మరోసారి ‘లాక్’ అవనున్నామా..? నివురుగప్పిన నిప్పులా కరోనా

by Anukaran |
Lockdown again
X

దిశ, వెబ్‌డెస్క్: సరిగ్గా ఏడాది క్రితం మాట.. దేశంలో కరోనా వ్యాప్తి అప్పుడప్పుడే మొదలై రోజుకు యాభై, అరవై కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి గాను 2020 మార్చి 22న జనతా కర్ఫ్యూను విధిస్తున్నట్టు ప్రధాని మోడీ అంతకంటే రెండు రోజుల ముందు ప్రకటించారు. దీనికి జనం కూడా భారీగానే స్పందించారు. దేశానికి తాళమేసారా..? అన్న చందంగా దానిని పాటించారు. జనతా కర్ఫ్యూ పూర్తైన తర్వాతరోజే మరోసారి దేశ ప్రజల ముందుకు వచ్చిన ప్రధాని మోడీ.. 14 రోజులు పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తున్నట్టు తెలిపారు. మరో నాలుగు రోజులైతే దేశం తొలి లాక్‌డౌన్‌ను చవిచూసి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో మరోసారి అలాంటి పరిస్థితులే తప్పేలా లేవు. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు దానినే సూచిస్తున్నాయా..? నగరాల బాట వీడి గ్రామాలకు కాలినడకన వచ్చిన ప్రజలు కొద్దిరోజుల నుంచే తిరిగి పట్టణాలకు చేరుకుంటున్నారు. కానీ నివురుగప్పిన నిప్పులా విజృంభిస్తున్న కరోనా.. మరోసారి వారి బతుకులను రోడ్డున పడేయనుందా..? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు మళ్లీ కష్టాలు తప్పవా..? దేశం మరో కఠిన లాక్‌డౌన్‌ను ఎదుర్కోనుందా..? నానాటికీ పెరుగుతున్న కేసులు దేనికి సంకేతం..?

గతేడాది మార్చి 23న దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు 478. మృతులు 9 మంది. సంపూర్ణ లాక్‌డౌన్‌లో 30 రాష్ట్రాలు. 500 కేసులు కూడా నమోదుకాకముందే దేశమంతా అల్లాడింది. కానీ నవంబర్ తర్వాత దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మాయదారి మహమ్మారికి వ్యాక్సిన్ కూడా రావడంతో జనాలు అప్పటి నిబంధనలను పాటించడంలేదు. అసలు మాస్కు ధరించడం అంటే అదేదో మాకు సంబంధం లేని వ్యవహారం అన్న విధంగా మారిపోయారు. ఇదే రంగులు మార్చే మహమ్మారి కరోనా వ్యాప్తికి ఊతమిస్తున్నది. క్రమంగా మళ్లీ పాతరోజులను గుర్తుకు తెస్తూ స్వైర విహారం చేస్తున్నది. గడిచిన ఇరవైరోజులుగా కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా గడిచిన వారం రోజులుగా దేశంలో కరోనా కేసులు రోజుకు 25 వేలకు పైనే నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తున్నది.

పెరుగుతున్న కేసులు..

గడిచిన ఆరు రోజుల్లోనే దేశంలో కరోనా కేసులు ఏకంగా సుమారు లక్షా 80 వేలకు పైగా నమోదవడం గమనార్హం. ఈ నెల 14న 25,320 కరోనా కేసులు నమోదు కాగా తర్వాతి రోజుల్లో వరుసగా 26,291.. 24,492.. 28,903.. 35,871.. 39,726 గా ఉన్నాయి. ఇక శనివారం (ఉదయం పది గంటల వరకు) 40,953 కేసులు నమోదయ్యాయి. సుమారు నాలుగు నెలల తర్వాత (నవంబర్ 29న నలభై వేల కేసులు నమోదయ్యాయి) ఈ స్థాయిలో రోజూవారి కేసులు రావడం ఆందోళనకు గురి చేస్తున్నది.

అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..

కరోనా ఉధృతి పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న మహారాష్ట్రలోని ముంబయి, పూణెతో పాటు ద్వితీయ, తృతీయ స్థాయి నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను కఠినతరం చేశారు. కంటైన్‌మెంట్ జోన్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని మూడు ప్రధాన నగరాలు భోపాల్, ఇండోర్, జబల్‌పూర్‌లో ఆదివారం ఒకరోజు సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. శుక్రవారం మధ్యప్రదేశ్ లో వేయికి పైగా కేసులు రావడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కేసుల పెరుగుదల ఇలాగే ఉంటే లాక్‌డౌన్ నిబంధనలను పొడిగించే అవకాశం ఉన్నదని అధికారులు అంటున్నారు. ఢిల్లీ, కర్నాటక, రాజస్థాన్, పంజాబ్ లలోనూ రోజూవారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. దీంతో ఆ రాష్ట్రాలు కూడా ఆంక్షలను కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు కేంద్రం కూడా కరోనా వ్యాప్తి నియంత్రణ, నిఘా, జాగ్రత్తల కోసం జారీ చేసిన మార్గదర్శకాలను ఈనెల 31 దాకా పొడిగిస్తున్నట్టు తెలిపింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలను పాటించాలని అన్ని రాష్ట్రాల సీఎస్ లను ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed