు ఎక్కడా వ్యతిరేక వ్యాఖ్యలు లేవు. జగన్ జైల్లో ఉన్న సమయంలో, 2019 ఎన్నికల ప్రచారం వరకూ తన అన్న కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారనే విషయాన్ని జగన్ అభిమానులెవరూ మరిచిపోలేదు. తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర, 2012లో జరిగిన ఉప ఎన్నికల కోసం తల్లితో కలిసి ప్రచార బాధ్యతల్లో షర్మిల కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లోనూ బై.. బై.. బాబు నినాదంతో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన అంశాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే వైఎస్సార్ జయంతిలో జగన్, షర్మిల కలుస్తారా లేదా అనే విషయం హాట్ టాపిక్‌‌గా మారింది. వారి రాక కోసం అక్కడి ప్రజలు, అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అన్నా చెల్లెల్లిద్దరూ కలిసి వస్తే.. జరుగుతున్న ప్రచారాలన్నింటికీ ఒకే సమాధానం అన్నట్లుగా నాటి ఆప్యాయతలతో కనిపిస్తారా? లేదా అనేది అభిమానుల్లో ఆసక్తికర అంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed