కాంగ్రెస్ ఆశలన్నీ ‘జానా’పైనే.. సమరమా.. సన్యాసమా?

by Anukaran |
Janareddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​కు గ్రేటర్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీదాకా.. ఏ ఎలక్షన్‌ వర్కవుట్‌ కాకపోవటంతో సాగర్‌పై గురిపెట్టింది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్​దే పైచేయి అన్నట్టుగా ఉన్నా… సమీకరణాలు మారుతున్నాయని అంచనా వేస్తున్నారు. బీజేపీ నుంచి రవి కుమార్​ నాయక్​ను బరిలోకి దింపడంతో కాంగ్రెస్​ ఓటు బ్యాంకుకే ప్రమాదమని రాజకీయ విశ్లేషకుల వాదన. అటు సానుభూతితో పాటుగా సంక్షేమ ఓటు బ్యాంకును నమ్ముకున్న టీఆర్ఎస్​ బాస్… నోముల తనయుడు భగత్​ను బరికి దింపారు. దీంతో బీసీ ఓట్లతో పాటుగా సానుభూతి కలిసి వస్తుందనే ఆశ. ఈ లెక్కన ఓటింగ్​లో జానారెడ్డి ఓట్లకే గండి పడుతుందనుకుంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఏడు పర్యాయాలు ఒకే సెగ్మెంట్​ నుంచి ప్రాతినిధ్యం వహించిన జానారెడ్డికి ఈసారి సెగ్మెంట్​ ప్రజలు పట్టం కడుతారా అనేది ఇప్పుడు హాట్​ టాపిక్. ఒకవేళ జానాకు పట్టం కడితే టీపీసీసీ రేసులో ముందున్నట్టే. అంచనాలు కూడా తలకిందులై జానా మళ్లీ ఓడితే ఇక రాజకీయ సన్యాసమే అంటున్నారు.

కాంగ్రెస్ ట్రెండ్ మారేనా..?

మరోవైపు కాంగ్రెస్​ ఇటీవల కాలంలో ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేక వెనకబడుతోంది. దుబ్బాక నుంచి మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ దాకా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్టుగా పోరుసాగింది. మండలిలో కూడా అదే జరిగింది. దీంతో కాంగ్రెస్​ పార్టీ నాగార్జునసాగర్‌ బై ఎలక్షన్‌లోనైనా ట్రెండ్‌ మార్చాలని వ్యూహం వేస్తోంది. ఎంత చేసినా నాయకులెవ్వరూ అనుకున్న స్థాయిలో కలిసి రావడం లేదు. కానీ సాగర్​లో కలిసి పని చేద్దామంటే ఓ వర్గంతో జానారెడ్డి వైరం పెట్టుకున్నారు. ఇలాంటి పరిణామాల్లో జానా గెలుపు సాధ్యమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పట్టం కడుతారా..?

మండలి ఎన్నికల్లో ఓటమితో సీనియర్​ నేత చిన్నారెడ్డి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని శపథం చేశారు. మరోవైపు ఉత్తమ్​ గడ్డం శపథం కొనసాగుతూనే ఉంది. వరుసగా ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలవుతున్న హస్తం నేతల్లో నైరాశ్యం నెలకొంది. సాగర్​ ఉప ఎన్నికల్లో జానా కీలకమవుతున్నారు. జానారెడ్డికి పెట్టనికోటగా ఉండే సాగర్​లో 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్​జెండా ఎగిరింది. ఇక్కడ ఈసారి జానారెడ్డి గెలుస్తారని ఒకింత ప్రచారం ఉన్నా… టీఆర్ఎస్​ఉన్నఫళంగా దూకుడు పెంచింది. మండలిలో… రెండు పట్టభద్రుల స్థానాల్లో విజయం దక్కడంతో రాష్ట్రమంతా మా వెంటే ఉన్నారనే ధీమాతో గులాబీ దళం జోరు పెంచింది. సాగర్​లో గెలిచి పట్టు మాదేననే సంకేతాలివ్వాలనుకుంటోంది.

కుమారుడిని పోటీలో దింపాలనుకున్నా..

ఇక సాగర్​లో జానారెడ్డిపైనే కాంగ్రెస్​ ఆశలు పెట్టుకుంది. ఒకదశలో టీఆర్​ఎస్​ కూడా జానారెడ్డికి అనుకూలంగా ఉందంటున్నట్లుగా నమ్మించింది. కానీ కారణాలేమైనా ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు జానారెడ్డి కొంత తటపటాయించారు. తన కొడుకు రఘువీర్​ను పోటీకి దింపే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ అధిష్టానం మాత్రం ఒప్పుకోలేదు. నోముల మరణించిన నాటి నుంచే జానారెడ్డిని అభ్యర్థిగా ప్రకటనలు చేసింది. ఇదే సమయంలో ఇద్దరు కొడుకులతో జానా నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. అయినా పోటీపై అనుమానాలున్న నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ రెండోసారి ప్రకటన చేయాల్సి వచ్చింది. జానారెడ్డి అభ్యర్థి అంటూ ఖరారు చేసింది.

కలిసి వచ్చేదెవరు?

ఇప్పుడు సాగర్​లో పరిస్థితిపై కాంగ్రెస్​ శ్రేణుల్లో… ప్రధానంగా జానారెడ్డికి కొంత భయం పట్టుకుందని పార్టీ నేతల టాక్. సాగర్​లో జానారెడ్డి గెలుస్తారనే ప్రచారం ఉన్నా… క్షేత్రస్థాయిలో మాత్రం నమ్మకం కుదరడం లేదు. అందుకే ముందస్తుగా జానారెడ్డి పోటీకే అయిష్టంగా ఉంటున్నారని నేతల్లో ప్రచారం ఉంది. మరోవైపు పార్టీ నేతల మధ్య సయోధ్య లేదు. జానారెడ్డి ఇటీవలే రేవంత్​వర్గాన్ని టార్గెట్​ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వర్గం ఎంత మేరకు పని చేస్తుందనేది అనుమానమే. అటు ఉత్తమ్​, కోమటిరెడ్డి మధ్య విభేదాలు పాతవే. పైకి మాత్రం జానాను గెలిపించుకుంటామని ప్రకటించుకుంటున్నా ఎంత మేరకు కలిసి పని చేస్తారో అంతుచిక్కడం లేదు.

రాజకీయ సన్యాసమే

కాంగ్రెస్​ నేతలు ఎన్నికల్లో ఓటమిపాలైతే ఎన్నికలకు దూరంగానే వ్యవహరిస్తున్నారు. చిన్నారెడ్డి ఏకంగా ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాలు… ఎన్నికలకు దూరంగా ఉంటానన్నట్లే చెప్పారు. ఇప్పుడు సాగర్​లో జానారెడ్డి గెలిస్తే… పార్టీలో కూడా మంచి పదవే ఉంటుందనే ప్రచారం ఉంది. ఒకవేళ ఓడిపోతే… ఇక జానాకు రాజకీయ సన్యాసమేనా అనే టాక్​ కూడా ఉంది. ఇప్పటికే రాజకీయాలకు దూరంగా ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. 2018 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో తిరగడం తగ్గించారు. ఉప ఎన్నికలు రావడంతో కొడుకులను వెంట బెట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు సాగర్​లో గెలువకుంటే ఇక జానా రాజకీయాల నుంచి తప్పుకుంటాడని పార్టీ నేతలే చెప్పుతున్నారు. దీంతో సాగర్​ ఎన్నికలు జానారెడ్డిని రాజకీయాల్లో ఉండనిస్తాయా… తప్పుకునేలా చేస్తాయా అనేది పార్టీలో జోరుగా నడుస్తున్న చర్చ.

Advertisement

Next Story